• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

31, డిసెంబర్ 2012, సోమవారం

నైమిశారణ్యం - విశిష్టత


"పురాణగాధలకు పుట్టినిల్లైన నైమిశారణ్యంలో.. శౌనక మహర్షి సత్రయాగం గావిస్తున్న రోజుల్లో.. స్వాహాకార, వషట్కారాలతో నైమిశారణ్యంలో అహ్లాదకర వాతావరణం నెలకొని యుండగా... అక్కడికి  నిఖిల పురాణగాధా రహస్య విశేషాలు తెలిసిన సూత మహర్షి దయచేసారు. అక్కడి మునులు, ఋషులు అమితానందం పొందిన వారై, మహర్షీ.. ఇక్కడివారందరికీ.. హృదయాహ్లాదాన్ని కలిగించే పురాణం ఎదైనా చెప్పండి అనగా సూత మహర్షి నాయనలారా.."  ఈ విధమైన ప్రారంభమే దాదాపు అన్ని పురాణాలకూ ఇతిహాసాలకూ.. ఉంటుంది.

ఐతే! ఏమిటీ..నైమిశారణ్యం.. ఎవరీ సూతమహర్షి అని అలోచన రావడం అరుదు. ఆ సందేహానికి సమాధానమే ఈ పోస్టింగు.

మొత్తం పురాణాలలో ఎనిమిది ఇతర దేవతలనుగురించి తెలుపుచుండగా..పది పురాణాలు శివ మహత్యాన్ని చెప్తున్నాయి. వేదాలలో వలె పురాణాల్లో కూడా శివ మహత్యం తెలిపేవి ఎక్కువ.  అసలు పురాణానికి.. 1.సర్గము, 2.ప్రతిసర్గము, 3.వంశము, 4.వంశాను చరితము, 5.మన్వంతరము అనే ఐదు లక్షణాలు వుండాలని లాక్షణికులు చెప్తారు.

ఉ! అట్టిదివో పురాణము మహత్త్వము సూతుడు తద్విదుండుగా 
బట్టి కనిష్ట జన్మమున బ్రాకృతుడయ్యు  నురు ప్రభావులై
నట్టి మహా మునీంద్రులకు నంబుజ సంభవు నంతవారికిన్
దిట్ట తనంబు మీఱ నుపదేస మొనర్చుచునుండు బ్రహ్మమున్!  (కాశీ ఖండ 1-76)

ఆహా! పురాణ విద్య మహిమ యట్టిది కదా! ఆ విద్య తెలిసినవాడు కాబట్టే..సూతుడు జన్మమును బట్టి..కనిష్టుడూ.. ప్రాకృతుడూ ఐనా..మహా మహా మునులు, ఋషులూ, బ్రహ్మసమానులైనవారికీ..దిట్టతనముతో బ్రహ్మ తత్వం ఉపదేసిశ్తూ..సకల పురాణాలనూ బోధిస్తూ ఉండేవాడు..

పురాణ విద్యలలో సూతుడు అంత ఆరితేరాడా? అవును సుమా!  ఆవిషయం సూతసంహితలో ఉంది అదీ చూద్దాము.

"అయం సాక్షాన్మహాయోగీ వ్యాసస్సర్వజఞ ఈశ్వర:
మహాభారతమాశ్చర్యం నిర్మమే భగవాన్ గురు:
తస్య శిష్యా మహాత్మానశ్చత్వారో మునిసత్తమా:
అభవంత్స  మునిస్తేభ్య: పైలాదిభ్యో దదాచుచ్త్రితిం
తేభ్యోధీతా. శృతిస్సర్వా సాధ్వీ పాపప్రణాశినీ
తయా వర్ణా శ్రమాచారా: ప్రవృత్తా వేదవిత్తమా:
పురాణానాం ప్రవక్తారం సమునిర్మామయోజయేత్
తస్మా దేవ మునిశ్రేష్టా: పురాణం ప్రదదామ్యహం."

ఇది సూతుని అధికారానికి ప్రమాణంగా ఆర్యులు చెప్తూ ఉంటారు.


ఇక నైమిశారణ్య విషయనికి వద్దాము మళ్ళీ.

సీ!ఆది మనోమయంబగు  నొక్క చక్రంబు
కల్పించె బ్రహ్మ జగద్ధితముగ
గల్పించి యా బండికలు డొల్చె సత్యలో
కంబున నుండి యా కమలగర్భు
డది డొల్లగిలి విష్టపాతరంబులు దాటి
క్రమముతో భూమి చక్రమున వ్రాలె
వాలి రం హస్ఫూర్తి  వచ్చి వచ్చి ధరిత్రి
నిమ్నోన్నతుల శీర్ణ నేమి యయ్యె!

తే!గీ! నేమి విరిసిన కతన నన్నేల నెలవు
నైమిశంబయ్యె నదియ తానైమిశంబు
దన్మహాపుణ్య వనమున ద్వాదశాబ్ది
సత్ర యాగము గావించె శౌనకుండు.


తొల్లి ఆదిలోకంలో లోకహితార్ధమై బ్రహ్మమనోమయమగు నొక చక్రమును గల్పించెను. ఆ చక్రమును సత్యలోకమునుండి దొర్లించెను.(నేమి అంటే బండి చక్రపు కమ్మి అని అర్ధం) ఆ చక్రము దొర్లి దొర్లి అన్ని లోకములు దాటి భూలోకమునందు వ్రాలెను. అమిత వేగమున వచ్చి వచ్చి భూమిట్ట పల్లములలో చక్రముకమ్మి విచ్చి పోయిన ప్రదేశములో  "నైమిశ" మయ్యెను .  ఆ ప్రదేశములోని వనము గూడ నైమిశారణ్యమయ్యెను.

అదీ అసలు నైమిశారణ్యం కధ.  మీ అభిప్రాయాలు తెలియజేయండి... నమస్సులతో.. శెలవు.

29, డిసెంబర్ 2012, శనివారం

మొల్ల రామాయణము - 13


మనం ప్రస్తుతం మొల్ల చెప్పబోయె దశరధ మహారాజు గొప్పదనాలను తెలుసుకుంటాము. అయితే.. అయన్ను గురించి ముందుగా క్లుప్తంగా వివరించాలన్నది నా కోరిక. రక రకాల పుస్తకాలలో.. ఇతరత్రా సేకరించి  మీముందు వుంచుతున్నాను.

మనం "మొల్ల రామాయణము-7" లో...శ్రీ మహా విష్ణువు దశరధ మహారాజు ఇంటనే ఎందుకు జన్మించాడనే విషయం ప్రస్తావించుకున్నాము. ఇక ఇప్పుడు ఏ సంధర్భం లో మహావిష్ణువు దశరధునికి ఆ విషయం చెప్పింది కూడా చూద్దాము.


రామాయణానికి ఒక మూల స్థంభం దశరధ మహారాజు గారు. ఒక రాజు గారు ఎలా పరిపాలించాలో మనకి నేర్పుతాడు దశరధుడు.  ఒక తండ్రి ఎలా ప్రేమిస్తాడో చూపిస్తాడు దశరధుడు. ఒక దాత ఎలా దానం చెయ్యాలో  చూపిస్తాడు దశరధుడు. సీతాపరిణయం కోసం జనక మహారాజు దూతలని పంపితే వారు వృద్ధుడైన ఇంద్రుడు ఎలా ఉంటాడో అలా ఉంటాడని వర్ణించారు దశరధ మహారాజు వైభవాన్ని. అలాంటి మహారాజు మరణించే క్షణం లో ఒక కొడుకు కోసం విలపిస్తూ మరణించటం, మరణించేటప్పుడు నలుగురు కొడుకులున్నా  ఒక కొడుకు  కూడా దగ్గర లేకుండా హా పుత్రా, హాపుత్రా అంటూ ఏడుస్తూ చనిపోవటం కాలం ఎంత బలవత్తరమైనదో చెప్పటానికి వాల్మీకి మహర్షి వాడిన ఒక బలమైన దృష్టాంతం.
           
రామాయణ కధా ప్రారంభమే పుత్రులు లేరనే బాధతో  దశరధుడు  యాగాన్ని వసిష్ట మహర్షి అనుమతితో మొదలుపెట్టటం    ద్వారా  జరుగుతుంది. అదే పుత్ర కామేష్టి  యాగం. ఆ ఇష్టి కి ఆహ్వానించిన దేవత లంతా  స్వస్వరూపంతో వేంచేస్తారు. అలా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు  కూడా ఆ సభకి విచ్చేస్తారు. అప్పుడు దిక్పాలకులు, ఋషులు రావణాసురిని  వల్ల వారు పడే భాదలన్నీ చర్చిస్తుండగా, శ్రీ మహావిష్ణువు లేచి " నేను ఈ దశరధ మహారాజు గారిని నా తండ్రిగా ఎంచుకొని నలుగురిగా పుట్టిపదకొండువేల సంవత్సరాలు రాజ్య పాలన చేస్తానని" ప్రకటిస్తాడు. ఆ మాట విన్న దశరధ మహారాజు పొంగి పోతాడు. తన మనోరధం తీరిందని సంతోష పడతాడు.తరవాత కౌసల్యకు రాముడు, మరునాడు కైకేయికి భరతుడు, ఆ సాయంత్రం సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు  జన్మిస్తారు. పెద్ద కుమారుడైన రామున్ని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తాడు దశరధుడు. ఒక నాడు నిండు సభలో.. నా పెద్దకుమారుడైన  రాముడికి యువరాజ పట్టాభిషేకం చేయదలుచుకునాను. మీ అభిప్రాయం చెప్పమని" అంటాడు. దానికి సభ అంతా తమ సమ్మతాన్ని ఎంతో సంతోషంగా విన్నవిస్తారు. అప్పుడు తిరిగి " నేను ఎన్నో సంవత్సరాలుగా రాజ్యపాలన చేస్తున్నాను. అలాంటిది నేను రామునికి యువరాజ పట్టాభిషేకం  చేస్తానంటే మీరు ఎందుకు  ఇంత  సంతోష పడుతున్నారు. నా పాలనలో ఏమైనా దోషం ఉందా?" అని ఎదురు ప్రశ్నిస్తాడు. అప్పుడు సభికులంతా ఒకే మాటగా రాముని సుగుణాలని  చెప్తే విని పుత్రోత్సాహంతో పట్టాభిషేకానికి తొందర పడిపోతూ  తనే ముహూర్త నిర్ణయం చేస్తాడు. ఈ సందర్భంగా మనం దశరధుని ప్రజాభిప్రాయసేకరాణా దృక్పధాన్ని చూడవొచ్చును. అల్లాగే పుత్ర ప్రేమ మితి మీరటం వల్ల వసిష్టుని వంటి మహానుభావుని  పక్కకు  నెట్టేసే  స్వభావాన్ని  చూడవచ్చు.
   
తన ముద్దుల భార్య కైక తన ముద్దులకుమారుడైన రామునికి 14 సంవత్సరాల అరణ్యవాసమును కోరినప్పుడు ఇక ఆ రాజు పడే భాద అంత ఇంతా కాదు.ఆమె కోరిన రెండవ కోరిక అఇన భరతుని పట్టభిషేకమును పెద్దగా ఖండించడు కాని రామ నవాసమును  మాత్రం ఏమాత్రం  వొప్పుకోలేదు దశరధుడు.అప్పుడు తను వయస్సులో వుండగా జరిగిన ఒక విషయం చెప్తాడు దశరధుడు. వేటకి అడవికి వెళ్లి ఒక సరస్స్సు మాటున పొంచి వుండి నీళ్ళల్లో ఏదో శబ్దం విని ఏదో  మృగం దాహార్తి తీర్చుకోవటానికి  వోచ్చిందన్న భావనతో బాణాన్ని విడుస్తాడు. అది వెళ్లి ఒక ముని కుమారుడిని తగులుతుంది.  అప్పుడు ఆ ముని కుమారుడు  తన  తల్లి తండ్రులు గ్రుడ్డి వారని వారికి నీళ్ళు తీసుకు  వెళ్ళటానికి   వొచ్చానని, కాబట్టి నీవైనా నా  తల్లితండ్రులకి నీళ్ళు తీసుకెళ్ళమని కోరి చనిపోతాడు. అది విని ఎంతో బాధ తో నీరు తీసుకొని ఆ ముని కుమారుడి తల్లితండ్రుల  వద్దకు వెళ్తాడు దశరధుడు.  వారు తమ కొడుకేనని  భావించి  మాట్లాడుతుంటే తట్టు కోలేక తాను దశరదుడినని తనవలన  వారి కొడుకు చనిపోయాడని చెప్తాడు. అది విని వారు తట్టుకోలేకపోతారు.  తమ కొడుకు శవాన్ని కౌగిలించుకొని ఏడుస్తూ అంత్యకాలమునందు  నీవు కూడా మాలాగే "హా పుత్రా... హా పుత్ర.. అని ఏడుస్తూ చనిపోతావని " శపిస్తారు.యవ్వనంలో వున్నప్పుడు  "అసలే  పుత్రులు లేరనే దిగులుతో  వున్న నేను ఆ రోజు అమ్మయ్యా! నాకు కొడుకులు పుడతారు కదా అని సంతొశించాను   కాని ఈ దు:ఖం నేను భరించలేక పోతున్నాను  అని ఎంతో ఏడుస్తూ రాత్రి వేళ  నిద్రపోతూనే  మరణిస్తాడు.  రాముడు వనవాసానికి వెళ్ళిన తరువాత కనీసం వారం రోజులు కూడా  బ్రతకలేదు. ఆ తండ్రికి కొడుకంటే  ఎంత పిచ్చిప్రేమో దీని ద్వారా సుకోవచ్చు.

ఆ తరువాత తన మేన మామల ఇంటికి వెళ్ళిన భరతుడు దాదాపు 10 రోజుల తరువాత కాని తిరిగి రాడు. అప్పటిదాకా తైలద్రోణి లో ఆ శరీరాన్ని భద్రపరిచి అప్పుడు దహన సంస్కారాలని భరతునితో చేయుస్తారు పెద్దలు. ఈ విధంగా దశరధ మహారాజు గారి కధ ముగుస్తుంది.

మానవులు ఏ స్థితి లో ఎలా నడుచుకోవాలో..సంఘములో ఇతరుల సుఖం కోసమై మనం ఏ రీతి గా మన సుఖాన్ని త్యజించాలో, ఏ విధంగా సత్యము, న్యాయము, సదాచారము అనే భావనలతో  సంచరించాలో... అట్టి సామాజిక నైతిక జీవన ధర్మిక శిక్షణ కు  భాండాగారము శ్రీమద్రామాయణము. దాన్ని నిత్యమూ పఠించ వలసిన అగత్యం భరత జాతికి ఉంది. 

ఇక మొల్ల తన కావ్యం లో దశరధ మహారాజు గొప్పదనాలు వచ్చే పోస్టింగులలో చూద్దాము. స్వస్తి.





  
  

28, డిసెంబర్ 2012, శుక్రవారం

మొల్ల రామాయణము - 12


సీ. శారద గాయత్త్రి శాండిల్య గాలవ
కపిల కౌశిక కుల ఖ్యాతి గలిగి,
మదన విష్వక్సేన మాధవ నారద
శుక వైజయంతి కార్జునులు గలిగి,
చం ద్రార్క గుహ గిరిసంభవ జయ వృష
కుంభ బాణాదులఁ గొమరు మిగిలి,
సుమన ఐరావత సురభి శక్రామృత
పారిజాతముల సొంపారఁ గలిగి,

తే. బ్రహ్మ నిలయము, వైకుంఠ పట్టణమ్ము,
నాగ కంకణు శైలమ్ము, నాక పురము,
లలిత గతిఁ బోలి, యే వేళఁ దులను దూఁగి,
ఘన నొప్పారు నప్పురి వనము లెల్ల. || 15||

చ. కనక విలాస కుంభములు గబ్బి కుచంబుల లీలఁ, జిత్రకే
తనములు పైఁట కొంగుల విధంబునఁ గ్రాల, గవాక్షముల్ రహిన్
గనుఁగవ యట్ల పొ ల్పెసఁగఁగా భువి భోగులు మెచ్చ భోగినీ
జనముల రీతిఁ జెల్వమరు సౌధ నికాయము పాయ కప్పురిన్. ||16||

తే. మకర, కఛ్ఛప, శంఖ, పద్మములు గలిగి,
ధనదు నగరమ్ముపైఁ గాలు ద్రవ్వుచుండు
సరస మాధుర్య గంభీర్య సరణిఁ భేర్చి
గుఱుతు మీఱిన య ప్పురి కొలఁకు లెల్ల || 17||

గీ. అమృత ధారా ప్రవాహమ్మునందు నెపుడు
నొక్క ధేనువు దివి నున్న నుచిత మగునె ?
అమృత ధారా ప్రవాహమ్మునందు నెపుడుఁ
బెక్కు ధేనువు ల ప్పురిఁ బేరు నొందు. ||18||

క. ఈ కరణి సకల విభవ
శ్రీకర మయి తాఁ బ్రసిద్ధిఁ జెలఁగుచు మహిమన్
నాక పురితోడ నొఱయుచు
సాకేత పురమ్ము వెలయు జగము నుతింపన్. ||19||

పై పద్యాలన్నీ అష్టాదశ వర్ణనలే.. చాలా సాధారణమైన బాషతో.. పండితులనే గాక పామర జనానికి గూడా అర్ధమయ్యే రీతి లో చెప్పిన రామకధామృథ సారమే "మొల్ల రామాయణము".  నగరవర్ణన చేస్తొంది మొల్లమ్మ.  అక్కడి వనాల శోభ, సాధ్వీమణులు ఎలా ఉంటారొ చెప్పి స్వర్గం తో సమానం గా ఉంది ఆ సాకేతపురి అని ఒక్కమాట తో తేల్చి అసలు విషయానికి వచ్చేసింది. ఇక మొదలవుతుంది అసలు కధ అని చెప్తూ.. "అట్టి మహా పట్టణంబున కధీశ్వరుండెట్టివాఁడనఁగ" అని మొదలెడుతూ ఉంది.  ఇవాల్టికి స్వస్తి.

26, డిసెంబర్ 2012, బుధవారం

మొల్ల రామాయణము - 11

ఆంధ్ర భారతి (www.andhrabharati.com/itihAsamulu/rAmAyaNamu) వారి గ్రంధములోనూ..  బాలసరస్వతీ బుక్ డెపో, కర్నూలు, మద్రాసు, 1987. చందోబద్ధమై యున్న తేడాలు గమనించడం జరిగింది.  ప్రాచీన తాటాకు గ్రంథములు చినుగుట వలన గానీ, చెదలు తినడం వలన గానీ , కొన్ని పద్య భాగములు లోపించుట జరిగియుండ వచ్చును. ఛందస్సు నెఱిగిన వారు ఊహించి, ఆ పద్యములను పునర్నిర్మాణము చేయుట వలన వివిధ ప్రతులలో భేదము లేర్పడ్డాయని అనిపిస్తూంది. ఆధునిక కాలములో ముద్రితమైన ప్రతులకు వేఱ్వేఱు తాటాకు గ్రంథములు మూలము లగుటచే, ఈ వ్యత్యాసము లిపుడు మనకు గోచరించును. క్రింది ఉదాహరణలు చూచిన పిమ్మట,ఈ విషయము మరికొంత స్పష్టమగును. అవి ప్రస్తుతం  పద్యాలలో... బాల కాండ లో 10 వ పద్యం. ఈ పద్యాలలో తేడాలు గమనించండి.

ఆంధ్రభారతి:
ప్రకటాగ్నిహోత్ర సంపన్ను లౌదురు గాని

బాలసరస్వతి:
ప్రకటానురాగ సంపన్ను లౌదురు గాని

ఆంధ్రభారతి:
ఉభయ సంధ్యాది విధ్యుక్త కర్ములు గాని
బాలసరస్వతి:
ఉభయ సంధ్యాది విధ్యుక్త ధర్ములు గాని.

ప్రస్తుతానికి వస్తే...
సీ. కలికి చూపులచేతఁ గరఁగింప నేర్తురు
బ్రహ్మచారులు నైన భ్రాంతి గొలిపి,
మృదువచో రచనల వదలింప నేర్తురు
ఘన మునీంద్రుల నైనఁ గచ్చడములు,
వలపులు పైఁజల్లి వలపింప నేర్తురు
సన్న్యాసులను నైనఁజలముపట్టి,
సురత బంధమ్ములఁ జొక్కింప యతుల నైన,

తే. నచల మెక్కింప నేరుతు రౌషధముల,
మరులు గొలుపంగ నేర్తురు మంత్రములను,
ధనము లంకింప నేర్తురు తక్కుసేసి,
వాసి కెక్కిన యప్పురి వారసతులు. ||14||

పై పద్యాలలో మొల్ల ఆ నగరం లో ఉండే వార కాంతలను వర్ణిస్తూంది. చూపులతోనే కరిగించి వేస్తారట వారు. బ్రహ్మచారులైనా, ఘన మునీంద్రులైనా..వలపులు జల్లి వలపింపజేసుకుంటారట. సన్యాసులైనా, యతులనైనా ముగ్గులోకి దింపనూ గలరు, ధనాన్ని లంకింప (తీసుకోనూ) గలరు. ఆ విధంగా వాసికెక్కారు ఆ నగరంలోని వేశ్యామణులు అంటోంది మొల్ల.

24, డిసెంబర్ 2012, సోమవారం

ఒక సుభాషితము


శ్లో! మక్షికా మారుతో వేశ్యా యాచకో మూషక స్తధా,
గ్రామాణీర్గణక శ్చైవసప్తైతే పరబాధకా:

తా! ఈగ, గాలి (దయ్యము) వేశ్య, యాచకుడు, ఎలుక, గ్రామాధికారి (మునసబు) కరణము ఈ యేడుగురునూ తమ సంగతి తాము చూసుకొందురు తప్ప ఇతరుల సంగతి పట్టించుకొనరు. కావుననే వారు సదా బాధించువారగుచున్నారు.

మొల్ల రామాయణము - 10


ఉ. రాజులు కాంతియందు, రతి రాజులు రూపమునందు, వాహినీ
రాజులు దానమందు, మృగ రాజులు విక్రమ కేళియందు, గో
రాజులు భోగమందు, దిన రాజులు సంతత తేజమందు, రా
రాజులు మానమందు, నగరమ్మున రాజ కుమారులందఱున్ ||11||

సీ. తగ దాన విఖ్యాతి ధరఁ గుబేరులు గాని
సత తాంగ కుష్ట పీడితులుగారు,
నిర్మల సత్యోక్తి ధర్మ సూతులు గాని
చర్చింప ననృత భాషకులు గారు,
ప్రకట విభూతి సౌభాగ్య రుద్రులు గాని
వసుధపై రోష మానసులు గారు,
కమనీయ గాంభీర్య ఘన సముద్రులు గాని
యతులిత భంగ సంగతులు గారు,

తే. వర్తకులు గాని పక్షులే వరుసఁగారు,
భోగులే గాని పాము లెప్పుడును గారు,
సరసులే కాని కొలఁకుల జాడఁగారు,
వన్నె కెక్కిన యప్పురి వైశ్యులెల్ల. ||12||

క. పంటల భాగ్యము గలరై
పంటలపైఁ బంట లమర బ్రతుకుదు రెపుడున్
బంటలుఁ బాడియుఁ గల యా
పంటలు మొదలైన కాఁపుఁ బ్రజలా నగరిన్. ||13||

మొల్ల బ్రహ్మణుల గురించి చెప్పాక క్షత్రియులు ఆ నగరం లో ఎలా ఉండేదీ చెప్తోంది.రాజులు కాంతి యందు రూపమందు దానమందు విక్రమ కేళి యందునా..భోగం లో..తేజములో... చాలా చాలా గొప్ప వారు అని చెప్తోంది.

అలాగే వైశ్యులు ఎలా వుంటారు? ఆపురం లోని వైశ్యులందరూఒ కుబేరులతో లెక్క.అనృతములు మాట్లాడరు. అనేకవిధముల ఆ పురంలో వైశ్యుల గొప్పదనం చెప్తోంది.

అలాగే..పంట కాపులు అమితమైన భాగ్యము గలవారై పంటలపై పంటలు వేయుచు  పాడి యావులను కలిగి పంట కాపులు సుఖిస్తూ ఉన్నారట.

21, డిసెంబర్ 2012, శుక్రవారం

మొల్ల రామాయణము - 9



క. ఇమ్ముల న ప్పురి వప్రము
కొమ్ములపై నుండి పురము కొమ్ములు వేడ్కన్
దమ్ముల చుట్టము పద జల
జమ్ములు పూజింతు రొగి నజస్రముఁ బ్రీతిన్. ||5||

క. పరువున మురువై యుండును
సురపురమునఁ గల్ప తరులు చూపఱకింపై;
పరువున మురువై యుండును
దురగంబు లయోధ్యఁ గల ప్రతోళికలందున్. ||6||

క. దాన గునమ్మున సురపురి
నే నాఁడును నమర రత్న మెన్నిక కెక్కున్;
దాన గుణంబున మిక్కిలి
యేనుఁగు లా పురములోన నెన్నిక కెక్కున్. ||7||

క. కవి గురు బుధ మిత్త్రాదులు
వివిధార్చనలను సురపురి వెలయుదు రెలమిన్;
గవి గురు బుధ మిత్త్రాదులు
వివి ధార్చనలం బురమున వెలయుదు రెపుడున్. ||8||

క. భోగానురాగ సంపద
భోగులు వర్తింతు రందు భూ నుత లీలన్;
భో గానురాగ సంపద
భోగులు వర్తింతు రిందు భూ నుత లీలన్, ||9||



సీ. ప్రకటాగ్ని హోత్ర సంపన్ను లౌదురు గాని
రమణీయ రుక్మ కారకులు గారు,
షుభ పవిత్రోజ్జ్వల సూత్ర ధారులు గాని
టక్కరి హాస్య నాటకులు గారు,
ఉభయ సంధ్యాది విధ్యుక్త కర్ములు గాని
చర్చింపఁగా నిషాచరులు గారు,
తిలమించి చూడ సద్ద్విజు లౌదురే కాని
తలఁపంగఁ బక్షి జాతములు కారు,


బాడబులు గాని యగ్ని రూపములు గారు,
పండితులు గాని విజ్ఞుల పగిదిఁగారు,
ధీవరులు గాని జాతి నిందితులు గారు,
పరమ పావను లా పురి ధరణి సురులు. ||10||


అష్టాదశ వర్ణనలలో...పుర వర్ణన అయ్యాక చాతుర్వర్ణముల వర్ణాన లో మొల్ల బ్రాహ్మణులు ఆ నగరంలో ఎలా ఉన్నదీ చెప్తోంది. ఆ నగరంలో బ్రాహ్మణులు సద్వర్తనులై నిత్యాగ్ని హోత్రులై సంధ్యాది విధులను నిత్యం నిర్వర్తిస్తూ వారి వారి నిత్య కర్మలను చేస్తూ ఆయూరిలో బ్రాహ్మణులు పరమ పావనులుగా ఉన్నారని మొల్ల చెప్తోంది.



ఇక ఈ అష్టాదశ వర్ణనల విషయానికొస్తే.. అష్టాదశ వర్ణనలు కన్నడం నుంచి నన్నెచోడుడు గ్రహించాడని అంటారు కొంతమంది. ఏది ఎమైనా.. ఈ అష్టాదశ వర్ణనలు వివరంగా తెలుసుకొవలసిన అవసరం ఎంతైనా ఉంది. అవి ఏమిటంటే..

1. పుర వర్ణన.
2. గిరి వర్ణన.
3. వన వర్ణన.
4. నది వర్ణన.
5. సముద్ర వర్ణన.
6. ద్యూత వర్ణన.
7. వివాహ వర్ణన.
8. విరహ వర్ణన.
9. యుద్ధ వర్ణన.
10. షడృతువుల వర్ణన.
11. ప్రాత: సంధ్యాకాల వర్ణన.
12. సూర్యోదయ సూర్యాస్తమాన వర్ణన.
13. మధుపాన వర్ణన.
14. రాయబార వర్ణన.
15. స్త్రీ వర్ణన.
16. బ్రాహ్మణాది చాతుర్వర్ణముల వర్ణన.
17. చతురంగ సైన్య వర్ణన.
18. వేదాంత విచారణ.

ప్రబంధము అనగానే... ఒక వొరవడి.. పడికట్టు సృష్టించిన వ్యక్తి నన్నె చోడుడు.. తన కుమార సంభవం లో ఎన్నొ వర్ణనలు చిత్ర విచిత్రం గా...వర్ణించాడు. అష్టాదశ వర్ణనలు గల కావ్యమును ప్రబంధము అనవచ్చును.16 వ శతాబ్దం లొ రాయల వారి కాలం లో వెలువదిన కావ్యాలనే ప్రబంధాలు అని పిలుస్తున్నారు. "కధైక్యమును, అష్టాదశ వర్ణనలు కలిగి శృంగార రస ప్రధానమై అర్ధ అతిశయ శబ్దమును గ్రహించి, ఆలంకారిక సాంకేతికములకు విధేయమై, అనతి విస్తృతి గల ఇతి వృత్తముతో భాషాంతరీకరణము గాక స్వతంత్ర రచన అనదగు తెనుగు కావ్యము ప్రబంధము " 

ఆచార్య పింగళి లక్ష్మీ కాంతం ప్రబంధ పరిణామాన్ని ఈ విధం గా వివరించారు.... "భారతం లో బీజ ప్రాయముగ, ఎర్రన లో అంకుర ప్రాయముగ, సోమన్న లో మొలకగా పొడసూపిన ప్రబంద లత శ్రీనాధుని చేతి లో కొనలు సాగి, చిగిర్చి మారాకు వేసినది. అది పుష్ప ఫల సమన్వితమగుట రాయలకాలం లో జరిగినది. మను చరిత్రయే ఆ లత పూచిన తొలిపూవు, పండిన తొలి ఫలము.." 


ఐతే రామాయణము ప్రబంధము అనాలా? కానే కాదు. ఈ మొల్ల నన్నె చోడుని తర్వాత కాలంలో వచ్చింది కాబట్టి... ఎవరు ఏ గ్రంధం రాసినా  ఆ వొరవడి లోనే వెళ్ళారు అనవచ్చునెమో.  పెద్దలు పరిశీలించి విశదీకరిస్తే మనం తెలుసుకోవచ్చు. ఈ రోజుకు స్వస్తి.

20, డిసెంబర్ 2012, గురువారం

మొల్ల రామాయణము -8






సీ. మదనాగ యూధ సమగ్ర దేశముగాని

కుటిల వర్తన శేష కులము గాదు

ఆహ వోర్వీజయ హరి నివాసము గాని

కీశ సముత్కరాంకితము గాదు

సుందర స్యందన మందిరం బగుఁగాని

సంతత మంజులాశ్రయము గాదు,

మోహన గణికా సమూహ గేహము గాని

యూథికా నికర సంయుతము గాదు.




తే. సరస సత్పుణ్యజన నివాసమ్ముగాని

కఠిన నిర్దయ దైత్య సంఘమ్ముగాదు,

కాదు కాదని కొనియాడఁ గలిగి నట్టి

పుర వరాగ్రమ్ము సాకేత పుర వరమ్ము. ||3||




సీ. భూరి విద్యా ప్రౌఢి శారదా పీఠమై

గణుతింప సత్య లోకమ్ము వోలె,

మహనీయ గుణ సర్వమంగళావాసమై

పొగడొందు కైలాస నగము వోలె,

లలిత సంపచ్ఛాలి లక్ష్మీ నివాసమై

యురవైన వైకుంఠ పురము వోలె,

విరచిత ప్రఖ్యాత హరిచంద నాఢ్యమై

యారూఢి నమరాలయమ్ము వోలె,




తే. రాజ రాజ నివాసమై తేజరిల్లి

నరవ రోత్తర దిఘ్భాగ నగరి వోలె

సకల జనములు గొనియాడ జగములందుఁ

బొలుపు మీరును సాకేత పుర వరమ్ము. ||4||

ప్రతి పద్యానికి అర్ధ తాత్పర్యాలు ఎక్కడైనా దొరుకుతాయి. కానీ.. హృదయోల్లాస వ్యాఖ్యలు అరుదుగా ఉంటాయి. అలా మీ హృదయాలకు ఆహ్లాదము కలిగించాలనే నా ఉద్దేశ్యము మరియూ నా ప్రయత్నం ఇందులో ఎంతవరకూ సఫలీకృతుడ నవుతానో వీక్షకులే సాక్షి.

అయోధ్యా నగరం ఎలా ఉందో వర్ణించి చెపుతోంది మొల్ల తల్లి. మొదట సత్యలోకం అంది, తర్వాత కైలాసం అంది, తర్వాత వైకుంఠ పురం అంది, చివరకు అమరావతి తో పోల్చింది. సాకేత పురం  ఎలా ఉందో చెప్పింది.

14, డిసెంబర్ 2012, శుక్రవారం

మొల్ల రామాయణం - 7 - శ్రీ మహావిష్ణువు దశరధ మహారాజు ఇంటనే శ్రీ రామ చంద్రునిగా జన్మించాలా? కారణం ఏమిటి?


ఇంకా మనం అయోధ్యాపుర వర్ణనలోనే ఉన్నాము. ఐతే ఈ లోపుగా ఒక సందేహం తలెత్తింది. శ్రీ మహావిష్ణువు దశరధ మహారాజు ఇంటనే శ్రీ రామ చంద్రునిగా  జన్మించాలా?  దీని విశేషం ఏంటో ఒక్కమారు పరికిద్దాం.

దుష్టశిక్షణ, శిష్టరక్షణ ధర్మ సంస్థాపన అన్న లక్ష్యంతో శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తడం జరిగింది. ప్రస్తుత మన కధాంశంలో శ్రీ రామచంద్రుడిగా అవతారం దశరధ మహారాజు ఇంటనే ఎందుకు జరిగిందనేది.  మామూలుగానే రావణబ్రహ్మ పెట్టే బధలకు తాళ లేక దేవతలు మహా విష్ణువుకు మొరపెట్టుకున్నారు. బదులు చెప్పారు పరమాత్మ ఇలా... "నాయనలారా..అఖిల శాస్త్ర పారంగతుడు...నిఖిల శస్త్రాస్త కోవిదుడు.. ఈ రావణ బ్రహ్మ.. ఐతే ఏమిటి ప్రయోజనం? అవివేకం అహంకారం ఆయనకు నిజమైన శతృవులు..ఇక లాభం లేదు వాడి టైము అయిపోయింది.  మీరు వెళ్ళి రండి అని చెప్పి పంపాడు.

వాల్మీకి రామాయణం లో ఒక శ్లోకం ఉంది గమనించారో లేదో.."పితరం రోచయా మాస తదా దశరధం నృపం" దీన్ని మహాకవులు ఎంతో ఆలోచించి ఈ వాక్యాల మీద దృష్టి సారించారు. 

ఎక్కడ అవతరిస్తే..తన కార్యం సానుకూలం అవుతుందో...అవతారానికి పూర్తి పరమార్ధం ఏర్పడుతుందో కూలంకషం గా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాడు మహా విష్ణువు. ధర్మార్ధ కామ మోక్షాలూ...ఈ పురుషార్ధ బీజ లక్షణాలు వాల్మీకి హృదయంలో గుభాళించే పరిమళాలూ ఆదర్శం మానవ జాతికి. ఇన వంశీయుల లో దిలీప మహారాజులో ధర్మ పురుషార్ధ పరిపక్వత ఉంది. రఘు మహారాజు లో అర్ధ పురుషార్ధ మహోత్తత. అజ మహారాజులో కామ పురుషార్ధ మహా వైభవాన్నీ..ఇక మన దశరధ మహారాజులో మోక్ష బీజ లక్షణాలనూ నిక్షేపింపబడి ఉండడము లోక విహితం కదా! ఈ పురుషార్ధాల పౌష్కల్యం ఎక్కడ ఉన్నదో చూసుకుని మరీ మహా విష్ణువు అవతారం ఎత్తాడట.

రామాయణం వేద సమ్మితం. ఈ కావ్యాన్ని శ్రద్ధాసక్తులతో గమనిస్తే..అనుకరిస్తే..మానవ జాతికి మహా పురుష మార్గాలు సుగమము అవుతాయి. లక్ష్యం కరతలామలకం అవుతుంది. ఇన్న్ని మహార్ధాలను నిక్షేపించి మనకు శ్రీమద్రామాయణాన్ని అందించాడు వాల్మీకి మహర్షి. ఇన్ని మహార్ధాలను మననం చేయగా చేయగా ...హృదయంలో సత్పురుష స్వభావ గరిమ ఎలాంటిదో అవగతమవుతుంది.

అలా మనకు ఒక ఉదాత్త విరాట్స్వరూపం మననం జరిగిందా అలాంటి కావ్యానికి మహా ప్రయోజనం చేకూరినట్టే గదా?  

చివరగా ఒక మాట! మానవునికి వృత్త చికిత్స గానీ..కర్మ విచికిత్స గానీ కలిగినప్పుడు పరిష్కార మార్గానికి పరమోత్తమ మైన వ్యక్తుల ను ఆదర్శంగా తీసుకోవాలని వేదం శాసిస్తోంది. అటువంటి చరిత్రలే..ఇతిహాసాలే రామాయణ..మహా భారతాలు. 

కమ్మని జవాదులై గుభాళించు తెలుగు నుడికారాలతో..నును లేత కాంతులతో..ఏక పత్నీ వ్రతుడైన భారత ధర్మ వీరుని గాధ.. ఈ పావన గాధ ఈ రామాయణం మన మొల్లతల్లి తెలుగు వారికి అందించింది.. మనమూ ఆ సొబగులేమిటో.. చూద్దాం వచ్చే పోస్టింగులలో.. అంతవరకూ సెలవు.

13, డిసెంబర్ 2012, గురువారం

మొల్ల రామాయణము - 6


అయోధ్యాపుర వైభవము

సీ! సరయూ నదీతీర సతత సన్మంగళ
ప్రాభ వోన్నత మహా వైభవమ్ము
కనక గోపుర హర్మ్యఘన కవాటోజ్జ్వల
త్ప్రాకార గోపుర శ్రీకరమ్ము,
గజ వాజి రధ భట గణికాతపత్ర చా
మరకేతు  తోరణ మండితమ్ము
ధరణీ వధూటి కాభరణ విభ్రమ రేఖ
దరిసించు  మాణిక్య దర్పణమ్ము

తే!గీ! భాను కుల దీప రాజన్య పట్టభద్ర
భాసి నవరత్న ఖచిత సిం హాసనమ్ము
నాగనుతికెక్కు మహిమ ననారతమ్ము,
ధర్మనిలయమ్ము, మహి నయోధ్యాపురమ్ము.


మొల్లాంబ అయోధ్యాపురాన్ని ఎంత సర్వ సుందర లక్షణంగా వర్ణించిందో చూడండి. సరయూ నదీ తీరం లో ఉన్న ఆ అయోధ్యాపురం ఎల్లప్పుడూ వైభవంతో ఎక్కువ ప్రాభవాన్ని కలిగి ఉంది.బంగారు గోపురాలు, ఏనుగులు, గుర్రాలు, రధాలు, భటులు, లెక్కలు రాసే గణకులు ఆతపత్రాలూ, చామారాలు పట్టే వాళ్ళతోటి మాణిక్యానికి దర్పణము పడుతోంది.

ఇన్వంసంలో జన్మించిన రాజు పట్టభద్రుడు నవరత్న ఖచిత సిమ్హాసనం కలిగి అయోధ్యాపురం ఈ మహిలో ధర్మ నిలయమై విలసిల్లుతోంది.

ఇంకా పలువురు అయోధ్యను గురించి పలుపలు విధాలుగా చెప్పారు. కొంచెం ఆ అయోధ్య గొప్పదనం చూద్దాము మనం కూడా..

సరయూ నదీ తీరాన కోసలదేశానికి రాజధానిగా పౌరాణిక ప్రాశస్త్యం పొందిన పవిత్ర ప్రాంతం అయోధ్య. నాటి పాలకులలు సూర్యవంశానికి చెందినవాళ్ళు. నాటి హరిశ్చంద్రుని ముందు తరాల మొదలు శ్రీరాముని వరకూ అందరూ పౌరాణిక ప్రసిద్ధి చెందినవారే. ముక్తి ప్రదాయకమైన ఏడు పవిత్ర క్షేత్రాలలో అయోధ్య ట్టమొదటిది.ఇక్కడ ప్రవహిస్తున్న సరయూ నదీతీరం పొడవునా అనేక స్నానఘట్టాలు ఉన్నాయి. వాటిలో అత్యంత ముఖ్యమైనవి అహల్యా భాయి, ఋణవిమోచన సహస్రధార, లక్ష్మణ స్వర్గ ద్వార, రామ ఘాట్‌, జానకీ ఘాట్‌, గంగామహల్‌, శివాలా, జటాయా, దేర్‌హాలా, రూపకళా, నయాఘాట్‌ జన సమూహంతో కళకళలాడుతూవుంటాయి. లక్ష్మణ ఘాట్‌కి మాత్రం ఒక ప్రతేకత ఉంది. ఇక్కడ నిర్మించిన నాటి లక్ష్మణ మందిరంలో 5 అడుగులున్న లక్ష్మణుని విగ్రహం ప్రతిష్టించబడింది. ఈ విగ్రహం ఇక్కడ కుండంలో లభించింది. అక్ష్మణుడు ఇక్కడే శరీరత్యాగం చేసాడని ప్రతీతి. శ్రీరాముని వంశానికి మూలపురుషుడైన సూర్యభగవానుని మందిరం సూర్యకుండం వద్ద ఉంది. ఇది అత్యంత సుందరమైన కట్టడం.

కనకమందిరం: ఇక ఇక్కడ దర్శనీయ స్థలాలు అనేకం ఉన్నాయి. అయోధ్యలో అడుగుపెట్టగానే ముందుగా అందరూ దర్శంచుకునేది శ్రీరామచంద్రమూర్తిని, సీతమ్మవారిని. పాలరాతితో మలచిన ఈ విగ్రహాలు కనక మందిరంలో ప్రతిష్టించారు. ఇక్కడే రాముడు పెరిగి పెద్దవాడయ్యాడు. అందుచేత ఈ ప్రదేశాన్ని అతి పవిత్రంగా చూసుకుంటారు. రామాయణ కాలంలో అసలు ఇది కైకేయి భవనం.ఈ భవనాన్ని సీతకు కానుకగా సమర్పించింది.

సీతామందిరం: కనకమందిరం దాటి కొద్దిగా ముందుకి వెడితే సీతామందిరం ఉంటుంది. ఇక్కడే సీతాదేవి నివసించేది. ఇక్కడ సీతాదేవి విగ్రహానికి పూజలు నిర్వహిస్తూవుంటారు. ఈ మందిరానికి ఆనుకుని ఉన్న భవనంలోనే, భరతుడు శ్రీరాముని పాదుకలు ఉంచి రాజ్యపాలన గావించాడని ప్రతీతి.

సీతారసోయి: సీతామందిరానికి మరోపక్కన ఉన్న మందిరాన్ని సీతారసోయి అని పిలుస్తారు. సీతాదేవి కాపురానికి రాగానే, మొట్టమొదటి సారిగా ఇక్కడే వంట చేసింది.అందుకే ఈ మందిరంలో పొయ్యి, దానికేదురుగా సీత విగ్రహం మనకి దర్శనమిస్తాయి.

కైకేయి మందిరం: వీటన్నిటికీ దూరంగా నిర్మించిన కైకేయి మందిరం శిధిలావస్థలో ఉంది. దీనిని ఆనుకుని 4 కి్ప్పమీ దూరంలో నీలమణి అనే ప్రాంతం చిన్న గుట్టలతో ఉంటుంది. ఇక్కడ రాముడు చిన్నతనంలో ఆడుకునేవాడనీ, ఇప్పటికీ ఈ ప్రాంతంమీద ఉన్న మమకారంతో ఇక్కడ సంచరిస్తూవుంటాడనీ ప్రజల విశ్వాసం.

హనుమాన్‌ఘరి: అయోధ్యలో ఉన్న అన్ని మందిరాలలోకీ అతి విశిష్టమైన కట్టడం ఈ హనుమాన్‌ఘరి. ఇది చాలా ఎత్తుగా నిర్మించిన మందిరం. ఇందులో నిలువెత్తు హనుమంతుని విగ్రహం ఎంతో మనోహరంగావుంటుంది. స్వామివారికి ఎన్నో పూజలు, సేవలూ భారీఎత్తున నిత్యం జరుగుతూవుంటాయి.

అయోధ్యలో శ్రీరామనవమి అత్యంత వైభవంగా జరుపుతూవుంటారు. అలాగే 9 రోజులపాటు ఊయల ఉత్సవం కన్నులపండువగా నిర్వహిస్తారు. నిత్యం యాత్రికులతో అయోధ్య కళకళలాడుతూ ఉంటుంది. అలాగే ధశరధుని మందిరం, మణిపర్వతం, స్వర్గద్వార్‌, బిర్లామందిర్‌, లీలామందిర్‌, తులసీదాసు వనం మొదలైన అద్భుత ప్రదేశాలు మనని అలౌకిక ఆనందానికి, జీవిత సత్యాలకీ ఆలంబనగా కనిపిస్తాయి. సరయూ నదీ ప్రాంతంలో విహరిస్తూవుంటే అలనాటి రామకథ మనకన్నులముందు సాక్షాత్కరిస్తుంది.

ఈ సరయూ నది తీరం వెంటే, రామలక్ష్మణులు, యాగ సంరక్షణార్ధం విశ్వామిత్రునితో నడిచి వెళ్ళారు. ప్రపంచానికి ప్రజలను ఏవిధంగా పరిపాలించాలో చాటిచెప్పిన రామరాజ్యం ఈ అయోధ్యానగరమే.


1, డిసెంబర్ 2012, శనివారం

పంచ పాండవులు ఉపదేశాలు - సుభాషితములు


పంచ పాండవులు ఉపదేశాలు ఏంటో ఇప్పుడు చూద్దాము.

ధర్మరాజ ఉవాచ
శ్లో: సత్యం మాతా పితా ఙాఞనం ధర్మో భ్రాతా దయా సఖా,
శాంతి: పత్నీ క్షమా పుత్త్ర షడ్డేతే మమ బంధావా:
తా! సత్యము, తల్లి, ఙాఞము తండ్రి, ధర్మము సోదరుడు, దయ, మిత్రుడు,శాంతి భార్య, ఓరిమి కొడుకు  - ఈ ఆరుగురును నాకు బంధువులు అని ధర్మ రాజు చెప్పెను.

భీమ ఉవాచ
శ్లో: ప్రాణం వాపి పరిత్యజ్య మనమే వాభి రక్షతు,
అనిత్యో భవతి ప్రాణో మాన ఆచంద్ర తారకం.
తా! ప్రాణమును విడిచి అయినసరే మానమునే రక్షించుకొనవలెను. ఏమనగా ప్రాణము నిత్యం గాదు. మానము ఆచంద్ర తారార్కముగా ఉండును.


అర్జున ఉవాచ:
శ్లో! నిమంత్రణోత్సావా విప్రా గావో నవతృణో త్స్వవా:
భర్త్రాగ్రగమోత్పవ నార్య: సో2హం కృష్ణ: రణొత్సవ:
తా! కృష్ణా! బ్రాహ్మణులు పరుల ఇంటి భోజనము ఉత్సవముగా గలవారు, గోవులు లేత గడ్డి ఉత్సవముగా గలవి. స్త్రీలు పెనిమిటి రాక ఉత్సవము గా గలవారు. నేను యుద్ధమే ఉత్సవముగా గలవాడిని.


నకుల ఉవాచ

శ్లో! మాతృవ త్పరదారంశ్చ పరద్రవ్యాణి లోష్టవత్
ఆత్మవత్సర్వ భూతాని య: పశ్యతి స పండిత:
తా! పరస్త్రీలను తల్లివలెను, పరధనమును మన్ను వలెను, సకలభూతములను తనవలెను చూచువాడే పండితుడు.

సహదేవ ఉవాచ:
శ్లో: అనిత్యాణి శరీరాణి విభవో నైవ శాశ్వత:
నిత్యం సన్నిహితో మృత్యు: కర్తవ్యో ధర్మసంగ్రహ:
తా! దేహములు నిత్యములు గావు. ఐశ్వర్యము శాశ్వతము కాదు. మృత్యువు నిత్యమును సమీపించియే యుండును. కాబట్టి ధర్మమును సంపాదించుకోవలెను అని సహాదేవుడు చెప్పెను.





29, నవంబర్ 2012, గురువారం

మొల్ల రామాయణము - 5


శ్రీ రామ చరిత్ర మొత్తం ఒకే వేగంతో చెప్పుకుంటూ వెల్లిపోయింది మొల్ల అని అనిపిస్తూంది నాకు. అంటే చిన్న పిల్లలకు చందమామ కధ చెప్తామే అలాగా అన్నమాట. ఆ శర వేగం సుందరకాండ వరకూ అలాగే సాగింది. అక్కడ కొంచెం "బ్రేకు" పడింది.(క్షమించాలి అంతకన్న మంచి పదం దొరకలేదు). "మొల్ల" రామాయణం "మెల్ల" మెల్లగా సాగలేదు సుమా!

దశరధ పత్నులగూర్చిన ప్రస్తావన లేదు. ఐతే వాల్మీకి కూడ పుత్ర కామేష్టి యాగ సందర్భంలోనే వారిని ప్రస్తావించాడు. శ్రావణకుమార, మంధరా వృత్తాంతాలూ..,అహల్య వృత్తంతమూ చరిత్ర చెప్పకుండా ప్రస్తవన చేయడం గమనార్హం! ఇక యుద్ధ రంగంలో ఆదిత్య హృదయం, కబంధ వధ, సుగ్రీవ రావణ ద్వంద యుద్ధం పూర్తిగా విడిచిపెట్టేసింది. అరణ్యానికి వెళ్ళేతప్పుడు శ్రీ రాముడు దశరధ మహారాజు వద్దకు వెళ్ళి చెప్పే వృత్తాంతమూ లేదు. ఐతే నేనొకటి గమనించాను. కైకేయి వనవాసానికి వెళ్ళే ముందు ఒక సేవకుడిని పిలిచి శ్రీ రాముడిని ఒక్క మారు వారి తండ్రిగారు పిలుస్తున్నారని చెప్పి పిల్చుకురా అంటుంది. తెల్లవారితే పట్టాభిషేకం. శ్రీ రాముడు హుటాహుటిన వచ్చాడు. కైకేయి నాయనా మీ తండ్రిగారు నిన్ను వనవాసానికి వెళ్ళమని ఆఙ్ఞ ఇచ్చారు అంటుంది. అప్పుడు శ్రీ రామ చంద్రుడు ఏమన్నాడో తెలుసా! "అమ్మా! ఈ విషయం చెప్పడానికి నన్ను పిలవాలా? ఆ సేవకుడి ద్వారా ఈ కబురు పంపి ఉన్నట్లైతే ఈ పాటికి నేను బయల్దేరి అరణ్యానికి ఈ మాత్రం ఆలస్యం కూడా లేకుండా..వెళ్ళిపోయే వాడిని గదుటమ్మా!" అన్నాడు. అలాంటి ఉదాత్త చరితుని చరిత్ర మనకు అందించారు వాల్మీకి మహర్షి.


అలాంటి వాల్మీకి మహర్షిని ఒక్క మారు స్మరిద్దాం. ఆదికవి వాల్మీకి ప్రార్ధన సంప్రదాయముగా చాలామంది కవులు స్మరిస్తారు.

కూజంతమ్ రామరామేతి మధురమ్ మధురాక్షరమ్
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్

మహర్షి వాల్మీకి ఆదికవియే గాక వేదాంతి. దార్శనికుడు. తపస్వి. ప్రజలకు మార్గ దర్శకుడు. సంస్కర్త. కార్యాచరణ వేత్త. ఆయన తన శిష్యులతో తమసా నదీ తీరమున వెళ్ళుచుండగా ఒక వేటగాడు క్రౌంచ పక్షుల జంటలో మగ పక్షిని బాణముతో కొట్టెను. అప్పుడది విలవిలలాడుచు అసువులు వీడెను. ఆ దృశ్యమును జూచి, వాల్మీకి ముని హృదయము ద్రవించెను. మనస్సు ఆర్ద్రమయ్యెను. శోకాకులుడైన ఆయన నోట ఈ మాటలు వెలువడెను.
మానిషాద ప్రతిష్ఠాం త్వమగమ: శాశ్వతీస్సమా:
యత్ క్రౌంచ మిధునాదేకమ్ అవధీ: కామ మోహితమ్
"ఓరీ కిరాతకుడా! క్రౌంచ దంపతులలో కామమోహితమగు ఒకదానిని చంపి, నీవు శాశ్వతమగు అపకీర్తిని పొందితివి". శోక  పరితప్త హృదయముతో ఆయన ఉచ్ఛరించిన ఈ మాటలు ఛందో బద్ధముగా నున్న మొదటి శ్లోకమని సంస్కృత సాహిత్య చరిత్రలో నమ్మకము. ఆప్పుడు బ్రహ్మదేవుడు వాల్మీకికి ఆ శ్లోక విశిష్టతను తెలిపి, శ్రీ రామ చరిత్రను కావ్య రూపమున రచింపమని ప్రేరేపించెను. లోకములయందు పర్వతములు, నదులు ఉన్నంత కాలము ఆ రామాయణ కావ్యము ప్రకాశించునని దీవించెను.

కావ్యం రామాయణం సీతాయాశ్చచరితమ్ మహత్
పౌలస్త్య వధమిత్యేవ, చకార చరిత వ్రత:

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం.
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యమ్ రామనామ వరాననే

రామ నామము సకల పాప హరమనీ, మోక్షప్రదమనీ పలువురి నమ్మిక. "రామ" నామము లో పంచాక్షరీ మంత్రము "ఓం నమ: శివాయ" నుండి 'మ' బీజాక్షరము, అష్టాక్షరీ మంత్రము "ఓం నమో నారాయణాయ" నుండి 'రా' బీజాక్షరము పొందుపరచబడియున్నవని ఆధ్యాత్మిక వేత్తల వివరణ. ఒక్కమారు "రామ" నామమును స్మరించినంతనే శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము చేసిన ఫలము లభించునని శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము-ఉత్తర పీఠికలో చెప్పబడినది. ప్రస్తుతానికి స్వస్తి.
(పై విషయాల లో కొన్ని వికీపీడియా లో గ్రహించాను.)     

ఒక సుభాషితము


శ్లో! రాజవత్పుత్త్ర దారాశ్చ స్వామివన్మిత్త్ర బాంధవా:
ఆచార్యత్స భామధ్యే భాగ్య వంతం స్తువంతి:

తా! భాగ్యవంతుడైనచో భార్య, పిల్లలు రాజును జూచునట్లునూ..స్నేహితులూ బంధువులూ దేవుని లేక ప్రభువును జూచినట్లూ..సభలలో మతాచార్యుని జూచునట్లునూ కొనియాడెదరు.

ఇంకో విషయం ఇక్కడ చూద్దాము.. కాబట్టే..సుభద్ర గర్భవతి గా ఉన్నప్పుడు కుంతీ దేవి కి నమస్కరిస్తే.. అవిడ ఏమన్నదో తెలుసునా.. "భాగ్యవంతం ప్రసూయేధా మా శూరం మాచ పండితం.  కూరాశ్చ కృతవిద్యాశ్చ మమ పుత్రా వసంగతా:" అన్నది. అంటే.. అమ్మాయీ నీవైనా ఒక భాగ్యవంతుడైన కొడుకుని కను.. కానీ శూరుడూ.. పండితుడూ అయిన కొడుకుని కనవద్దు. ఇదేమి విపరీతపు కోరిక అంటావేమో.. నా కొడుకులకన్నా..శూరులు పండితులు ఉన్నారా? అయినా భాగ్యం లేక పోవడం వల్లనే కదా వారు అడవుల పాలయ్యారు. అందుచేత భాగ్యవంతుడైన కొడుకు పుట్టాలని కోరుకో తల్లీ అంది.

28, నవంబర్ 2012, బుధవారం

మొల్ల రామాయణము - 4


కం. వారాంగన శ్రీరాముని
పేరిడి రాచిలుక బిలిచి పెంపు వహించెన్;
నేరుపు గల చందంబున
నారాముని వినుతి చేయ హర్షము గాదే!

తా. ఒక వేశ్య ఒక చిలుకను కొని శ్రీ రాముని పేరు పెట్టి ముద్దు ముద్దుగా "రామా!" అని పిల్చిందట. ఈ విధంగా ఎవరికి తోచినవిధంగా వారు ఆ రాముణ్ణి వినుతి చేస్తే నవ్వు రాదా అని ప్రశ్నిస్తోంది మొల్ల.


ఉ. సల్లలిత ప్రతాప గుణ సాగరుడై, విలసిల్లి ధాత్రిపై
బల్లిదుడైన రామ నరపాలికునిన్ స్తుతి సేయు జిహ్వకున్
జిల్లర రాజ లోకమును జేకొన మెచ్చంగ నిచ్చ బుట్టునే
యల్లము బెల్లముం దినుచు నప్పటి కప్పటి కాస సేయునే!


భక్త పోతన ఏవిధంగా అయితే... "ఇమ్మనుజేశ్వరాధముల" అన్నాడో..అదేవిధంగా.. మొల్ల కూడా..."సల్లలిత ప్రతాప గుణ సాగరుడై విలసిల్లి ధాత్రిపై బల్లిదుడైన రామ నరపాలికుని స్తుతి చేసే జిహ్వకు" .. ఈ "చిల్లర రాజ లోకమును చేకొన మెచ్చంగ నిచ్చ బుట్టునే అల్లము బెల్లమును తినుచూ..."తాత్కాలిక సుఖాలకు అలాంటి నాలుక ఆశ పడుతుందా అంటూ నరాంకితము గావించక శ్రీ రామ చంద్రుడికే అంకితం జేసింది.

మహా భారతం కవిత్రయం రాసాక వాటిని రాయడానికి ఎక్కువ సాహసించిన వాళ్ళు లేరు. భగవతమూ అంతే! కానీ రామాయణాలు చాలానే వచ్చాయి. నిర్వచనోత్తర రామాయణం, భాస్కర రామాయణం, రంగనాధ రామాయణం, కట్టా వరదరాజ రామాయణం, గోపీ నాధ రామాయణం, వాసు దాసు రామాయణం.. ఇలా ఎన్నో.. చివరగా మన విశ్వనాధ వారి "శ్రీమద్రామాయణ కల్పవృక్షం". ఇలా ఎన్నో..ఎన్నెన్నో.. ఎందుకు రాస్తున్నాము అని వారికి వారే  ప్రశ్నలు వేసుకోవడం సమాధానాలు చెప్పుకోవడం జరిగింది. ఈ విషయాన్ని నేను ఇంతకు మునుపే ప్రస్తావించాను.

నేను గతం లో విన్నవీ..కన్నవీ ఆయా విశేషాల ఆధారంగా.. నాలుగు పంక్తుల్లో.. శ్రీ రామాయణానికీ, మహా భారతానికీ ఉన్న సారూప్యత చెప్పడానికి ప్రయత్నిస్తాను.

మానవ జీవిత మహేతిహాసం మహాభారతం. భారతీయ సాహిత్య జగన్మేరువు శ్రీ మద్రామాయణం. రామాయణం లో సుందర కాండ వలె మహాభారతం లో ఉద్యోగం పర్వం తీర్చి దిద్దబడింది అంటే అతిశయోక్తి గానేరదు. మహా భారతం లో రాయబార రూపంలో రాజనీతి, విదురుని నోట లోక నీతి, సనస్సుజాతుని నోట ఆత్మ జ్యోతి వినిపించాడు వ్యాస భగవానుడు. అలాగే.. "నువ్వు చేసేది ఎమిటి? నీ పిచ్చి గానీ చేసేది చేయించేది నేనే!" అని భగవత్గీత భోదిస్తాడు శ్రీ కృష్ణ పరమాత్మ. ఇక రామాయణం విషయానికి వస్తే..హిందువులకు ఆరాధ్య దైవము శ్రీ రాముడు. శ్రీ రాముని గుడి లేని వూరు లేదంటే అతిశయోక్తి గానేరదు. రామాయణం లో వాల్మీకి మహాముని ద్వారా చెప్పించిన ధర్మ విషయాలు..  ధర్మ తత్పరత, సేవాభావం, సత్యవాక్పరిపాలన, రాముని ఏకపత్నీ వ్రతం మొదలైనవన్నీ ఉన్నాయి. రామాయణం ఏముందండీ.."కట్టె, కొట్టె, తెచ్చె" అంతే.. అని సరదాకి అన్నా.. ఆ విధమైన సౌలభ్యత ఉన్నందువల్ల.. అంటే.. భారతం లో లాగా ఉపాఖ్యానాల గొడవ లేకపోవడం.. ఆద్యంతమూ సాఫీ గా సాగి పోవడం..ఇంకా ముఖ్యంగా చెప్పలంటే.. "బెంచి మార్కు" రచన... అంటే.. "ఇంతకంటే ఎవరు బాగా రాయలేరు బాబోయ్" అనే ప్రామాణిక రచన లేకపోవడం వలన అవ్వొచ్చు. రకరకాల కారణాల వల్ల రామాయణాలు ఎక్కువ పుట్టాయి.

మొల్ల తన రామాయణం మొత్తం 869 గద్య పద్యాలతో ముగించింది. ఏ ఏ ఘట్టాలు వదిలేసిందీ.. ఏవి కల్పించిందీ తర్వాత ముచ్చటించుకుందాము మొదట.. కాండల వారీగా గద్య పద్యాల సంఖ్య చూద్దాము. ఎందుకంటే.. ఏ ఏ కాండలకు ప్రాముఖ్యం ఇచ్చిందీ... ఏవి టూకీగా లాగి పడేసిందీ అర్ధం చేసుకో వచ్చు..పీఠిక అంటే అవతారికలో..24, బాల కాండం లో 100,అయోధ్యా కాండము 43, అరణ్య కాండ 75,  కిష్కింధ -27, సుందర - 249, యుద్ధ కాండ - 351 (మూడు ఆశ్వాసాల్లో...121,93,137 గద్య పద్యాలు) ఇలా సాగింది మొల్ల రచన.

ఇంకా మరికొన్ని విశేషాలు వచ్చే పోస్టింగులలో చూద్దాము. శెలవ్.


26, నవంబర్ 2012, సోమవారం

సంస్కృతంలో... శరీరాంగాని - శరీరాంగములు.


1.అంగుళీ = వ్రేలు
2.అంగుష్టం = బొటనవ్రేలు
3.అనామికా = దర్భ వ్రేలు
4.కనిష్టా = చిటికిన వ్రేలు
5.మధ్యమా = నడిమ వ్రేలు
6.తర్జని = చూపుడు వ్రేలు
7.అంజలి = దోసిలి
8.కూర్పర: = ముంజేయి
9.కరభ: = చిటికినవ్రేలు మొదలు మణికట్టు వరకూ గల భాగము.
10.అరత్ని: = చాచిన చిటికినవ్రేలుగల పిదికిలి తో కూడిన మూర
11.ఉర: = వక్షస్తలం
12.ఊరు: తొడ
13.ఓష్ట: = పెదవి
14.కక్ష: = చంక
15.కట: = మొల
16.కటి: = పిరుదు
17.కంఠ: = కుత్తుక
18.కంధరా = మెడ
19.కపోల: = చెక్కిలి
20.కర్ణ: = చెవి
21.కూర్చం = కనుబొమ్మల నడుమ
22.కూర్పర: = ముంజేయి
23.గాత్ర: = శరీరం
24.గుల్ఫ: = చీలమండ
25.చపేట: = చాచిన వ్రేళ్ళుగల అరచేయి
26. చిబుకం = గడ్డం
27.చూచుకం = చనుమొన
28.జంఘా = పిక్క
29.జత్రు = మూపుసంధి
30.జాను = మోకాలు
31.జిహ్వ = నాలుక
32.తారకా = కంటి నల్ల గ్రుడ్డు.
33.తాలు = దౌడ
34.దశన: = దంతము
35.నఖ: గోరు
36.నాసికా = ముక్కు
37.నేత్రం = కన్ను
38.ప్రకోష్ట: = ముంజేయి
39.బాహు: = భుజము
40.భ్రూ: = కనుబొమ్మ
41.వంక్షణ: = గజ్జలు
42.వస్తి: = పొత్తి కడుపు
43.స్కంద: = మూపు

ఇంకా కొన్ని విశేషాలు వచ్చే పోస్టింగులో చూద్దాము. శెలవ్.




మొల్ల రామాయణము - 3




మొల్ల తన కవితా విధానం ఎలా ఉండబొయ్యేది ముందుగానే చెప్పింది. తండ్రీ కూతుళ్ళు ఇద్దరూ భగవత్సేవకులే! ప్రతిభా విశేషాలు కలవాళ్ళే!

సీ! దేశీయ పదములు దెనుగులు సాంస్కృతుల్
             సంధులు ప్రాఙ్ఞుల శబ్ద వితతి
శయ్యలు రీతులు జాటు ప్రబంధంబు
             లాయా సమాసంబు లర్ధములును
భావార్ధములు  గావ్య పరిపాకములు రస
             భావచమత్కృతుల్ పలుకునరవి
బహువర్ణములును విభక్తులు ధాతుజ
             లంకృతి ఛందోవిలక్షణములు(


తే!గీ! గావ్య సంపద క్రియలు నిఘంటువులును
గ్రమములేవియు నెఱుగ విఖ్యాత గోప
వరపు శ్రీకంఠమల్లేశు వరము చేత
నెరి గవిత్వంబు జెప్పగా నేర్చుకొంటి!



అని వినయంగా చెప్పుకుంది మొల్ల తల్లి. కావ్య సామగ్రీ, అలంకారాలూ, అవీ, ఇవీ అన్నీ చెప్పి చివరకు తనకేమీ తెలీదనడంలోనే ఉంది అవిడ ప్రతిభంతా! అది మర్యాదకు అనాటి సాంఘిక పరిస్తితులలో "స్త్రీలు కావ్యాలు రాయడమేంటి?" అనే ప్రబుద్దులు ఉన్నారేమో!  అనేక సమస్యలు ఉండేవేమో.. తెలీదు. కనీ కావ్యం మొత్తము పరిశీలించిన వారికి ఈమెకు ఏమీ తెలీదు అని ఎవ్వరూ అనరు. ఏది ఎమైనా అవిడ వర్ణనలూ అవీ ఇవీ రాబోయే పోస్తింగులలో చూద్దాము.

చివరిగా ఆవిడ.. అసలు కావ్యం ఎలా ఉంటే బాగుంటుందో..ఎలా ఉంటే బాగోదో కూడా చెప్పినది.  కావ్యానికి ఆవిడ ధ్వని విశిష్టత చెప్పింది. ధ్వని పరిపూర్ణంగా ఉండాలని చెప్పి కావ్య లక్షణమని ఒక నిర్వచనం చెప్పడం ఆవిడ పాండిత్య పటిమకు తార్కాణము.

ఇంకా విశేషము ఏమిటంటే...తెలుగు బాష ఎంత సంస్కృతమయమైనా తెలుగులో రాయడానికి ఉపక్రమిస్తే.."తమ విద్య మెరయ"  అంటే.. తమ పాండిత్య విద్య కనబరచు కోవడం కోసం "క్రమ్మర ఘనమగు సంస్కృతము జెప్పగా రుచియగునే" అని చెప్పి ఆ కాలంలో తెలుగు కావ్యాలలో సాంస్కృతీ పండితీ ప్రకర్ష చూపిన కొందరు కవులను ఎత్తిపొడిచింది.కుకవులను నిందించకపొయినా ఒక విధంగ ఇది కుకవి నింద గా భావించవచ్చు. ఇంకో విషయం ఏమిటంటే.. అవిడకు ముందు రాసిన వారందరూ..సంస్కృతమయాలు గ ఉండి సామాన్య ప్రజానీకానికి అందుబాటులో లేవనీ తను రాసినది తెలుగులో అందరికీ అందుబాటులో ఉంటుందనీ నర్మగర్భంగా చెప్పకనే చెప్పింది మొల్ల.

ఇంకా ఇలా అంది...

చెప్పుమని రామచంద్రుడు
చెప్పించిన పల్కుమీద చెప్పెద నేనె
ల్లపుడు నిహపరసాధన
మిప్పుణ్య చరిత్ర తప్పులెంచకుడు కవుల్.

ఇంకా...

నేరిచి పొగడిన వారిని
నేరక కొనియాడువారి నిజకృపమనుపం
గారణమగుటకు భక్తియె
కారణమగుగాని చదువు కారణమగునే!
ఈ రామాయణము చెప్పడానికి కారణం..రామచంద్రుడు తనలో ఉండి చెప్పించడమూ.. భక్తి శక్తీ కారణం గానీ చదువు కారణం కాదని "ఓ చురక" వేసింది. శ్రీ రామ చందంద్రుడు చెప్పిస్తే చెప్తున్నాను.మీరు ఎంచే తప్పొప్పులకు పరీక్షకు  కాదు సుమా అని కూడ దెప్పి పొడిచింది సన్న సన్నగా...

మిగతా విశేషాలు రాబోయే పోస్టింగులలో... చూద్దాము.  స్వస్తి.

23, నవంబర్ 2012, శుక్రవారం

మొల్ల రామాయణము - 2


కృత్యాది లో ప్రబంధాలలో వలె దేవతా ప్రార్ధన ఉంది. ముఖ్యంగా శ్రీ రామ,శివ,విష్ణు,బ్రహ్మ,విఘ్నేశ్వర ప్రార్ధనల అనంతరం..త్రిమూర్తుల దేవేరుల వర్ణన ఉంది. పార్వతీ దేవి, లక్ష్మీ దేవి, సరస్వతీ దేవుల గురించి ప్రార్ధన. ఈ రామాయణం మహిళా విరచితం అవడం వల్ల.. ఆ ముద్ర ఎక్కువగా కనిపిస్తుంది. ఆ చమత్కారం ఏంటో చూద్దాము.

చ. కరిముఖుండుంగుమారుడు వికారపుజేతుల ముద్దు సూపుచున్
గురువులు వారు చుస్సరిగ గుట్టలు దాటుచు జన్నుదోయితో
శిరములు రాయుచుం , గబరి జేర్చిన చంద్రుని బట్టి తీయగా
గరములు జూప నవ్వెడు జగమ్ముల తల్లి శుభంబులీవుతన్! (6)

ఆహాహా చూసారా! మహనీయ మాతృసంభావనా మధులిప్స యందు బాల కైశోర  సుందరమూర్తులై పసిపిల్లల అల్లరి పనులలో ఉండే సౌందర్యాన్ని కళ్ళకు గట్టినట్టు ఉంది గదా! జగన్మాతృ పరమైన ఈ వర్ణన ఈ పద్యం లో....


మొల్ల వ్యక్తిగత జీవిత విషాయల జోలికి వెళ్ళకుండా ఉంటే ఆమె "బ్రహ్మచారిణి" అని మనం నమ్మవచ్చు. అయినా మహిళల స్వభావాలు, గంభీరత మొదలైనవి ఈ క్రింది పద్యం లో చక్కగా పోషించింది. గృహిణి శౌభాగ్య గరిమ తనాన్ని చక్కగా చూపడం ఈ కింది పద్యం పరమార్ధం.

ఉ. మేలిమి మంచుకొండ నుపమింపగ జాలినయంచనెక్కి  వా
హ్యాళి నటించు వచ్చు చతురాస్యు నెదుర్కొని నవ్వు దేరగా
వాలిక సోగ కన్నుల నివాళి యొనర్చి  ముదంబు గూర్చువి
ద్యాలయ వాణి శబ్దముల నర్ధములన్ సతతంబు మాకిడున్! 

చూసారా!  మొల్ల చతురత. రాయంచ తేరు నెక్కి వాహ్యాళి నటించి వచ్చిన బ్రహ్మ దేవుడికి సరస్వతీ దేవి వాలిక సోగ కన్నులతో నివాళి యొనర్చినదట. వినయశీలత, విద్యామర్యాదలే విఙాఞన సంపద గృహిణికి.

ఆ తర్వాత సుకవుల గురించి స్తుతి వర్ణనలు ఉన్నాయి.  "సురత సన్నుత ఙాఞాను సువివేకి వాల్మీకి" (9) అనే సీస పద్యంలో వాల్మీకి వ్యాస భగవానుల తర్వాత, సంస్కృత కవులు భారవి, మాఘుడు, భవభూతి, భట్ట బాణుడు, కాళిదాసాదులను కొనియాడారు. పిమ్మట నాచన సోమన, నన్నయ, శ్రీనాధుడు మరియూ రంగనాధుడు లను దలచి "బల్లిదులైనట్టి ఘనుల భక్తిగ దలతున్! (10) అన్నారు. ఈమె తన కాలాన్ని గురించి ప్రస్తావిచక పోయినప్పటికీ.. శ్రీనాధుని తర్వాత కాలం లో మొల్ల జీవించిందనే మాట.. విరేశీలింగం పంతులు మొదలు.. ఆరుద్ర వరకూ అందరూ అదే కాలం ఖాయం చేసారు. ఐతే... ఆంధ్ర దేశం లో ప్రజల నాలుకల మీద ఉన్న కధలను బట్టి శ్రీ కృష్ణ దేవరాయాల ఆస్తానం లొ ఉన్న (?) తెనాలి రామకృష్ణ కవి తన కాలక్షేప హాస్య చతురత లో ఈవిడనూ ఆడుకొన్నాడని కొందరు అంటూ ఉంటారు.

ఆ తర్వాత ఆవిడ తను "గురులింగమార్చన పరుడును, శివభక్తి రతుడు, బాంధవహితుడు, గురుడాతుకూరి కేసయ వరపుత్రి...(11) అని చెప్పుకొంది. తండ్రేమో... శివభక్తి రతుడూ.. కుమార్తె..రామ భక్తి పరాయణ.. తండ్రీ కూతుర్లలో శివకేశవ అద్వైత భక్తి ఉండడం ఒకింత విస్మయం కలిగించినా.. తిక్కన సోమయాజి పెట్టిన "హరిహరనాధ సిద్ధాంతం" అనుసరించారేమో.. అనుకోవచ్చు.

ఆ తర్వాత తన పద్య కవిత్వం ఎలా ఉండబోతుందో చెప్పింది..ఆ విశేషాలు వచ్చే పోస్టింగులో చూద్దాము. ప్రస్తుతానికి స్వస్తి.

ప్రాసాక్షర పదాలు మరికొన్ని...


ప్రాసాక్షర పదాలు మరికొన్ని....

"గ" గుణింతంతో మరికొన్ని చూద్దాం.

అంగి-చొక్కా, గంగి-సాధువైన,జంగి-క్రోవి, బంగి-మూట,  మంగి-మంగలి, అంగు-అందము, కంగు-ఒక సవ్వడి, ఖంగు - కంగుమని మోగడం, చంగు - ఒక అనుకరణము, జంగు-గజ్జె, దంగు-నలుగు, దంగు-దంపు, పంగు-బెదరు, భంగు-గంజాయి, మంగు-మచ్చ, రంగు-వెలుగు, వంగు-వ్రాలు, హంగు-హంగామా.

అలాగే... గాంగము-గంగకు సంబంధించిన, అంగిక-చొక్కా, జంగిక-క్రోవి, భంగిక-గంజాయి,అంగిలి-లోకుత్తుక, జంగిలి-ఆలమంద, పంగిలి-ఒగ్గము, ఎంగిలి-ఉచ్చిష్టము, ముంగిలి-ముందు వాకిలి,

అలాగే.. కాంగాణి-పనికిరానిది, పింగాణి-ఒక దినుసుమట్టి, సింగాణి- కొమ్మువిల్లు, గొంగళి-ఒక పురుగు,  తొంగలి-కాంతి, పొంగలి-పాయసాన్నము, చెంగలి-దగ్గర, వెంగలి-మొఱకు, చింగుళ్ళు-పింజెలు, డింగిళ్ళు-మ్రొక్కుటలు, తొంగిళ్ళు-పాత బట్టలు, దింగిళ్ళు-కంటి జబ్బు, అంగణము-ముంగిలి, టంగణము-వెలిగారము, ఇంగనము-కదలిక, లింగనము-కౌగలింత, అంగారము-నిప్పు, బంగారము-పసిడి, భృంగారము-బంగారము, శృంగారము-అలంకారము, ఇంగలము-నిప్పు, పింగలము-ఇత్తడి, సింగలము-లంకా ద్వీపము, ఉంగరము-బటువు, డింగరము-పరాభవము,పొంగరము-ఒక బక్ష్యము,బొంగరము-ఒక ఆట వస్తువు, కంగాళము-ఒక పెద్ద వంట గిన్నె, గంగాళము-బాన, జంగాళము-వదులు, బంగాళము-పక్షి విశేషము, జంగలము-అడవి, మంగలము-మండ, జాంగలము-మాంసము, లాంగలము-నాగలి, టంగరము-వెలిగారము, సంగరము-యుద్ధము, డంగురము-వీరణము, భంగురము-నశించునది, వంగడము-వంశము, సంగడము-కలయిక.  మొదలైనవి...

మరికొన్ని తర్వాత పోస్టింగులలో చూద్దాము.

22, నవంబర్ 2012, గురువారం

సంస్కృతం గురించి కొంత... సరుకులు/పదార్ధాలు పేర్లు......


ప్రపంచలో అతి ప్రాచీనమయిన భాష సంస్కృతం. దేవ భాషగా ప్రసిద్ది చెందిన ఈ భాషలోనే మన మహర్షులు వేదాలు, పురాణాలు, మానవ సమాజ సంస్కృతీ వికాసానికి కావలసిని అనేక గ్రంధాలను రచించారు. ప్రపంచంలో అనేక భాషలకు తల్లి వంటిది సంస్కృతమే. ఇండో- యూరోపియన్ భాషల్లో అత్యంత శాస్త్రీయంగా, సంపూర్ణముగా, వ్యాకరణబద్దమయిన మొట్టమొదటి భాష కూడా సంస్కృతమే. ఐతే గత కొద్ది కాలంగా సంస్కృత బాష అనాదరణకు గురికావడం బాధిస్తోంది. మళ్ళీ ఆ స్వర్ణ యుగము వస్తుందని నమ్మే వాళ్ళలో నేనూ ఒకడిని.

ఏక్కడో చదివిన గుర్తు నాకు ఏమిటంటే...  తెలుగు సంగీతం వంటి భాష,తమిళం వాదానుకూల భాష,ఇంగ్లీషు తెలివిగా పట్టు చిక్కకుండా నిజమైన భావాలను దాస్తూ మాట్లాడే భాష,ఉర్దూ శృంగారమైన భాష, సంస్కృతం మంత్ర శక్తి గల భాష. ప్రతి మాటకు మంత్రపరమైన శక్తి ఉన్నది.  అందుకే సంస్కృతంలో ఉచ్చారణ సరిగా ఉండాలంటారు.

మనం నిత్య జీవితంలో ఉపయోగించే అనేక వస్తువుల, జంతువుల పేర్లు ఇవన్ని సంస్కృతం నుండి వచ్చినవే. ఇవన్నీ ఒక్కసారిగా చదవడమూ గుర్తుంచుకోవడమూ కష్టతరమైన పనే!

ఇంకో ఆసక్తికరమైన విషయం చెప్పి పదాల్లోకి వెళ్దాం.  ఇటీవల సాక్షి బృందం విజయవాడ లో సీతారామపురం లో ఒక ఇంటికి వెళ్ళారట.. ఆ ఇల్లు గలావిడ పేరు ఉమ. వీళ్ళు వెళ్ళేసరికి.... ఆ బృందం మాటల్లో...

‘మమనామ ఉమా వెంకట రామకృష్ణన్’ అంటూ పరిచయం చేసుకున్నారామె. విజయవాడలోని సీతారామపురంలో ఒక అపార్ట్‌మెంట్‌లో నివసించే ఉమ (42)ను కలవడానికి వెళ్లినపుడు ఆమె వంట పనిలో ఉన్నారు. ఆమె పక్కన అల్మరాల్లో డబ్బాలున్నాయి. వాటి మీద సంస్కృతం పేర్లు ఉన్నాయి. ‘‘లవణమ్, భూ చణకః, శర్కరా, కటుః’’ ఆ పేర్లను కష్టం మీద చదువుతూంటే... ‘‘నిజానికి సంస్కృతం అంత కటువైన భాషేమీ కాదండీ. చాలా సులభంగా వచ్చేస్తుంది’’ అన్నారు ఉమ.


‘‘సంస్కృతం ఒక సముద్రం లాంటిది. ఎంత నేర్చుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. రోజూ అందరూ పడుకున్నాక ప్రశాంతంగా ఉన్న సమయంలో సాధన చేస్తాను’’ అన్నారామె. ‘‘సంస్కృతంలో మాట్లాడడం చూసి కొంతమంది ముఖం మీద, కొంతమంది చాటుగా నవ్వేవారు. జనాభా లెక్కల వాళ్లకు మాతృభాష సంస్కృతం అని చెప్తే అసలు తమ ఫామ్‌లో ఆ పేరే లేదన్నారు’’ అని చెప్పారామె. హృదయం నుంచి పుట్టింది... ‘‘సంస్కృతం పుస్తకాల్లో నుంచి కాదండీ... హృదయంలో నుంచి పుట్టింది’’ అంటారు ఉమ. అందుకే ఆ భాషలో ప్రతి పదం శక్తిమంతంగా, మనస్ఫూర్తిగా ఉంటుందని విశ్లేషిస్తారు. సంస్కృత భాషలో పరిపూర్ణత సాధిస్తే మిగిలిన భాషల్ని నేర్చుకోవడం చాలా తేలిక అని ఆమె నమ్మకం. ఆ నమ్మకంతోనే గత పది హేనేళ్లుగా సంస్కృత భాష పట్ల ఆసక్తి ఉన్నవారి కోసం ఉచితంగా శిక్షణ తరగతులూ నిర్వ హిస్తున్నారామె. ‘సంస్కృతభారతి’ అనే సంస్థలో చేరి గుంటూరు, భీమవరం, రాజమండ్రి... ఇలా అనేక పట్టణాలకు తిరుగుతున్నారు. ఏ ప్రతిఫలం ఆశించకుండా సంస్కృత వికాసానికి పాటు పడుతున్నారు.



తన సంస్కృత ప్రియత్వం గురించి, ఆ భాష వెలుగు పట్ల తనకున్న ఆకాంక్షల గురించి ఆమె చెప్పడం పూర్తి చేశారు. టైమెంతోనని హాల్లో ఉన్న గడియారం చూస్తే దాని మీద ‘బిత్తిఘటీ’ అని ఉంది. దాన్ని చూస్తూ ‘‘సరే ఉమగారూ. వెళ్లొస్తాం’’ అంటే ‘‘ధన్యవాదాః’’ అంటూ రెండు చేతులూ చక్కగా జోడించారు. వేల ఏళ్ల చరిత్ర కలిగిన భాషను వర్తమానంలో వెలిగించడానికి ఈ సాధారణ గృహిణి చేస్తున్న చిరు ప్రయత్నం మరింత మందిలో సంస్కృతాభిమానాన్ని మేల్కొలిపితే... సంస్కృత భాషకు అది అమృతంగా మారుతుంది. భారతీయతను విశ్వవ్యాప్తం చేసే మనదైన ‘పలుకు’బడి అవుతుంది.

మరి అదండీ విషయం మనమూ ఉడతా భక్తి గా ఏదో చెయ్యలి గదా!!!!


ఈ కింద కొన్ని పదాలు అంటే..  ఉమా గారి ఇంట్లో ఉన్న సరుకుల డబ్బాలపై అంటించిన కాగితాలు ఇలా ఉన్నాయట. వాటి అర్ధాలూ చూద్దాము.

1.సర్షపా: = ఆవాలు 2. వితున్నకం = ధనియాలు 3. లవంగం = లవంగము 4. మరిచా: = మిరియాలు 5. మేంధీ = మెంతులు 6.మషా: = మినుములు 7. చణకా: = శనగలు 8.హింగు: = ఇంగువ 9.గోధుమా: = గోధుమలు 10. జీరకం = జీలకఱ్ర. 11. తండులా: = బియ్యము 12.కర్పూరం = కర్పూరము 13. కాశ్మీర జన్మ = కుంకుమ పువ్వు 14. ఆఢకా: = కందులు  15. ముద్గా: = పెసలు 16.ఏలా: = ఏలక్కాయ 17. జాతిపత్రికా = జాపత్రి.

ఇంకొన్ని మళ్ళీ తరువాతి పోస్టింగులలో  చూద్దాము. స్వస్తి.

ఒక సుభాషితము.


శ్లో! అగ్నిహోత్రం  గృహం క్షేత్రం గర్భిణీం వృధ్ధ బాల కౌ
రిక్త హస్తేన నోపేయా ద్రాజానం దైవతం గురుం.

తా. అగ్నిహోత్రము, తన గృహము, పుణ్యక్షేత్రము, గర్భిణీ, ముసలివారు, బాలకులు, రాజు, దైవము, గురువు వీరి వద్దకు వెళ్ళునపుడు ఉత్త చేతులతో పోరాదు. సమిధలు, ఉపకరణములు, పండ్లు, పువ్వులు మొదలైనవి తీసుకుని వెళ్ళవలెను అని భావము.

శ్లో! పిబంతి నద్యస్స్వయమేవనాంభ:
ఖాదంతిన స్వాదుఫలాని వృక్ష:
పయోధరాస్సస్యమదంతినైవ
పరోపకారాయ సతాంవిభూతయ:

తా. నదులు తమయందలి జలమును తాము త్రాగవు. వృక్షములు తమ తీయని పండ్లను తాము తినవు. మేఘములు తమా వర్షము వలన పెరిగిన పైర్లను తాము తినవు. ఏమనగా సత్పురుషుల ఐశ్వర్యములు పరోపకారం కోసమే గదా!

మొల్ల రామాయణం

మొల్ల రామాయణం చదివారా?


మాయా మానుష వేషధారియై, మానవాళికి ఉదాత్తచరిత్ర రూపకల్పనమొనరిచడానికి శ్రీ రామచంద్రుడు గా పుడమియందవతరించి  ముకుంద ధర్మ ప్రతిపాదనం చేసిన వైకుంఠుని చరిత్ర రామాయణాన్ని సంగ్రహ రూపం లో మనకందించిన కవయిత్రి మొల్ల.

రసధర్మలోలుపులైన తెలుగువారి హృదయాలలో పరిమళ  లహరులై సుడులు తిరిగిన శ్రీ రామ చంద్రుని అమలిన శృంగార ధర్మ వీరాలతో బాటుగా...ఇడుముల సిడెమెత్తి  తన జాతి గుండెలలో కరుణకు గుడి కట్టిన సాధ్వీమతల్లి సీతమ్మ శోకం కూడా తెలుగు వారి మెత్తని యెదలను ఘూర్ణిల్లజేసింది.

రామాయణానికి ‘సీతాయాశ్చరితం, పౌలస్త్యవధమ్’ అని మరో రెండు పేర్లు కూడా ఉన్నాయి. ‘కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ పౌలస్త్యవధ మిత్యేవ చకార చరిత వ్రత:’, అనే శ్లోకమే ఇందుకు తార్కాణం. వాల్మీకి తన రామాయణాన్ని పాఠ్యే గేయే చ మధరమ్ అని చెప్పుకున్నాడు.

కూజంతం రామరామేతి మధురం మధురాక్షరమ్
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలమ్..... వాల్మీకి అనే కవికోకిల కంఠస్వరం నుండి నాదాత్మకమైన వేదం రసాత్మకమైన రామాయణ మహాకావ్యంగా ఆవిర్భవించింది.

పోతే..ఇంతకు ముందు ఎంతోమంది కవులు శ్రీ రామాయణాన్ని రచించి ఉండగా మళ్ళీ ఎందుకు తల్లీ  ఈ రామాయణం?  అని అడగ్గా... ఆ కవయిత్రీమతల్లి మొల్లతల్లి ఏమన్నదో తెలుసా...?

అది రఘురాము చరితము
నాదరముగ విన్నగ్రొత్తయై  లక్షణ సం
పాదమ్మై పుణ్య స్థితి
వేదమ్మై దోచకున్న వెఱ్ఱినెచెప్పన్...  అంది.

అంటే..నాయనా... అది రఘురాముని చరిత్ర ఆదరంగా వినండి..నిత్యమూ కొత్తదనము ఉంటుంది. అలా చెప్పక ఎలా చెబుతారేమిటి? ముందు రాసినవన్నీ ఏమీ బాగోలేవు. నేను రాసిందే బాగుంటుంది అని చెప్తుందా ఎక్కడైనా?

ఇంతమంది ఇన్ని విధాలుగా రామాయణ కావ్యాన్ని మళ్లీ, మళ్లీ చెప్పడం ఎందుకనే ప్రశ్రకు ఆయా కవులే సమాధానాలిచ్చారు. జయదేవుడు ప్రసన్న రాఘవ నాటకమున, ‘స్వసూక్తీనాం పాత్రం రఘుతిలక మేకం కలయతాం కవీనాం కో దోష: సతు గుణగణానా మవగుణ: ’ (శ్రీ రాముని తమ కావ్య నాయకునిగా చేయటంలో కవుల తప్పులేదు అది శ్రీరాముని గుణగణముల దోషమేకానీ అనిఅర్ధం). అలాగే, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం రాస్తూ, ‘మరల నిదేల రామాయణం బన్నచో నీ ప్రపంచక మెల్ల నెల్ల వేళ తినుచున్న యన్నమే తినుచున్న దెప్పుడు తన రుచి బ్రతుకులు తనవికాన’, అన్నారు. రామాయణ గాథను పలువురు పలు, పలు విధాల కథావస్తువుకు మార్పు రాకుండా రచించారు. చాలావరకూ, ఈ రచనలన్నింటికి మూలం వాల్మీకి రామాయణమే!


మొల్ల కవితా ప్రఙఞా విశేషాలు అవీ వచ్చే పోస్టింగులలో చూద్దాము.

21, నవంబర్ 2012, బుధవారం

వృత్త పద్యాలు - వివరణ


పద్య మంజూష అని చెప్పి పద్యాల గోల వదిలేసి ఏవేవో రాస్తున్నాడు ఏమిటి? అనే సందేహం కలిగే ఉంటుంది. కానీ ఇవన్నీ పద్య రచనకు ఉపయోగపడే సాధనాలే..

అయితే గతం లో మనం పద్యాల్లో "జాతులు" గురించి తెలుసుకున్నాము. వృత్తాల గురించి ప్రస్తావన చెయ్యలేదు. ఆ వృత్తాల గురించి సంక్షిప్తంగానైనా తెలుసుకోవడం అవసరం కదా! ఆ వివరాలేమిటో చూద్దాము.

ఛందములు 26 ఉన్నాయి. వాటికి పుట్టిన వృత్తాలను లెక్కిస్తే..6,71,08,864 వృత్తాలు పుట్టాయట. ఐతే..ఛంద: కర్తలు 200 కంటె వృత్త బేధాలు ఎక్కువగా చెప్పలేదు. అందునా గ్రంధాలలో ఉపయోగించినవి 50 కంటె ఎక్కువ ఉండవు.


1.ఉత్పలమాల:     4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో  భ,ర,న,భ,భ,ర,వ అనే గణాలు వస్తాయి. 10 వ అక్షరం యతి స్తానం గా ఉంటుంది. వృత్తపద్యాలలో ప్రాస నియమము ఉంటుంది. పద్యములో ఒక పాదము ఆద్యంతము ఒక చక్రము వలె నడిస్తే మిగిలిన  3 పాదములు  కూడా అదే చక్రము నడక సాగిస్తుంది. ఒక క్రమంలో ఉండే గణాలు వరుసగా నాలుగు పాదాలలోనూ ఆవృత్త మౌతున్నందున దీనికి వృత్త పద్యము అనే పేరు వచ్చింది.

ఇక వృత్త పద్యాలకు ప్రాస నియమము చెప్పఁ బడిన చోట అది నాలుగు పాదాలలోను రెండవ అక్షరం ఒకే హల్లు లేదా సంయుక్త హల్లు తప్పక రావాలి. ద్వితీయో వర్ణః ప్రాసః పాద పాదేషు.. --- ప్రాసః సర్వేషుచ ఏకయేవ స్యాత్. అని నియమము.

ఇక యతి విషయానికొస్తే యతిర్విచ్ఛేద సంజ్ఞకః అన్నారు. యతి నియమము ఏయే వృత్తాలకు ఎలాయెలా నెర్దేశింపఁ బడిందో గమనించి పాటించాలి. యతుల గురించి మనం ఇది వరకు విస్తారంగా చెప్పుకున్నము.ప్రాస యతి మాత్రము చెల్లదు. నాలుగు పాదాలు కాక అంతకన్నా ఎక్కువ పాదాలు గల దానిని మాలిక అంటారు. అది ఉత్పలమాలైతే ఉత్పల మాలిక అని అంటారు.


ఈ సందర్భంగా...అల్లసాని పెద్దన వృత్తమాలిక "పూఁత మెఱుంగులుం బసరుపూఁప" తలుచుకోకుండా ఉండడం కష్టమైన పనే!

కవుల ప్రాగల్భ్యమో..కాల ప్రభావమో.. ఇదిమిద్తమని చెప్పలేము గానీ ఆంధ్ర ప్రభందయుగమున పదునారవ శతాబ్దము పాల వెల్లులు కురిపించిన పసిడి యుగమని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.

పద్యం తన యౌవనాన్నీ..పదం తన బాల్యాన్ని జరుపుకుంటున్న రోజులవి. ఆ రోజుల్లో ఒకనాడు రాయలు భువనవిజయంలో బంగారు పళ్లెంలో పెట్టిన గండపెండేరాన్ని తెప్పించి సంస్కృతాంధ్రాలలో సమానంగా కవిత్వం చెప్పగలిగే వారు ఉంటే వచ్చి అందుకోమని చెప్పాడు. సభలో కవులందరూ మౌనంగా ఉన్నారు. అప్పుడు రాయలు ఆశ్చర్యంగా హయ్యో.... ఏమిది... అకటా.. "ముద్దుగ గండపెండెరమున్ గొనుడంచు బహూకరింపగ
నొద్దిక "నాకొసంగు"మని యొక్కరుఁ గోరగలేరు లేరొకో?" అన్నాడు. అప్పుడు లేచాడు మన మధుర గంభీర వచశ్రీయుతుడైన మన (మను) పెద్దన..... లేచి... ఏమన్నాడయ్యా అంటే.....పెద్దన బోలు పండితులు పృధ్విని లేరని నెవెఱుంగవే? పెద్దన కీదలంచినను బేరిమి నాకిడు కృష్ణరాణ్ణృపా!

తా. రాజా! ఈ భూమండలంలో ఈ పెద్దన కంటే గొప్ప పండితుడు లేరని నీకు తెలీదా? నాకు ఇవ్వదలచిన వెంటనే ఇవ్వు అని అన్నాడు పెద్దన. అని వూరుకున్నాడా...  ఈ పద్యం చూడండి.. దాని సొగసు చూడండి..

పూఁత మెఱుంగులుం బసరుపూఁప బెడంగులుఁ జూపునట్టివా
కైతలు? జగ్గు నిగ్గు నెనగావలెఁ గమ్మనఁ గమ్మనన్వలెన్
రాతిరియున్ బవల్ మఱపురాని హొయల్ చెలి యారజంపు ని
ద్దా తరితీపులో యనఁగఁ దారసిలన్వలె లోఁ దలంచినన్
బాఁతిగఁ బై కొనన్ వలెను బైదలి కుత్తుకలోని పల్లటీ
కూఁతలనన్వలెన్ సొగసుకోర్కులు రావలె నాలకించినన్
జేతికొలందిఁ గౌగిటను జేర్చిన కన్నియ చిన్ని పొన్ని మే
ల్మూఁతల చన్నుదోయివలె ముచ్చటగావలెఁ బట్టిచూచినన్
డాతొడనున్న మిన్నులమిటారపు ముద్దులగుమ్మ కమ్మనౌ
వాతెఱదొండపండువలె వాచవిగావలెఁ బంటనూదినన్
గాతలఁ దమ్మిచూలిదొర కైవసపుం జవరాలి సిబ్బెపు
న్మేతెలి యబ్బురంపు జిగి నిబ్బర పుబ్బగు గబ్బిగుబ్బపొం
బూఁతల నున్న కాయ సరిపోఁడిమి కిన్నెర మెట్లబంతి సం
గాతపు సన్నతంతి బయకారపుఁ గన్నడ గౌళపంతుకా
సాతత తానతానలపసన్ దివుటాడెడు గోటమీటు బల్
మ్రోతలునుంబలెన్ హరువు మొల్లముగావలె నచ్చతెన్గు లీ
రీతిగ సంస్కృతంబు పచరించెడు పట్టున భారతీవధూ
టీ తపనీయగర్భనికటీ భవ దాననపర్వసాహితీ
భౌతిక నాటకప్రకర భారత భారత సమ్మతప్రభా
శీతనగాత్మజా గిరిశశేఖర శీత మయూఖరేఖికా
పాతసుధాప్రపూర్ణ బహుభంగఘుమంఘుమఘుంఘుమార్భటీ
జాతక తాళయుగ్మ లయసంగతి చుంచు విపంచికా మృదం
గాతత తేహితత్తహిత హాధితధంధణుధాణుధింధిమి
వ్రాతనయానుకూల పదవారకుహూద్వహ హారికింకిణీ
నూతనఘల్ఘలా చరణనూపుర ఝూళఝుళీ మరందసం
ఘాతవియద్ధునీ చకచక ద్వికచోత్పలసారసంగ్రహా
యాత కుమారగంధవహహారి సుగంధ విలాసయుక్తమై
చేతము చల్లఁజేయవలె జిల్లన జల్లవలెన్ మనోహర
ద్యోతకగోస్తనీఫలమధుద్రవ గోఘృతపాయసప్రసా
రాతిరసప్రసారరుచిరప్రసరంబుగ సారె సారెకున్।

చూడండి..ఈ పద్య మాధుర్యం మళ్ళీ ఎన్ని యుగాలకు చూడగలం మనం.

ఇవాల్టికి స్వస్తి.






సంస్కృతంలో పక్షుల పేర్లు


పక్షిణ: - పక్షులు
శుక:  - చిలుక
బక: - కొంగ
కాదంబ: - బాతు
ఉష్ట్రః - ఒంటె

ఖడ్గీ - ఖడ్గ మృగము
చిత్రక: - చిరుతపులి
చిత్రోష్ట్ర: - జిరాఫీ
భల్లూక: - భల్లూకము, ఎలుగుబంటి
కుక్కుట: - కోడి
కాక: - కాకి
కోకిల: - కోకిల
మశక: - దోమ
ద్విరేఫ: - తుమ్మెద
గృధ్ర: - గ్రద్ద
హంస: - హంస
మూషక: - ఎలుక
మధుమక్షికా - తేనెటీగ
జతుకా - గబ్బిలము
కపోత: - పావురం
గరుడ: - గరుడుడు
మక్షికా - ఈగ
మధుకోశ: - తేనెతుట్టె
పిపీలిక - చీమ
పుత్తిక: - రెక్కల చీమ
చిత్ర పతంగ: - సీతాకోకచిలుక
శ్యేన: - డేగ
దావాఘాట: - వడ్రంగి పిట్ట
చతక: - పిచ్చుక
మయూర: - నెమలి
ఉలూక: - గుడ్లగూబ.

మరికొన్ని వివరాలు తర్వాత చూద్దామా.... శెలవు.

20, నవంబర్ 2012, మంగళవారం

కాశీ ఖండము - కాశీ తీర్ధ మహిమ - 4


సీ! అఖిల కాలము శంభునర్చించిన ఫలంబు
సకృదీక్షణముబున సంభవించు
భవ సహస్రముల సంపాదితంబగు పుణ్య
మొక ప్రదక్షిణమున కుపమ గాదు
పుష్ప ప్రదానంబు బోలంగ లేవు షో
డశ మహాన కాండములు గూడి
తలకూడు నశ్వమేధ ఫలంబు పంచామృ
తాభీషేక విధాన మాచరింప.

తే!గీ! వాజపేయ సహస్ర ప్రవర్తనమున
గల ఫలంబబ్బు నైవేద్య కల్పనమున
నిన్నియును జిత్తగించి విశ్వేశునభవు
గాశికా ధీశు భజింపు కలశ జన్మ! (124)

తా. బ్రతికి యున్నంత కాలము శివార్చన చేసిన ఫలము ఒక్క సారి సందర్సించినందువలన గలుగును. జన్మ సహస్రములచేత సంపాదించిన పుణ్యము ఒక్క ప్రదక్షిణమునకు సాటి రాదు.షోడస మహాదానములు చేసిన ఫలము ఒక్క పుష్పము అర్పించిన దానితో బోలలేవు. పంచామృతభిషేకవిధి ఆచరించిన దానితో సరిపోలవు. పంచామృతభిషేకవిధి ఆచరించినచో అశ్వమేధ యాగ ఫలము గలుగును.నైవేద్య కల్పనమువలన వేయి వాజపేయ యాగములు చేసిన ఫలము దక్కును. అన్నియును మనసునకు దెచ్చుకొని కాశీ పురేస్వరుడు, జన్మ రహితుడు అయిన విశ్వేశ్వరుని భజింపుము.


కం. గొడుగులు వింజామరలు
బడగలు నుందాళవృంత పటవాసములున్
మృడునికొసంగిన ధన్యుడు
పుడమిని జైకాత పత్రముగ బాలించున్! (125)

తా. శ్రీ కాశీ విశ్వేశ్వరునకు ఛత్రములు, వింజామరలు, ధ్వజములు, తాళవృంతములు, వస్త్రాది వాస సుగంధి చూర్ణములు సమర్పించిన పుణ్య పురుషుడు ఏకఛత్రాధిపత్యముగ పుడమిని యేలును.


వ. మరి యాస్తిక్యబుద్ధి, వినయంబు మానావమానంబుల వికృతి లేమి, యకామిత్వం, బనౌద్ధత్యం, బహింస, యప్రతిగ్రహ వృత్తి, యధాంబికత్వం,బలుభ్దత,యనాలసం, బపౌరుష్యం బదీనత యాదిగా గల గుణంబులు కాశీ తీర్ధ వాసి కవశ్యంబును సంభావనీయంబులు.

తా. కాశీ తీర్ధమందు నివసించియుండు మనుష్యుడు తప్పనిసరిగా..ఈ ఆత్మ గుణములను అలవరచుకొనవలెను. ఆస్తిక్యబుద్ధి, వినయము, మాన అవమానములయందు వికారము లేక ఉండుట,  కోరికలు లేకుండుట, పొగరుబోతు తనము లేకుండుత,అహింస, దానములు పట్టకుండుట, ధంబ గుణము లేకుండుట, పిసిని గొట్టు తనము లేకుండుట,సోమరిపోతు తనము లేకుండుట, పరుష స్వభావము లేకుండుట, దైన్యం లేకుండుట మొదలైనవి.



ఈ విధమైన కాశీ మహత్యములు "శ్రీనాధ మహాకవి" ప్రణీతంబైన "శ్రీ  కాశీ ఖండము" లో సప్తమాశ్వాసమందు చెప్పబడెను. ఈ కార్తీక మాసము లో శివుని గూర్చి విన్నను తలచిననూ..సకల ఐశ్వర్యములు సిద్ధించును.  స్వస్తి.



సంస్కృతంలో పుష్పాల పేర్లు.


నిన్న మనం వృక్షాలపేర్లు చూసాము గదా. కొంత మంది బాగుందని అనడంతో అదే ఉత్సాహంతో కొన్ని పుష్పాల పేర్లు ఇస్తున్నాను.

1.సేవంతికా = చామంతి
2.సూర్యకాంతి: = పొద్దుతిరుగుడు
3.మాలతీ = మాలతీ
4.వకులం = పొగడ
5.కమలం = తామర
6.జపా = మందార
7.జాతీ = జాజి
8.నవమల్లికా = విరజాజి
9.పాటలం = గులాబీ
10.నక్షత్ర సేవంతికా = నక్షత్ర చేమంతి
11.కురవకం = గోరింట
12.ప్రతాపన: = తెల్లమందారం
13.శిరీషం = దిరిశెన పువ్వు.
14.ఉత్పలం = కలువపువ్వు
15.అంభోజం = తామర
16.సితాంభోజం = తెల్ల తామర
17.కుశేశయం = నూరు వరహాలు
18.కరవీరం = గన్నేరు
19.నలినం = లిల్లీ
20.శేఫాలికా = వావిలి
21.పున్నగం = పొన్న పువ్వు
22.అంబష్టం = అడివి మల్లె
23.జాతీ సుమం = సన్న జాజి
24.గుచ్చ పుష్పం = బంతి
25.కేతకీ = మొగలి
26.కర్ణికారం = కొండ గోగు
27.కోవిదారం = దేవకాంచనము
28.స్థలపద్మం = మెట్ట తామర
29.బంధూకం = మంకెన
30.కురంటకం = పచ్చ గోరింట
31.పీత కరవీరం = పచ్చ గన్నేరు
32.గుచ్చ మందారం = ముద్ద మందారం
33.చంపకం = సంపెంగ
34.కుందం = మల్లె
35.పుష్ప మంజరీ = పూలవెన్ను.

మరికొన్ని విషయాలు వచ్చే పోస్టింగులలో చూద్దాము.

19, నవంబర్ 2012, సోమవారం

కాశీ ఖండము - కాశీ తీర్ధ మహిమ - 3


కం. ఒక వర్ష శతంబున నొం
డొక తీర్ధము నందు గల ప్రయోజన లాభము
బొక దివసంబున నానం
ద కాననము నందు సర్వదా సిద్ధించున్! (121)

తా. కాశీ కంటే వెరొక తీర్ధమునందు ఒక నూరు సంవత్సరములకు లభించెడి ప్రయోజనము ఆనందదాయకమైన కాశీ యందు ఒక్క దినమునందే యెల్లప్పుడూ సిద్ధించును.



కం. నేమంబున నొక ప్రాణా
యామంబున నరుడు పడయునట్టి ఫలశ్రీ
సామాగ్రి యొండెడ ముని
గ్రామణి ! సాష్టాంగయోగ గతి గనరు నరుల్! (122)

నేమంబున = నియమముతో; ఒండెడన్ = వెరొక తీర్ధమునందు.

తా.కాశీ క్షేత్రములో ఒక్క ప్రాణా యామము వలన మనుష్యుడు పొందెడి సమగ్ర ఫలసమృద్ధిని అన్య క్షేత్రమునందు అష్టాంగసహిత యోగ మార్గమున కూడా పొందజాలరు.


సీ! చక్రవాళ పరీత సర్వం సహా
పరమ తీర్ధములలో బెరువ కాశి
కాశికా పట్టణ క్రోశ పంచక తీర్ధ
సమితి లో సారంబు జహ్ను కన్య
జహ్ను కన్యా తీర్ధ సముదాయమున యందు
గడు బెద్ద మణికర్ణికా హ్రదంబు
మణికర్ణికా తీర్ధ మజ్జన ఫలము కం
టెను విశ్వనాధు దర్శన మధికము.

తే!గీ! విశ్వపతి కంటె గైవల్య విభుని కంటె
గాలకంఠుని కంటె ముక్కంటి కంటె
దీర్ధములు దైవములు లేవు త్రిభువనముల
సత్యమింకను సత్యంబు సంయ మీంద్ర! (123)

తా. లోకాలోక సర్వ భూమండలము నందలి పరమ తీర్ధములలో..కాశీ పెరువ. కాశికా నగర పంచ క్రోశ మధ్యమునందుగల తీర్ధ సముదాయములలో జహ్నవి సారభూతమైనది. జహ్నవీ తీర్ధ కదంబములలో మణికర్ణిక మిక్కిలి గొప్పది. మణికర్ణికా తీర్ధ స్నాన ఫలము కంటే, శ్రీ విశ్వనాధుని దర్శన ఫలము గొప్పది.కైవల్య నాధుడైన విశ్వనాధుని కంటే, కాల కంఠుని కంటే, ముక్కంటి కంటే అధికమైన తీర్ధములు,దైవములు భూర్భువస్సువర్లోకములు మూడింటి యందును లేవు. ఇది సత్యము. మరియూ సత్యము.

సంస్కృతం లో వృక్షాల పేర్లు


మనం చాలా సందర్భాలలో..చెట్ల పేర్లను సంస్కృతం లో వింటూ ఉంటాము. ఆయుర్వేద మందుల విషయంలో.. వినాయక చవతి సందర్భంగా.. ఇలా ఎన్నొ సందర్భాలలో.. అన్నీ మనకు తెలిసినవే అయినా ఎవో కొత్త పేర్లు వింటున్న అనుభూతి కలగడం సహజం. సమయం ఉన్నప్పుడల్లా కొన్ని కొన్ని చూడండి.  మీ కోసం...

సంస్కృతం లో వృక్షాల పేర్లు కొన్ని చూద్దాము సరదాగా..

కదంబ: = కడిమి
ఆమలక: = ఉసిరి
విష్ణుక్రాంతా = విష్ణు క్రాంత
బృహజ్జం బీర: = దబ్బ
మధూక: = ఇప్ప
అరిష్ట: = కుంకుడు
ఆమ్ర = మామిడి
నింబ: = వేప
పలాశ: = మోదుగ
పర్కటీ = జువ్వి
చించా = చింత
అశ్వధ్ధ: = రావి
అర్జున: = మద్ది
అర్క: = జిల్లేడు
భృంగరాజ: = గుంట గలగర
శమీ = జువ్వి
జంబూ = నేరేడు
శల్మలీ = బూరుగ
లతా = తీగ
స్కంధ: బోదె
శాఖా = కొమ్మ
మాచీ = మాచికాయ
కపిత్త: = వెలగ
గుల్మ: = పొద
నికుంజ: = పొదరిల్లు
కాండ: = కాండము
శిఫా = ఊడ
కింజల్క: = పుప్పొడి
వట: = మర్రి
వరాటక: = విత్తనాల కోశము
దూర్వా = గరిక
కుస: = దర్భ
తృణం = గడ్డి
ఘాస: = పచ్చి గడ్డి
వేణు: = వెదురు
బదరీ = రేగు
అపామార్గ: = ఉత్తరేణి
వృంతం = తొడిమె
దళం = రేకు
అంకుర: = మొలక
బీజం = విత్తనం
తాల: = తాడి
బర్బర: = తుమ్మ.

ఇవి కూడా మీకు ఆసక్తి దాయకమని భావిస్తూ...శెలవ్.

18, నవంబర్ 2012, ఆదివారం

ప్రాసాక్షరపదాలు మరి కొన్ని....


మొదట.. "ఖ" తో వచ్చేవి ఏమిటంటే..

కంఖము = పాపభోగము, శంఖము=సంకు, పుంఖము=డేగ, వింఖము = డెక్క;  

కాగా.. "గ" తో వచ్చేవి చాలా ఉన్నాయి.

అంగ=అంఘ్రీ, గంగ=నీరు, జంగ=పిక్క, తంగ=చాదస్తము, నంగ=నేర్పుగత్తె, పంగ=కాళ్ళ నడిమి చోటు, భంగ=జనుప విత్తు, మంగ=పిండీతకము, రంగ=మందార,లంగ=దాటు, వంగ=వంగ చెట్టు, ఉంగ=బిడ్డల ఏడ్పు, తుంగ=ముస్తె, దుంగ=మాని మొద్దు, బుంగ=కుండ, ముంగ=మూగ, లుంగ=మూట, కొంగ=బకము, గొంగ=పగతుడు, చొంగ=చొల్లు, డొంగ=దొంగ, దొంగ=చోరుడు, అంగద=ఆకలి, రంగద=పటిక, అంగము=భాగము, జంగము=శివ భక్తుడు, పంగము=పన్ను, భంగము=అవమానము,రంగము=నేల, వంగము=తగరము, సంగము=సంబంధము. 
ఇంగము=కదిలేది, పింగము=గోరోచన వర్ణము, బింగము=అభ్రకము, లింగము=శివలింగము, సింగము=కేసరి, కంగరు=నిచ్చెన, బంగరు=బంగారం లేక స్వర్ణము, రంగరు=వెలుగొందు మరియూ లంగరు=జీను.

కాశీ ఖండము - కాశీ తీర్ధ మహిమ - 2


తే!గీ! ప్రాణ సందేహమైనట్టి పట్టు నందు
ననృతములు పల్కి యైనను నౌర్వ సేయ!
యన్యు రక్షింప దలచుటత్యంతమైన
పరమ ధర్మంబు కాశికా పట్టణమున! (117)

తా. ప్రాణ సంశయ పరిస్తితి యేర్పడిన సందర్భమందు, కాశీ పట్టణము లో అబద్ధము లాడి యైననూ అన్య ప్రాణిని రక్షింప దలచుట  అత్యంతమైన పరమ ధర్మము.


కం! కాలాంకు కంటకమున బి
పీలిక గాచుట మహర్షి బృందారక! యీ
త్రైలోక్యంబును గాచుట
పోలగ శివధర్మ సూక్ష్మములు దెలియు మదిన్. (118)

తా. మృత్యుంజయుని రాజధాని యందు ఒక చీమను గాపాడుట ముల్లోకములను గాపాడుట.
శివధర్మములలోని సూక్ష్మములను పోల్చి తెలుసుకొనుము.


తే!గీ! తీర్థ సన్న్యాస కారులై ధీరబుద్ధి
గాశి వసియించు పెద్దల గారవించు
టధిక ధర్మంబు దాన నాహ్లాదమొందు
వివిధ కైవల్య సంధాయి విశ్వభర్త! (119)

తా. కాశీ తీర్ధమున సన్యసించి, నిర్వికార చిత్తము తో కాశీ యందు నివసించెడి పెద్దలను గౌరవించుట యధికమైన ధర్మము. దానివలన వివిధ కైవల్య ప్రదాత యైన పరమేశ్వరుడు అహ్లాదమొందును.


సీ! కుదియించునది నెట్టుకొని యింద్రియ వ్యాప్తి
మనసు చాంచల్యంబు మానుచునది
మరులోన మోక్ష కామనము వీడ్కొనునది
పాయంగ నిడునది ప్రాణభయము
వ్రత దాన ధర్మ సం రక్షణార్ధంబుగా
గావించునది యాత్మ కాయ రక్ష
తత్కాల దేహ యాత్రా మాత్రమునకు గా
సమకూర్చునది ధాన్య సంగ్రహంబు

తే!గీ! నణచునది దంబ, ముజ్జగించునది యీర్ష్య
యుడుగునది రాగ లోభ గర్వోదయములు,
శాంతి దాంతి తితిక్షా నృశంస్య  సత్య
నిరతుడగునది కాశిలో నిలుచు నరుడు.(120)


తా. కాశీ లో నివసించే మనుష్యుడు ప్రయత్నపూర్వకముగా ఐహిక వ్యాపకములను తగ్గించుకొనవలెను.అనగా ఇంద్రియ వ్యాప్తిని పరిమితము జేయవలెను. మనస్సు యొక్క చాంచల్య లక్షణములను మానుకో వలెను. ప్రాణము పోవునేమొ యన్న భీతి ని పక్కకు నెట్టవలెను. వ్రతములు, దానములు, ధర్మములు,కొనసాగుచుండుటకై తన దేహమును కాపాడు కొనవలెను. ఆరోజు దేహ యాత్ర సాగుటకు మాత్రమే ధాన్య సంగ్రహణ చేయవలెను.తపో జపనిష్టాదులను ప్రదర్శింపవలెనను ఉబలాటమును తగ్గించు కొన వలెను. రాగము, లోభము, గర్వము అనునవి మొలకెత్తకుండా క్షణక్షణము జాగరూకుడై వుండవలెను. అంతరింద్రియ నిగ్రహము, శాంతి,శీతోష్ణములు, సుఖ దు:ఖములు మొదలైన ద్వంద్వములనోర్చి యుండుట,తితిక్ష సర్వ భూతములయందునూ..త్రికరణములలో..అకౄర స్వభావుడై ఉండుట మొదలైన లక్షణములను అలవరచుకొని యుండవలెను.

ఈ రోజుకు స్వస్తి. మళ్ళీ తర్వాతి పోస్టింగులో కలుసుకొందాము. మీ అభిప్రాయాలను సూచనలను తెలియజేయమని ప్రార్ధిస్తూ..శెలవు.




16, నవంబర్ 2012, శుక్రవారం

కైలాసాన.. కార్తీకాన..శివరూపం...


ఈ కార్తీక మాస సందర్భంగా శ్రీనాధమహాకవి రాసిన "శ్రీ కాశీ ఖండం" లోని 'కాశీ తీర్ధ మహిమ ' ను గురించి కొంత చెప్పుకోవడం శుభదాయకమూ.. పుణ్యదాయకం గా భావిస్తున్నాను. కాశీఖండం..అయ:పిండం అంటారు. అంత కష్టతరమైన నారికేళ పాకం లా భావిస్తారు.అయినా నాకు తోచిన రీతిలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. పెద్దలు తప్పులుంటే చెప్పి మార్గ దర్శనం చేయ ప్రార్ధన.


కాశీ తీర్ధ మహిమ - కాశీ ఖండము - సప్తమాశ్వ్వాసము

తే|గీ| కలుగనీ! కాశి శంభు లింగములు కోట్లు
విశ్వనాధుండు లింగంబు శాశ్వతుండు
కలుగనీ! తీర్ధములు కోట్లు కాశి యందు 
ననఘ! మణికర్ణికయ తీర్ధమని యెఱుంగు.(113)

తా. ఓ పాప రహితుడా! కాశీలో కోట్ల కొలది శివలింగములు ఉండవచ్చు గాక! విశ్వేశ్వరుడే లింగము.
కాశీలో కోట్ల కొలది తీర్ధములు ఉండవచ్చు గాక! మణికర్ణికయే తీర్ధమని తెలిసికొనవలెను.


కం. సేవ్యుడు  విశ్వేశుడు స్నా
తవ్యము మణికర్ణి కాహ్రద జలౌఘము శ్రో
తవ్యంబులు శంభు కధా
దివ్యపురాణములు కాశి తీర్ధమునందున్!(114)

స్నాతవ్యము = స్నానమాడదగినది; మణికర్ణికా హ్రదజలౌఘము = మణికర్ణికా హ్రదమునందలి నీటి యొక్క సమూహము ..ప్రవాహమూను.స్రోతవ్యంబులు = వినదగినవి; శంభుకధా దివ్య పురాణములు = శివుని యొక్క గొప్పవైన పురాణాదులు.

తా. కాశీ తీర్ధమందు సేవించదగిన దైవము ఈశ్వరుడొక్కడే! స్నానమాడదగినది మణికర్ణికా ఘట్టము మాత్రమే! వినదగినవి శివుని యొక్క పురాణ గాధలు మాత్రమే!

సీ! వసియింప వలయు యవజ్జీవ మనురక్తి
పరత వారాణశీ పట్టణమున
జక్ర పుష్కరిణి నిచ్చలు దీర్ధమాడంగ
వలయు సంకల్ప పూర్వకము గాగ
నర్చింపవలయు గంధాక్షతంబుల బుష్ప
ఫల పత్రముల విశ్వపతి  మహేశు
నిలుపంగ వలయును నెఱసు పాటిలకుండ
నాత్మ ధర్మ స్వవర్ణాశ్రమముల

తే!గీ! స్నాన మహీమంబు భక్తి తాత్పర్యగరిమ
వినగ వలయు బురాణార్ధ విదులవలన
దన యధాశక్తి వలయును దానమిడగ
గాశి గైవల్య మిన్నింట గాని లేదు.(115)

తా. శరీరములో జీవుడున్నన్ని నాళ్ళూ.. అనురాగ పరాయణత్వముతో వారణాసి యందు జీవింపవలెను.  ఎల్లప్పుడూ సంకల్ప పూర్వకముగా మణికర్ణికా ఘట్టమునందు స్నానము ఆచరించవలెను. కాశీ విశ్వేశ్వరుని గంధాక్షతలతోనూ..ఫల పత్ర పుష్పములతోనూ పూజించవలెను. ఆత్మ ధర్మములైన శమదమాదులయందును,తనకు విహితములైన వర్ణ ధర్మములందునూ, తనకు విహితములైన వర్ణ ధర్మములయందునూ,ఆశ్రమ ధర్మములయందు, దోషలేశము దొర్లకుండా నడుపుకొనవలను. బహుపురాణ వేత్తలైన పెద్దల ద్వారా భక్తి తాత్పర్యాదులతోగూడి స్నానమహిమ వినవలెను. తనశక్తి మేరకు దాన ధర్మములు చేయవలెను. ఇన్నిటి ద్వారా మాత్రమే కాశీ యందు కైవల్యము లభించును.

తే!గీ! యాత్ర విధ్యుక్త సరణి జేయంగవలయు
వలయు బరివార క్షేత్ర దేవతల గొలువ
వలదు బొంకంగ; వలదు జీవముల కలుగ
వలదు నగి యైన బర మర్మములు వచింప.(116)

యాత్రను = కాశీ యాత్రను; విధ్యుక్త సరణి -- విధి = శాస్త్రమునందు,
ఉక్త = చెప్పబడిన, సరణిన్ = మార్గముననుసరించి, నగియైన = హాస్యమునకైనా,
బరమర్మములు = ఇతరుల రహస్యములు, వచింప = బయట పెట్టరాదు - చెప్పరాదు.  

తా. శాస్త్రోక్త విధానము ననుసరించి కాశీ యాత్ర సాగించవలెను.పరివార దేవతలను, క్షేత్ర దేవతలను పూజింపవలెను.అసత్యములు పలుకరాదు. జీవహింస చేయరాదు. పరిహాసమునకైనను పర మర్మ, కర్మలను బయట పెట్ట రాదు.

మిగతా పద్యాలు వచ్చే పోస్టింగులలో చూద్దాము. స్వస్తి.

15, నవంబర్ 2012, గురువారం

త్వమేవాహం త్వమేవాహం న సంశయ:


ఈ మధ్య భవభూతి మహాకవి గురించి చదువుతూ ఉంటే.. మహాకవి కాళిదాసు ను గూర్చిన కొన్ని అద్భుతమైన శ్లోకాలు కనిపించాయి. అవి మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మీకూ అవి తెలిసే ఉంటాయి కానీ నా ఉత్సాహం కొద్దీ మళ్ళీ రాస్తున్నాను.అంతే!

శ్లో! కవిర్దండీ! కవిర్దండీ భవభూతి స్తు పణ్దిత:
కోహం రణ్డే త్వమేవాహం త్వమేవాహం న సంశయ:

తెలుగు లో శ్రీనాధ మహాకవి కి వలె సంస్కృతం లో మహాకవి కాళిదాసు గురించి అనేక చాటువులు జనం లో ఉన్నాయంటారు.ఇంతకీ ఈ శ్లోకం ఏమిటంటే..ఒక సారి సరస్వతీ దేవి "దండి మహాకవి దండి మహాకవి" "భవభూతి పండితుడు" అన్నదట. వెంటనే కాళిదాసు రండా మరి నేనెవరు అని అడగ్గా ఆ మహా తల్లి ఓరి పిచ్చి వాడా.. నువ్వే నేను.. నేనే నువ్వు అన్నదట.

మహా కవి పండితుడు, మహా మేధావి, మహా వ్యాఖ్యాత "మల్లినాధ సూరి" కాళి దాసును గూర్చి అన్న మాటలు ఎమిటో కూడా చెప్తాను ఈ సంధర్భం లో...

శ్లో! కాళిదాస గిరాం సారం కాళిదాస: సరస్వతీ 
చతుర్ముఖో దవా సాక్షాద్విదు ర్నాన్యేతు మాదృశా:

అంటే.. కాళిదాసు వాక్కుల సారాంశం తెలిసిన వారు కాళిదాసు, సరస్వతీ దేవి, నలువ మాత్రమే.. నావంటి వారికి అది ఎన్నటికీ తెలియదు. సాక్షాత్తూ..మల్లినాధ సూరి ఈ మాటలన్నడాంటే..కాళిదాసు కవితా వైభవం ఏమిటో మనం గ్రహించవచ్చు.

కవికులశేఖరుడైన కాళిదాసు కవితా వైభవం ఏమిటో ఒక్క సారి ఆయన శ్లోకంలోనే చూద్దాం.

రఘువంశం అనే కావ్యం లో చతుర్ధ సర్గ లో ఆయన మహారాజు గా పట్టాభిషిక్తుడైన సందర్భం లో  ఒక శ్లోకం చెప్పి ఈ పోస్టింగు ముగిస్తాను.


శ్లో! సరాజ్యం గురుణా దత్తం ప్రతి పద్యాధికం భబౌ!
దినాంతే నిహితం తేజ: సవిత్రేవ హుతాశన:

ఈ శ్లోకాన్ని చదువుతుంటే.. ఇక్కడ కొన్ని శ్రుతి వాక్యాలను ఙప్తి కి వస్తున్నాయి. అవి ఏమిటంటారా...

సౌర్యం తేజ: సయమగ్నిం సంక్రమతే! ఆదిత్యోవా అస్తం యన్నగ్ని మనుప్రవిశతి. అగ్నివా ఆదిత్య:  సాయం ప్రవిశతి. అంటే సూర్య సంభంధమైన తేజస్సు సాయం సమయం లో అగ్ని లో ప్రవేసిస్తుందని సారాంశం.

ఆ రఘు మహా రాజు తండ్రి దిలీపుడు ఇచ్చిన రాజ్యాన్ని స్వీకరించి ఎలా ఉన్నాడయ్యా అంటే..అస్తమాన సమయం లో సూర్యుడు నిక్షేపించే అగ్ని ని స్వీకరించిన వాని వలె ప్రకాశిస్తున్నాడు.

ఇందులో మంచి ఉపమానాలంకారం ఉంది. దిలీపుడు-సూర్యుడు, రఘువు-అగ్ని  రాజ్యానికి-తేజస్సు వీటి మధ్యన పోలిక ఎంత అందం గా ఉందో చూడండి.

ఇందులో రఘు వంశ రాజుల ఉదాత్తత, వంశ ప్రతిష్ట, పితృ భక్తి, ధర్మం, శ్రద్ధ మొదలైనవన్నీ ఉన్నాయి.

ఇటువంటి ఎన్నో ఉపమలను కావ్యాలలో నిక్షేపించడం వలననే కాళిదాసును "ఉపమా కాళిదాసస్య" అన్నారు.



యతి బేధాలు


11.సౌభాగ్య యతి: ఉభయ యతి చెల్లునట్టి శబ్దములు రెండు ఒకే పాదమున నుండి, వాని సంధిని వేరు చేసినప్పుడు కనపడె అచ్చులకు యతి మైత్రి చెల్లించడాన్ని సౌభాగ్యయతి అంటారు.

ఉదా: ప్రాంచి తామర వినుత వేదండ వరద

ప్ర+అంచిత= ప్రాంచిత, పకార రేఫములగు వానిపై ఉన్న అ కారమునకు యతి చెల్లించ వచ్చును.ఇది ఉభయ యతి చెల్లే శబ్దం. ఇట్లే వేదండ అనే శబ్దం లో (వేద+అండ = వేదండ) దవర్ణానికి దాని పై ఉన్న అకారమునకు కబట్టి ఇదీ ఉభయ యతి అవుతుంది.ఇట్టి శబ్దాలు రెండూ ఒకేపాదం లో ఉండి యతి చెల్లిస్తే అది సౌభాగ్య యతి అవుతుందని అర్యోక్తి.

12.ప్రాది యతి:  ప్ర, పరా, ప్రతి, పరి, అతి, అధి, అభి, అవ, అన, ఉప, సం,ను, అప,ని,వి, నిర్, దుర్, ఉత్, అపి, అఙ్  -  వీటిని ప్ర్రదులు అంటారు.వీటినే ఉపసర్గలు అనికూడా అంటారు. ఈ ప్రాదులకు అచ్చు పరమై సంధి జరిగేటప్పుడు అచ్చుకు, హల్లుకూ ఉభయములకూ యతి మైత్రి చెల్లును.

ఉదా: ప్రాణ సంకటమైన పుణ్యాంగనలకు. ఇందులో ప్రాణ లొని "అ" కు పుణ్య అంగన లోని "అ" కు యతి మైత్రి చెల్లింది.


13. అబేధ యతి: "పరయో రభేద:" అన్న అర్యోక్తి ని అనుసరించి వకార పకారములకు బేధము లేదు.కనుక వకారమునకు ప,ఫ,బ, భ లతో యతి చెల్లును. అలాగే "లడయో రబేధ:" అన్న అర్యోక్తి కూడా ఉంది. కాబట్టి ల-డ లకు ర-ల లకు కూడా అభేద యతి చెల్లును.

తే!గీ! ల లిత వీణా రవంబు తో ఢక్క సరియె  - ఇక్కడ ల కు ఢ కు యతి చెల్లినది.

మరికొన్ని తర్వాతి పోస్టింగుల లో  చూద్దాము. శెలవు.

ప్రాసాక్షర పదాలు


అంకణము (చదరపు చోటు), కంకణము (కడియము), లంకణము (పస్తు), తంకనము (శ్రమ జీవనము), అంకిలము (మొలక), పంకిలము (బురద కలది), మంకిలము (కార్చిచ్చు), వంకిలము (ముల్లు), సంకిలము (దివిటీ), అంకురము (బీజము), చంకురం (వాహనము), మంకురము (అద్దము), ఓంకారము (ప్రణవము), కోంకారము (కోడి కూత), టంకారము (టంకృతి), సంకారము (సంకృతి), టెంకణము (నమస్కారము), పొంకణము (సంచీ), బొంకణము (బుట్ట), ఆంక్ష , కాంక్ష, ధ్వాంక్ష (కాకి), ఆంక్షి (చర్మ వాయిద్యము), ధ్వాంక్షి (ఆడు కాకి)

వీటితో దాదాపు "క" కు సంభందిచినవి అయిపొయినట్టే! వచ్చే సారి "గ" తో వచ్చే పదాలను చూద్దాము. ప్రస్తుతానికి శెలవు.

14, నవంబర్ 2012, బుధవారం

ఒక సుభాషితము


శ్లో! ఉత్తమం స్వార్జితం విత్తం మధ్యమం పితురార్జితం
అధమం భ్రాతృవిత్తం చ స్త్రీవిత్తమధమాధమం!

తా. తాను గడించుకున్న సొమ్ము ఉత్తమం, తండ్రి గడించిన సొమ్ము మధ్యమం
తోబుట్టువులు గడించిన సొమ్ము అధమం. స్త్రీల సొమ్ము అధమాధమం.

13, నవంబర్ 2012, మంగళవారం

భవభూతి మన ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వ్యక్తా?


"ఉత్తరే  రామ చరితే భవభూతిర్విష్యతే" అని ప్రసిద్ధి గాంచిన భవభూతి మహాకవి మన ఆంధ్ర ప్రదేశ్ వాడేనని డా.సంగంభట్ల నరసయ్య గారు అంటున్నారు. కొన్ని సాక్షీభూతమైన విశేషాలూ ఆ వాదాన్ని బలపరుస్తున్నాయి.

అవేమిటో... వాటి కధా కమామిషూ చూద్దాము మనం కూడా..

భవభూతి మహావీర చరిత్ర, మాలతీ మాధవం, ఉత్తర రామ చరిత్ర అనే మూడు నాతకాలు రాసాడు. ఈయన పరమ నిష్తా గరిష్టుడు. ఈనకే శ్రీకంఠుడని ఇంకో పేరు కూడా ఉంది.  కన్యా కుబ్జాన్ని పాలించిన యశొవర్మ ఆస్తానం లో ఉండడం వలన మనవారు ఆయన కాలం క్రీ!శ! 680-750 ప్రాంతం వాడని భావిస్తున్నారు.

ఆయన విదర్భ దేశం లో  పదంపురం లో నివసిస్తూ రాజాశ్రయం కోరి వలస వెళ్ళిన బ్రాహ్మణ పండితుడు.నాగపూర్ నుండి ఉత్తర తెలంగాణా గోదావరి హద్దు వరకూ ఉండే ప్రాంతం అన్న మాట. ఈయనకు 150 సం.వ. తర్వాత వాడైన పంప మహా కవి తనూ పద్మపుర నివాసినని చెప్పుకున్నాడు. పంప కవి " ఇన్నపు పోళల్గా లిళ్ళా, పోళల్గే నాళ్కు యుగ డోలం, వసుమతి పద్మపురం ఏక చక్ర బహు ధాన్య ఎంబనాళ్కు  పెసరాదుడు" అన్నాడు. అంటే.. వసుమతి, పద్మపుర, ఏకచక్రపుర,బహుధాన్యపుర అని ఈ భోధన్ కు పేర్లు ఉన్నాయి అన్నాడు.

భవభూతి తరచూ గోదావరి నదీ ప్రస్తావన చేస్తాడు. గోదావరి అంటే ఆయనకు ఎనలేని ప్రీతి. తన రొండు నాటకాలలో  (మహా వీర చరిత్ర, ఉత్తర రామ చరిత్ర) గోదావరి ని వర్ణించడం కమనీయం గా ఉంది. "తదీయ గోదావరీ హ్రదాన్నిష్క్రమ్య" అంటాడు. ఆ నీటిని ప్రేమ గా "సరస నీరు" అని వర్ణిస్తాడు. ఇది ఒక కారణం.

రొండోది ఏమిటంటే...తెలుగు ప్రాంతం లో ఉన్న సంభాషణలను సంస్కృతీకరించడం ఒకటి. ఆ విశేషం ఏమిటంటే... మనం తరచూ "హమ్మయ్య బ్రతికి పోయాం" అనడం అంటూ ఉంటాము. సంస్కృత  లో  అలా అనడం ఉండదు. ఆయన మన తెలుగు మాటను "హంత! మాతర్జీవామి" అంటాడు. అలాగే ఇంకో ఉదాహరణ తీసుకుంటే..మనం "పిల్లల తండ్రి" అనే మాట వాడుతూ ఉంటాము.  ఆయన దానిని "వత్సయో: పితు:" సంస్కృతంలో అనే మాట.

మూడో కారణం ఆయన ఇంటిపేరు: "ఉదుంబర నామనో బ్రహ్మ వాదిన:" ఉదుంబరం అంటే మేడి చెట్టు. తెలుగు వారికి తప్ప ఇతరులకు ఇంటి పేర్లు ఉండవు కదా.. ఈ ఇంటి పేరు అందరూ అంగీకరించారు.


కనుక భవభూతి తెలుగు వాడనీ, కరీం నగర్ 
, నిజామాబాద్ ప్రాంత వాసి అనీ భావించదగును.  ఈయన వర్ణించిన ధర్మ పురి కరీం నగర్ జిల్లా లో ఉంది. ఆ ధర్మ స్తలి లో ఎందరో మహాకవులు జన్మించారు.


ఇలాంటి పరిశోధనలు తెలుగులో దాదాపు ఆగి పోయాయి. ఎంతసేపూ ఆ పుస్తకం ఈ పుస్తకం చూసి రాసే పీ.హెచ్.డీ లే ఎక్కువ. 

ఏది ఎమైనా అంత పెద్ద మహాకవి, అందునా సంస్కృత నాటక సాహిత్య వినీలాకాశం లో కనిష్టికాధిష్టితుడైన  కాళిదాసు ప్రక్కన, భవభూతి మహా కవి అనామికాధిష్టితుడు కావడం తెలుగు వారికి గర్వకారణం అని నా ఉద్దేశ్యం.

12, నవంబర్ 2012, సోమవారం

ప్రాసాక్షర పదాలు


మనం సాధారణం గా యతి కుదరనప్పుడు కొన్ని పద్యాలలో (అనుమతించిన పద్యాల మేరకు) ప్రాస యతిని వాడుతూ ఉంటాము. అలాగే ప్రాస కుదరనప్పుడు కూడా ప్రాస కుదిరే పదాలకోసం వెదుకుతూ ఉంటాము. ఇందులో తప్పు లేదు. నన్నయ్య, తిక్కన, శ్రీనాధుని లా పద్యాలు రాయగలిగితే ఈ తిప్పలన్నీ దేనికి చెప్పండి.

అందుచేత అప్పుడప్పుడూ.. కొన్ని కొన్ని ప్రాసాక్షర పదాలనూ వాటి అర్ధాలనూ తెలిసికోవడం అవసరం కూడా.

ఈ రోజు "క" గుణింతానికి సంభందించి కొన్ని ప్రాస పదాలు చూద్దాము.

అంక = పక్క, టంక = వెలిగారము, కంక = తొళ్ళిక, బంక = జిగురు, లంక = దీవి, వంక = సాకు, శంక = జంకు.
అలాగే..అంకి = మద్దెల, కంకి = వరివెన్ను, పంకి = బురద, వంకి = బాకు, అలాగే..కంకు = గద్దించు, జంకు = బెదరు, టంకు = దండోరా, నంకు = యెగతాళి, బంకు = సందు, శంకు = మేకు, సంకు = శంఖము, అలాగే...  అంకె = చిహ్నము, పంకె = దుష్టుడు,లంకె = లంకియ, ఉంకు = యెగరు, డుంకు = తగ్గు, నుంకు = పస్తు అలాగే.. కొంకి = వంపు చీల, బొంకి = పుర్రె, కొంకు = జంకు, డొంకు = ఇంకు, బొంకు = కల్లలాడడం, కింక = అలుక, చింక = కోతి, జింక = లేడి, డింక = చావు, దింక = మల్లబంధము, చెంక = చెంప,  తెంక = భయము, మెంక = చింబోతు, లెంక = సేవకుడు, పెంకి = మొండి వాడు, డొంక = పొద, తొంక = తోక, దొంక = చువ్వలు లేని కిటికీ, లొంక = అడవి, అంకము = బడి, కంకము = గద్ద, టంకము = నాణెము, తంకము = యెడబాటు, పంకము = బురద, అంకిణి = మల్ల బంధము, పంకిణి = సుగంధ పాత్ర, లంకిణి = ఒక రాక్షసి, వంకిణి = ఒక బాకు, మంకెన = బంధు జీవనము, కంకర = మొరప రాయి, తంకర = పొల్లు, వంకర = వక్రము..

వీటిలో చాలా మటుకు మనం విన్నవే ఉంటాయి.. కానీ అవసరమైనప్పుడే గుర్తుకు రావు, ఘటోత్కచుని చంపేటంత వరకూ కర్ణునికి "శక్తి" ఆయుధము గుర్తుకు రానట్టుగా.. ఆవిషయం గుర్తుకు తెచ్చుకుని యుద్ధరంగం లో మాత్రం ఆవిషయం మర్చిపోయేవాడట. అదే మరి విధి వక్రించడం అంటే...ఈ విషయం ప్రస్తుతం.. అప్రస్తుతం అయినా అవసరానికి గుర్తు రాక పోతే ఏ విద్య కైనా పరమార్ధం ఏమిటి  చెప్పండి?

స్వస్తి..మళ్ళీ మరుసటి పోస్టింగు వరకూ.....





10, నవంబర్ 2012, శనివారం

యతి భేదాలు


ఈ పోస్టింగు లో మరి కొన్ని యతుల గురించి చూద్దాము.

6.పోలికవడి (ము విభక్త యతి లేదా ముకార యతి): పు,ఫు, బు,భు లకు ము వర్ణం తో మైత్రి చెల్లడాన్ని పోలికవడి అని ఆర్యులు అంటారు.ఇంకా ప, ఫ, బ, భ లకు మ వర్ణం తో మైత్రి చెందక పొయినా ఉత్వ విశిశ్టమైనచో  పరస్పరం యతి మైత్రి చెందడం ఉంటుంది. అదేమిటో చూద్దాము.

క. చను నీవు హస్తినాపుర
మును కేనును బాండు భూప పుత్రులబ్రీతిన్
గని ఇటు వత్తు నవశ్యం
బును వారల జూడవలయు బోయెదననియెన్. (ఉద్యోగపర్వం)

ఈ పద్యం లో రొండవ పాదంలో ము - పు లకు యతి మైత్రి చెల్లినది.

7.అనుస్వార యతి: దీనినే బిందు యతి అనికూడా అంటారు. ప్రతి వర్గము లో మొదటి నాలుగు అక్షరములకు ముందు పూర్ణ బిందువు ఉన్నచో వానికి తత్త్వ ద్వర్గ పంచమాక్షరములతో (అనునాసికతో) యతి మైత్రి చెల్లడం.

భీమన ఛందము లో ఇలా చెప్పారు.

ఙా కు వడిసెల్లు రత్న కంకణమనంగ 
ఞా కు వడిసెల్లు బర్హిపింమనంగ
ణా కు వడిసెల్లు గనక మంపమున
నా కు వడిసెల్లు దివ్య గంధంబనగ 
మా కు వడిసెల్లు విజిత శంరుడనంగ 
ఇలా చెప్పారు.



8. స్వర యతి: అచ్చులలో సాధారణంగా మనం చూచే యతి

అ,ఆ,ఐ, ఔ - పరస్పర యతి మైత్రి ఉంది.

ఇ,ఈ,ఋ,ౠ,ఎ, ఏ - పరస్పర యతి మైత్రి ఉంది.

ఉ, ఊ, ఒ, ఓ - పరస్పర యతి మైత్రి ఉంది.

9.ఋ వడి:  ఋ కారమునకు వట్రసుడి తో గూడిన హల్లులంటితోనూ యతి చెల్లును.

ఉదా: త్విజుండని విచారించి.
వృష్టికులజుండు కరుణాసమృదృండనగ

10. విబాగ యతి: రొండు, మూడు మొదలైన సంఖ్యా వాచకాలకు, గంపెడు మున్నగు పరిణామ వాచక శబ్దాలకు "ఏసి" అనే శబ్దం చేరును.ఏసి పరమైతే నిత్య సంధి. గంపెడు+ఏసి = గంపెడేసి అనే సంధి జరిగినప్పుడు హల్లునకు (డె) సంధి విడదీసినప్పుడు ఉత్తర పదాద్యచ్చునకు  (ఏ) ఇట్లు ఉభయమునకు యతి మైత్రి చెల్లించ వచ్చును.

అంతా గందరగోళం గా ఉందా! ఒక వుదాహరణ చూస్తే చాలు.

ఉదా: ఉపేంద్రుడిచ్చు ధనము మోపెడేసి యనగ

ఇక్కడ చూడండి జాగ్రత్తగా... ఉప + ఇంద్రుడు = ఉపేంద్రుడు  ఉత్తర పదం లో "ఉ" అనే అచ్చు ఉంది కదా.. మోపెడు + ఏసి = మోపెడేసి  అనే పదంలో "ఏ" అనే అచ్చుకు యతి మైత్రి చెల్లించడం.

స్వస్తి.. మళ్ళీ ఇంకా కొన్ని ముఖ్యమైన యతుల తో త్వరలో కలుసుకుందాము.




9, నవంబర్ 2012, శుక్రవారం

ఒక సుభాషితము


శ్లో! దాతృత్వం ప్రియవక్తృత్వం ధీరత్వ ముచితజఞతా
అభ్యాసేన న లభ్యంతే చత్వార: సహజా గుణా:

తా. దానమిచ్చుట, మంచి మాటలు పల్కుట, ధైర్యము, సమయపాలన
అనే ఈ నాల్గు గుణాలు జన్మత: సిద్ధించవలసిందే తప్ప చూచి నేర్చు కుంటే వచ్చేవి కావు.

8, నవంబర్ 2012, గురువారం

ఒక సుభాషితము



సభకు నమస్కారం అనే మాట మనం తరచూ వింటూ వుంటాము. దాని అసలు మూల శ్లోకం అర్ధ వివరణ ఇవ్వాలనిపించి ఇక్కడ ఇస్తున్నాను.



శ్లో! సభాకల్పతరుం వందే వేదశాఖోపజీవితం
శాస్త్రపుష్ప సమాయుక్తం విద్వద్భ్రమర శోభితం.

తా: వేదములను కొమ్మలచే వృద్ధి పొందింపబడినదియును, శాస్త్రములనెడి పువ్వులతో గూడినదియునూ, పండితులనెడి తుమ్మెదలచే బ్రకాశింప జేయబడినదియునూ అగు సభ అనెడి కల్పవృక్షమునకు నమస్కరించుచున్నాను.

ఒక సుభాషితము


శ్లో!! ఏకో దేవ: కేశవోవా శివోవా ఏకో వాస పట్టణవా వనంవా,
      ఏకం మిత్త్రం భూపతిర్వాయతిర్వా ఏకా నారీ సుందరీవానాదరీవా!


విష్ణువైనా..శివుడైనా సరే..ఒక్కడే దైవమని నమ్మాలి. ఫట్టణంలో ఐనా వనంలో ఐనా నివాసముండాలి. రాజు తో గానీ సన్యాసి తో గానీ మైత్రి చెయ్యాలి. సుందరియగు భార్యతో గూడి వుండాలి లేదంటే కొండ గుహల్లో తపస్సు చేసుకోవాలి.


యతి భేదములు


ప్రాస లేకుండా రాసే పద్యాలు ఉంటాయి గానీ, యతి లేకుండా పద్యం రాయడం అసంభవం.అందుచేత, యతికి చాలా ప్రాముఖ్యం ఉంది. పద్య రచనకు ప్రాణం యతి. యతుల గురించి తెలుసుకోవడమే ఈ పోస్టింగు ఉద్దేశ్యం.

"యతుల కొరకు ప్రాస యతుల కొరకు పాటు బడగబోను పద్మనాభ" అని తంగిరాల తిరుపతి శర్మ గారు సరదాగా తన శతకం లో చెప్పినట్టు గుర్తు. అంటే యతులకొరకు చాలా పాట్లు, పట్లు, సిగ పట్లు ఉంటాయనే కదా అర్ధం. నేను గత పోస్టింగులలో చెప్పినట్టు తిక్కన సోమయాజి యతుల కోసం, ప్రాస కోసం అక్షరాలను వెదికి "పులమ" వద్దు అన్నాడు. కనుక భాష మీద పట్టు అవసరం. వీలైనన్ని పద్యాలు చదవండి. వాటిల్లో యతి ప్రాసలు ఎలా ప్రయోగించారో చూడండి.


ప్రభంధాలు, మహాభారత రామాయణాదులు.. మనసు పెట్టి చదవండి. హ్రుదయోల్లాసంగా మాధుర్యాన్ని అనుభవిస్తూ..అందులోని ఛందో విశేషాలను గమనించండి. కొద్ది కాలం గడిచాక మీకు తెలీకుండానే యతి ప్రాసలు అలవోకగా పడడం గమనిస్తారు.


అన్నీ గాక పొయినా కొన్ని ముఖ్యమైన యతుల గురించి తెలుసుకుందాము. వాటిని ప్రయోగించి చూసినప్పుడే గుర్తుంటాయని గమనించండి.

1.సరస యతి: ణ - న లకు; అ, య, హ లకూ; శ, ష, స, చ, ఛ, జ, ఝ లకూ యతి చెల్లడం సరస యతి అంటారు. ఇవి పరస్పరం మిత్రాలు అని అర్ధం.


2 .సంయుక్త యతి: యతి స్తానం లో గానీ.. యతి మైత్రి స్తానం లో గానీ..సం యుక్తాస్ఖరం ఉంటే, అందేదో ఒక అక్షరమునకు యతి మైత్రి చెల్లిన చాలును. (భీమన ఛందము)

ఉదా: "క్ష్మా" నాయక నీవు నన్ను "గై"  కొని.

పైన చెప్పిన పద్యం లో యతి స్తానమున కకార, షకార మకారముల సం యుక్తము గలదు. వీనిలో కకారమునకు మాత్రమే "గై" అని యతి మైత్రి పాటించబడినది. ఇట్లే షకార, మకారములలో దేనికైనను యతి మైత్రి పాటింపదగును. స్రగ్దర, మహా స్రగ్దర, మానిని, కవిరాజ విరాజితము, క్రౌంచ పదము, మంగళ మహశ్రీ మొదలైన పద్యాలు బహు యతులు ఉన్నవి. వాటిలో సంయుక్త యతి సాధారణం గా ఉంటూ ఉంటుంది.



3.వర్గ యతి:  క, చ, ట, త, ప వర్గాలలో.. (క, ఖ, గ, ఘ) (చ, ఛ,జ,ఝ) (ట,ఠ,డ,ఢ)(త, థ,ద,ధ,) (ప, ఫ, బ, భ) ప్రతి వర్గంలో నాలుగు అక్షరాలకూ యతి చెల్లును. ఙ, ఞ,ణ,న, మ లను ఈ వర్గాలలో చేర్చకండి.

ఉదా: దిక్కరి సన్నిభుడ రేచ ధీ జన వినుతా - ఇక్కడ ది - ధీ వర్గ యతి.


4. దేశీయ యతి:  క్రిక్కిఱియు, క్రచ్చఱ మొదలైన దేశ్య శబ్దాలలో సర్వ సంధి ఉన్న విషయం మనకు తెలుసు. ఇవి రొండు పదాలైనా యేక పదము వలె ఉంటుంది. ఇలాంటి పదాలలో సంధిని విడదీసినప్పుడు పరపదాద్యచ్చునకు  సంధి కలిసి యున్నప్పుడు విశిస్త వర్ణమునకు యతి మైత్రి పాటించవచ్చని ఆర్యులు చెప్తార్,  (చిత్రకవి పెద్దన లక్షణ సార సంగ్రహము).రొండు విధాలా యతి మైత్రి పాటించే వీలు ఉండడం వల్ల ఉభయ యతి అని కూడా అంటారు. దేశ్య నిత్య సమాన యతి అని అప్పకవి కూడా చెప్పాడు.

ఉదా: సరస లక్షణ కవులు గ్రచ్చర నొనర్ప

ఇక్కడ 'స' కు 'చ్చ' అని హల్లునకు యతి మైత్రి పాటించడం జరిగింది.


5. ఎక్కటి యతి: ల, ర, మ, ఱ, వ అనే అక్షరాలు దేనికవే యతి మైత్రి పొందితే ఎక్కటి యతి అంటారు.

ఉదా:రుని తండ్రి లోక హితుండు యాదవ
రాజ సిం హమూర్తి క్షకుండు
ఱాగ వేలుపనగ ఱంపిల్లు నెక్కటి
ళ్ళునా గనిట్లు నజనాభ. (అనంతుని ఛందము).

మిగతా యతుల గురించి తర్వాత పోస్టింగులలో చూద్దాము. శెలవు.








6, నవంబర్ 2012, మంగళవారం

గణోత్పత్తి క్రమము - గణ ప్రయోగ విచారము.

పరమేశ్వరునకు చంద్రుడు,  సూర్యుడు, అగ్ని అనే మూడు నేత్రాలు ఉన్నాయి. ఆ మూడు కన్నుల నుండి మూడు గురువులు పుట్టాయట. దానికి "మ" గణమని పేరు. ఆ మగణము నుండి యేడు గణములు పుట్టాయట. (భీమన ఛందము).

పరమేశ్వరుడు పింగళకునకు "మ, య, ర, స, త, జ, భ, న" లను ఉపదేశించాడట.మూడు గురువులచే "మ" గణము వలన "య" గణము, యగణము వలన "ర" గణము ఇలా జననం చెందాయని అంటారు. ఏ గణము నుండి ఇంకొక గణము పుట్టెనో ఈ రొండిటికీ జన్య జనక భావము చే పరస్పర మైత్రి గలదనియూ..రగణ సగణములకు మాత్రమూ విరోధము గలదని చెప్తారు. (కావ్య చింతామణి, కవిగజాంకుశము).


ఇక ష్ట గణ లక్షణాలను చూద్దాము.

1. "మ" గణము:  మగణానికి భూమి దైవము, బుధుడు గ్రహము, కాంతి పచ్చన, రాక్షస గణము, సూద్ర జాతి, యోని హరిణము, జ్యేష్టా నక్షత్రము, రౌద్ర రసము, వృశ్చిక రాశి, శుభ ఫలము (కవి సర్పగారుడము).

2. "య" గణము:  యగణానికి జలము దైవము, శుక్ర గ్రహము, కాంతి తెలుపు, మనుష్య గణము, బ్రాహ్మణా జాతి, వానర యోని, పూర్వాషాధ నక్షత్రము, కరుణ రసము, ధనూ రాశి, ధన ఫలము (కవి సర్పగారుడము).

3. "ర" గణము:  రగణానికి అగ్ని దైవము, అంగారక గ్రహము, కాంతి యెర్రకలువ, క్షత్రియ గణము, క్షత్రియ జాతి, మేక యోని, కృత్తిక నక్షత్రము, భయనక రసము, మేష రాశి, భయ ఫలము, శృంగార రసము (కవి సర్పగారుడము).


4. "స" గణము:  వాయువు అధిపతి, నల్ల కలువ కాంతి, చండాల జాతి, శని గ్రహము, తులా రాశి, స్వాతి నక్షత్రము, నాశన ఫలము, రాక్షస గణము, మహిష యోని. (వాదాంగ చూడామణి)

5. "త" గణము: ఆకాశం అధి దైవము, బ్రాహ్మణ కులము, దేవ గణము, బృహస్పతి, నల్లని కాంతి, ఐశ్వర్య ఫలము, మేష యోని, శాంత రసము, పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశి (కవి సర్పగారుడము).


6. "జ" గణము: సూర్యుడు అధిపతి, యెర్రని కాంతి, వీర రసము, క్షత్రియ కులము, సిమ్హ రాశి, సూర్య గ్రహము, ఉత్తరా నక్షత్రము, ఫలము రోగము, గోవు యోని, మనుష్య గణము.(కవి సర్ప గారుడము)

7. "భ" గణము: అధిపతి చంద్రుడు, తెల్లని కాంతి, వైశ్య కులము, గ్రహము చంద్రుడు, వృషభ రాశి, సర్ప యోని, దేవ గణము, ఫలము సౌఖ్యము, మృగశిరా నక్షత్రము.(వాదాంగ చూడామణి)

8. "న" గణము: మహా విష్ణువు అధి దైవము, జయము, సౌభాగ్యము, సామ్రాజ్యము, సంపద, దీని సమీపము లో దుష్ట గణము ఉన్నా..కీడు జరుగదు. కనుక దీనికి ఎమీ చెప్పనక్కరలేదని చందో గ్రంధ కర్తలు చెప్తారు. (కవి సర్ప గారుడము)

గణ ఫలాలు ఏమిటో కూడ చూద్దాము:

గ్రంధాది యందు శుభ గణ ప్రయోగము వలన, కృతి కర్తకు, కృతి భర్త కు కూడాశుభము కలుగుతుంది.

భగణము సుఖమును, జగణము రోగమును, నగణము ధనమును, సగణము నాశనమును, మగణము శుభమును, యగణము స్వర్ణ సంపదను, రగణము దు:ఖమును,తగణము ఐశ్వర్యమును ఇస్తాయని ఆర్యులు చెప్పారు.

భీమన చందము  లో ఒక పద్యం ఏమని చెప్తోందంటే..

క. సరసాన్న రుచిరభూషణ
పరితాపా స్థాన చలన బహు దు:ఖ రుజా
పరిమాయు రచల లక్ష్మీ..
కరములు మయరసతజభనలు గణములు వరుసన్.

అంటే.. మగణము  షడ్రసోపేత లాభాన్నీ..యగణము సొమ్ములనూ, రగణము దు:ఖమునూ, సగణము స్తాన చలనాన్నీ, తగణము బహు దు:ఖమున్, జగణము రోగమునూ, భగణము పూర్ణాయువునూ..నగణము తరగని సంపదనూ ఇస్తాయట.

ఈ గణాల విశేషాలు ఇంకా చాలా వున్నాయి. వీలు  వెంబడి చూద్దాము ప్రస్తుతానికి శెలవు.