• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

11, ఫిబ్రవరి 2013, సోమవారం

మొల్ల రామాయణము - 21


రాజ కుమారులు శివ చాపమును గదల్ప నోడుట

క. విల్లా? యిది కొండా? యని
తల్లడపడి సంశయంబు తలకొన మదిలో
బల్లిదు లగు నృప నందను
లెల్లరు దౌ గవుల నుండి రెంతయు భీతిన్ ||69||

క. కొందఱు డగ్గఱ నోడిరి,
కొందఱు సాహసము చేసి కోదండముతో
నందంద పెనఁగి పాఱిరి
సందుల గొందులను దూఱి, సత్త్వము లేమిన్. ||74||

సీ. గాలిఁ దూలిన రీతిగా నెత్తఁ జాలక
తముఁ దామె సిగ్గునఁ దలను వంచి,
కౌఁగిలించిన లోను గాక వెగ్గల మైన
భీతిచే మిక్కిలి బీరువోయి,
కరముల నందంద పొరలించి చూచినఁ
గదలక యున్నఁ జీకాకు నొంది,
బాషాణ మున్నట్టి పగిది మార్దవ మేమిఁ
గానరాకుండినఁ గళవళించి,

తే. రాజ సూనులు కొందఱు తేజ ముడిగి,
జగతి రాజుల మోసపుచ్చంగఁ దలఁచి,
జనకుఁడీ మాయఁ గావించె, జాలు ననుచుఁ
దలఁగి పోయిరి దవ్వుగా ధనువు విడిచి. ||75||

సీ. ఇది పర్వతాకార, మీవిల్లు కను విచ్చి
తేఱి చూడఁగ రాదు దేవతలకు,
నటుగాక ముణు శేష కటకుని ధను వంట,
హరుఁడె కావలెఁగాక, హరియుఁగాక,
తక్కినవారికిఁ దరమె యీ కోదండ
మెత్తంగఁ? దగు చేవ యెట్లు గలుగు?
దీ డగ్గఱ నేల ? దీని కోడఁగ నేల?
పరులచే నవ్వులు పడఁగ నేల?

తే. గుఱుఁతు సేసియుఁ దమ లావు కొలఁదిఁ దామె
తెలియవలెఁ గాక, జూరక తివుర నేల?
యొరుల సొమ్ములు తమ కేల దొరకు? ననుచుఁ
దలఁగి పోయిరి రాజ నందనులు గనుచు ||76||

వ. అంత విశ్వామిత్ర మునీంద్రుండు రామచంద్రుని ముఖావలోక నంబుఁజేసిన ||77||

మునియానతి శ్రీ రామునిచే శివ ధనుర్భంగము

చ. కదలకుమీ ధరాతలము, కాశ్యపిఁబట్టు, ఫణీంద్ర భూ విషా
స్పదులను బట్టు, కూర్మమ రసాతల భోగి ఢులీ కులీశులన్
వదలక పట్టు ఘృష్టి ధరణీ కచ్చప పొత్రి వర్గమున్
బొదువుచుఁ బట్టుఁడీ కరులు, భూవరుఁడీశుని చాపమెక్కిడున్ ||78||

క. ఉర్వీ నందనకై రా
మోర్వీపతి యొత్తు నిప్పు డుగ్రుని చపం
బుర్విం బట్టుఁడు దిగ్దం
త్యుర్వీధర కిటి ఫణీంద్రు లూతఁతఁగ గడిమిన్ ||79||

వ. అనుచు లక్ష్మణుందు దెలుపుచున్న సమయంబున ||80||

మ. ఇన వంశోద్బవుఁడైన రాఘవుఁడు, భూమీశాత్మజుల్ వేడ్కతోఁ
దను వీక్షింప, మునీశ్వరుం డలరఁ, గోదండంబుచే నంది, చి
వ్వన మోపెట్టి, గుణంబు పట్టి, పటు బాహా శక్తితోఁ దీసినన్,
దునిఁగెన్ జాపము భూరి ఘోషమున, వార్ధుల్ మ్రోయుచందంబునన్. |81||

ఆ. ధనువు దునిమినంత ధరణీశ సూనులు
శిరము లెల్ల వంచి సిగ్గు పడిరి;
సీత మేను వంచె; శ్రీ రామచంద్రుని
బొగడె నపుడు జనక భూవిభుండు ||82||


జనక మహారాజు ఆ శివ ధనుస్సు యొక్క గొప్పదనము చెప్పి, ఎవరైతే ఈ శివధనుస్సు ను ఎక్కుపెడతారో వారికి నా కుమార్తె నిచ్చి వివాహం చేస్తాను అని సభాముఖంగా ప్రకటించాడు.

రాజ కుమారులు పలు పలు విధాలుగా దాన్ని ఎత్తడానికి ప్రయత్నించి  విఫలురయ్యారు. ఇది కొండా లేక విల్లా అని వాపోయారు. ఏమైతే నేమి ఎవరి వల్లా కాలేదు. అందరూ అవమానంగా భావించారు. జనక మహారాజు మమ్ములను మోసప్రుచ్చుటకే దీనిని పరీక్ష గా పెట్టాడని కొంతమంది నిందించారు. హరి కి తప్ప దీని ఎత్తడం ఎవరికీ సాధ్యం కాదని కొంతమంది తేల్చేసారు.


విశ్వామిత్ర మహర్షి శ్రీరాముని వైపు చూసారు. రాముడు అనుజ్ఞ గా భావించాడు. ఇంతలో అది గ్రహించిన లక్ష్మణ స్వామి "ఆది వరాహమా! ఆదికూర్మమా! అని అందరికీ  జాగ్రత్తలు చెప్పాక, శ్రీ రామచంద్రుడు సకల సభా మధ్యం లో, ధనువును ఎత్తి ఎక్కుపెట్టగా.. రాజవిభులందరూ తలలు వంచారు. సీతా మహాసాధ్వి మేను వంచింది. ఆ విధంగా వర్ణన చేసింది మొల్ల.


కామెంట్‌లు లేవు: