• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

14, ఫిబ్రవరి 2013, గురువారం


సీతా రాముల కళ్యాణ వైభవము

ఇట్లు శ్రీరామచంద్రుని సత్త్వ సంపదకు మెచ్చి, సంతోషించి, జనక మహారాజు వివాహంబు సేయువాఁడై రమ్మని దశరథేశ్వరుని పేరిట శుభలేఖలు వ్రాయించి పంచిన, దశరథ మహారాజును నా శుభ లేఖలం జదివించి, సంతోషంబున నానంద బాష్పంబులు గ్రమ్ముదేర మంత్రి ప్రవరుండగు సుమంత్రునిం బిలిపించి, "సుమంత్రా యిపుడు మన మందఱమును బయలుదేఱి, మిథిలా పట్టణంబునకుం బోయి, యట జనక మహారాజు నింట మన
రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు వివాహ మహోత్సవము జరుపవలయుఁ, గావున వశిష్టాది ద్విజ వర్యులను గౌసల్యాది కాంతా జనమ్మును, నరుంధతి మొదలగాఁగల భూసుర భార్యలను మఱియు సకల బంధు జనంబును రావించి, బంగరుటరదంబుల నిడికొని దోడ్కొనిరమ్మని యంపిన నతండును మహా ప్రసాదంబని తక్షణము యంతహ్పురంబునకుంబోయి, కౌసల్య కైక సుమిత్ర మొదలుగాఁ గల ముత్తైదువలను మిగిలిన సకల బంధు
జనమ్మును రావించి, యుక్త ప్రకారమ్ముగాఁ గనక రథమ్ములపై నిడికొని, దశరథ మహారాజు కడకుం గొనివచ్చిన, యంత దశరథుండు పుత్ర ద్వయసహితమ్ముగ రథ మారోహించి, సమస్త సేనా సమన్వితుండగుచు వాద్య ఘోషంబులు దశ దిశలు నిండ, నడుచుచున్న సమయమ్మున; నంతకు ముందు జనక భూవల్లభుండు దశరథ మహీపాలు నెదుర్కొని, తోడితెచ్చి, యడుగులు గడిగి, యర్ఘ్యపాద్యాది విధుల విధ్యుక్తంబుగాఁ బూజించి, మానితం బుగఁ గానుక లొసంగి, సకల సంపత్సంపూర్ణమయిన నివేశముంగల్పించి, యందుఁ బెండ్లివారిని విడియించె, నంత
నక్కడఁ గనక వికారమైన పీఠమ్ముపైఁ గూర్చున్న సమయమ్మున "దేవా! శుభముజూర్తంబాసన్న మగుచున్నది ర" మ్మని వశిష్టుండు సనుదేర, నాతఁదు సని,  రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు మంగళ స్నానమ్ముఁజేయించి, నిర్మలాంబరాభరణంబు లొసంగి, వేర్వేఱ నొక్క ముజూర్తమునందున కూఁతు సీతను శ్రీరామచంద్రునకును,
దన తమ్ముఁడు కుశధ్వజుని కూఁతు లగు మాండ వ్యూర్మిళా శ్రుత కీర్తులను భరత లక్ష్మణ శత్రుఘ్నులకును నిచ్చి, వివాహముం జేసి, తన ప్రియ తనయల కొక్కొకతెకు నూఱేసి భద్ర గజమ్ములను, వేయేసి తురంగంబులును, బదివేలు దాసీ జనమ్మును, లక్ష ధేనువులును నరణంబులిచ్చి, దశరథాది రాజలోకమ్మునకు బహుమానమ్ముగా నవరత్న ఖచిత భూషణమ్ములును, జీని చీనాంబరమ్ములును నొసంగి, సుగంధి ద్రవ్యములనర్పించి, జించియంపె; నంతదశరథ మహారాజు మరలి యయోధ్యా పట్టణంబునకు వచ్చుచుండఁగా మధ్యేమార్గంబున. ||83||

దశరథరాముని గని పరశురాముని యథిక్షేపము

ఆ. పరశురాముఁ! డడ్డుపడి వచ్చి, మీ నామ
మెవ్వ రనిన, మొలక నవ్వుతోడ
నేను దశరథుండ, నితడు నా పుత్త్రుండు,
రాముఁ డంద్రు పేరు, భీమ బలుఁడు ||84||

వ. అని వినిపించినఁ గ్రోధావేశవశంవదుండై యప్పు డ ప్పరశు రాముండు రాముంగనుంగొని యిట్లనియె; ||85||

క. రాముఁడు నేనై యుండఁగ
నామీఁద నొకండు గలిగెనా మఱి? యౌఁగా
కేమాయె రణ మొనర్పఁగ
రామా రమ్మునుచుఁ బరశురాముఁడు పిలిచెన్ ||86||

వ. పిలిచినతోడనే రామచంద్రుం డతని కిట్లనియె ||87||

ఆ. బ్రాహ్మణుండ వీవు పరమ పవిత్రుండ
వదియుఁ గాక భార్గ వాన్వయుండ
వైన నిన్నుఁ దొడరి యాహవ స్థలమున
జగడ మాడ నాకుఁ దగునె చెపుమ ?
వ. అనిన విని పరశురాముం డిట్లనియె; ||89||

ఉ. శస్త్రముఁ దాల్చినం దగునె ? సన్నుతి కెక్కిన భార్గవుండనన్
శాస్త్రము గాదు, నా కెదిరి సంగర భూమిని నిల్చినంతనే
శస్త్ర ముఖంబులన్ నృపులఁ జక్కుగఁ జేయుఁదుఁగాన నిప్పుడున్
శస్త్రము శాస్త్రముం గలవు సాహస వృత్తిని రమ్ము పోరఁగన్. ||90||

వ. అనిన రామచంద్రుం డిట్లనియె; ||91||

విను, మావంటి నృపాలురైనఁగలనన్ వీరత్వముం జూపఁగా
ననువౌఁగాక, మహానుభావుఁడవు విన్నాలంబులో మీఱఁగా
నెనయన్ ధర్మువె మాకుఁ జూడ ? మఱి నీ వేమన్న నీ మాటకుం
గనలన్ బంతము కాదు మా కెపుడు దోర్గర్వంబు మీ పట్టున్ ||92||

వ. అనిన విని యెంతయు సంతోషించి భార్గవరాముం డా రఘురామునితో నిట్లనియె; ||93||

ఆ. శివుని చివుకు విల్లు శీఘ్రంబె యలనాఁడు
విఱిచినాఁడ ననుచు విఱ్రవీఁగ
వలదు, నేఁడు నాకు వశమైన యీ చాప
మెక్కు పెట్టితివియు మింతె చాలు ||94||

ఉ. రాముఁదు గీముఁ డంచును ధరా జనులెల్ల నుతింప దిట్టవై
భీముని చాపమున్ విఱిచి ప్రేలెద వందుల కేమిగాని, జీ
శ్రీ మహిళేశు కార్ముకముఁ జేకొని యెక్కిడుదేని నేఁడు నీ
తో మఱి పోరు సల్పి పడఁద్రోతు రణస్థలి నీ శరీరమున్. ||95||

శ్రీరాముఁడు పరశురాముని నారాయణ చాపముతోఁగూడ విష్ణు తేజము నందికొనుట

చ. అని తన చేతివిల్లు నృపు లందఱుఁ జూడగ నంది యీయ, నా
ధనువును గూడి తేజముఁ బ్రతాపము రాముని జెందె, నంతనే
జనవరుండా శరాసనముఁ జక్కఁగ నెక్కిడి వాఁడి బాణ మం
దున నిడి యేది లక్ష్యమనఁ ద్రోవలు సూపినఁద్రుంచె గ్రక్కునన్ ||96||

వ. ఇట్లు మహా ప్రతాపంబున నా విలు ద్రుంచి, యనర్గల ప్రతాపమ్మున భార్గవ
రాము దోర్గర్వంబు నిర్గర్వంబు గావించి, జయమ్ముఁ గైకొన్న కుమారుని
గౌఁగిలించుకొని, దశరథుండు కుమార చతుష్టయమ్ముతో నయోధ్యా నగరంబు బ్రవేశించి
సుఖోన్నతి రాజ్యంబు నేలుచున్న సమయంబున, ||97||

శా. పారావార గభీరికిన్, ద్యుతి లస త్పద్మారికిన్, నిత్య వి
స్ఫారొదార విహారికిన్, సుజన రక్షా దక్షారికిన్
సారాచార విచారికిన్ మద రిపు క్ష్మాపాల సంహారికిన్
వీరా సాటి నృపాలకుల్? దశర థోర్వీనాథ జంభారికిన్ ||98||

వ. అని కొనియాడఁ దగిన నృపాల శేఖరుఁడు ధర్మమార్గంబు నొక్కింత యేనిఁ దప్పకుండ రాజ్యంబు సేయుచుండె ననుట విని నారదుని వాల్మీకి మహా మునీశ్వరుందట మీఁది కథావిధానం బెట్టిదని యడుగుటయు. ||99||

ఆశ్వాసాంత పద్య గద్యములు

క. కమలాక్ష ! భక్త వత్సల!
జలజాసన వినుత పాద జలజాత ! సుధా
జలరాశి చారు హంస ! జానకి నాథా ! ||100||

గద్యము

ఇది శ్రీ గౌరీశ్వర వరప్రసాద లభ్ద గురు జంగమార్చన వినోద సూరి జన వినుత కవితా చమత్కారాతుకూరి కేసనసెట్టి తనయ మొల్ల నామధేయ విరచితంబైన శ్రీ రామాయణ మహాకావ్యంబునందు బాలాకాండము సర్వము నేకాశ్వము.


సీతారాముల కళ్యాణ ఘట్టంలో ఇంత పెద్ద గద్యం ఎందుకు రాయాల్సొచ్చిందో తెలీదు. అయిన ఇవన్నీ మామూలే కానీ...ధనస్సు విరిగిన తర్వాత జనక మహారాజు శ్రీరాముని తండ్రి దశరధ మహారాజును ఆహ్వానిచడం, అక్కడ జనకునికి సత్కారం, కన్యావరణం నిమిత్తం ఇరు వంశాల వివరణ ఉంటుంది అది కొంచెం చూద్దాము. మొల్లమ్మ వదిలేసిన విషయము అది మనము చూద్దాము.

కన్యావరణ సమయంలో వశిష్ట మహర్షి పురోహితుని తో కలసి జనకుని తో ఇలా అన్నాడు: 
బ్రహ్మ నుండి మరీచి, వాని నుండి కశ్యపుడు, వానినుండి వివశ్వంతుడు, వానినుండి వైవస్వతుడు (అందుకే మనం మంత్రాలలో వైవస్విత మన్వంతరే అంటూ ఉంటాము) వాని కుమారుడు ఇక్ష్వాకుడు, ఆయన పుత్రుడు కుక్షి, వానికి వికుక్షి, వానికి బాణుడు,  వానికి నరణ్యుడు, వానికి పృధువు, వానికి త్రిశంకువు, వానికి ధుంధుమారుడు, వానికి యువనాశ్వ్వుడు, వానికి మాంధాత, వానికి సుసంధి, వానికి ధ్రువసంధి ప్రశేనజిత్ అనే వారలు, ధ్రువసంధికి భరతుడు, వానికి అశితుడు, వానికి సగరుడు, వానికి అసమంజుడు, వానికి అంశు మంతుడు, వానికి దిలీపుడు, వానికి భగీరధుడు, వానికి కకుత్సుడు,వానికి రఘువు, వానికి కల్మష పాదుడు, వానికి శంఖణుడు, వానికి అగ్నివర్ణుడు, వానికి శీఘ్రగుడు, వానికి మరువు, వానికి ప్రశుశ్రుకుడు, వానికి అంబరీషుడు, వానికి నహుషుడు, వానికి యయాతి, వానికి నాభాగుడు, వానికి అజుడు, వానికి ఇదిగో ఈ దశరధుడు, ఈ దశరధుని కుమారులే ఈ రామ లక్ష్మణులు అని వంశ వృత్తంతం అంతా వశిష్టుల వారిచేత వాల్మీకి మహాముని చెప్పించాడు.


అని పలుకగా... జనక మహారాజు చేతులు జోడించి మా వంశ వృత్తాంతం కూడా వినండి అని చెప్పసాగాడు...మా వంశంలో పరమ ధర్మాత్ముడు "నిమి" మొదటి వాడు.. వానికి మిధి, వానికి జనకుడు, వానికి ఉదావసుడు, వానికి నందివర్ధనుడు, వానికి కేతువు, వానికి దేవరాతుడు, వానికి బృహద్రధుడు, వానికి మహావీరుడు,వానికి ధృతిమంతుడు, వానికి సుధృతి, వానికి ధృష్టకేతువు, వానికిహర్యశ్వుడు,  వానికి మరువు వానికి ప్రతీంధకుడు, వానికి కీర్థి రధుడు, వానికి దేవ మీఢుడు, వానికి బుధుడు, వానికి మహీధ్రకుడు, వానికి కీర్తితుడు, వానికి మహా రోముడు, వానికి స్వర్ణ రోముడు, వానికి హ్రస్వ రోముడు, వానికి మేము ఇద్దరమూ అని వంశ వృత్తాంతాన్ని వివరించాడు జనకుడు.

అప్పుడు విశ్వా మిత్రుడు ఇరు వంశాలు చాలా ప్రతిష్టగలవి అని చెప్పి, మీ తమ్ముని కుశధ్వజుని కుమార్తెలగు మాండవి శృతకీర్తులను మా భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం గావింపమని కోరి...ఆ వివాహములను జరిపించారు.

పరశురామ వృత్తాంతం ఏమిటో తర్వాత చూద్దాము. స్వస్తి.

కామెంట్‌లు లేవు: