ఈ పోస్టింగు లో మరి కొన్ని యతుల గురించి చూద్దాము.
6.పోలికవడి (ము విభక్త యతి లేదా ముకార యతి): పు,ఫు, బు,భు లకు ము వర్ణం తో మైత్రి చెల్లడాన్ని పోలికవడి అని ఆర్యులు అంటారు.ఇంకా ప, ఫ, బ, భ లకు మ వర్ణం తో మైత్రి చెందక పొయినా ఉత్వ విశిశ్టమైనచో పరస్పరం యతి మైత్రి చెందడం ఉంటుంది. అదేమిటో చూద్దాము.
క. చను నీవు హస్తినాపుర
మును కేనును బాండు భూప పుత్రులబ్రీతిన్
గని ఇటు వత్తు నవశ్యం
బును వారల జూడవలయు బోయెదననియెన్. (ఉద్యోగపర్వం)
ఈ పద్యం లో రొండవ పాదంలో ము - పు లకు యతి మైత్రి చెల్లినది.
7.అనుస్వార యతి: దీనినే బిందు యతి అనికూడా అంటారు. ప్రతి వర్గము లో మొదటి నాలుగు అక్షరములకు ముందు పూర్ణ బిందువు ఉన్నచో వానికి తత్త్వ ద్వర్గ పంచమాక్షరములతో (అనునాసికతో) యతి మైత్రి చెల్లడం.
భీమన ఛందము లో ఇలా చెప్పారు.
ఙా కు వడిసెల్లు రత్న కంకణమనంగ
ఞా కు వడిసెల్లు బర్హిపింఛమనంగ
ణా కు వడిసెల్లు గనక మండపమున
నా కు వడిసెల్లు దివ్య గంధంబనగ
మా కు వడిసెల్లు విజిత శంబరుడనంగ
ఇలా చెప్పారు.
8. స్వర యతి: అచ్చులలో సాధారణంగా మనం చూచే యతి
అ,ఆ,ఐ, ఔ - పరస్పర యతి మైత్రి ఉంది.
ఇ,ఈ,ఋ,ౠ,ఎ, ఏ - పరస్పర యతి మైత్రి ఉంది.
ఉ, ఊ, ఒ, ఓ - పరస్పర యతి మైత్రి ఉంది.
9.ఋ వడి: ఋ కారమునకు వట్రసుడి తో గూడిన హల్లులంటితోనూ యతి చెల్లును.
ఉదా: ఋత్విజుండని విచారించి.
వృష్టికులజుండు కరుణాసమృదృండనగ
10. విబాగ యతి: రొండు, మూడు మొదలైన సంఖ్యా వాచకాలకు, గంపెడు మున్నగు పరిణామ వాచక శబ్దాలకు "ఏసి" అనే శబ్దం చేరును.ఏసి పరమైతే నిత్య సంధి. గంపెడు+ఏసి = గంపెడేసి అనే సంధి జరిగినప్పుడు హల్లునకు (డె) సంధి విడదీసినప్పుడు ఉత్తర పదాద్యచ్చునకు (ఏ) ఇట్లు ఉభయమునకు యతి మైత్రి చెల్లించ వచ్చును.
అంతా గందరగోళం గా ఉందా! ఒక వుదాహరణ చూస్తే చాలు.
ఉదా: ఉపేంద్రుడిచ్చు ధనము మోపెడేసి యనగ
ఇక్కడ చూడండి జాగ్రత్తగా... ఉప + ఇంద్రుడు = ఉపేంద్రుడు ఉత్తర పదం లో "ఉ" అనే అచ్చు ఉంది కదా.. మోపెడు + ఏసి = మోపెడేసి అనే పదంలో "ఏ" అనే అచ్చుకు యతి మైత్రి చెల్లించడం.
స్వస్తి.. మళ్ళీ ఇంకా కొన్ని ముఖ్యమైన యతుల తో త్వరలో కలుసుకుందాము.
2 కామెంట్‌లు:
మీరు చెప్పిన అనుస్వార యతి లేక బిందు యతికి మరికొంత వివరణ.దీని ప్రకారం వర్గంలోని మొదటి నాలుగు అక్షరాలకూ అవి బిందుపూర్వకములైనప్పుడే ఆవర్గపు చివరి ఆనునాసికాక్షరముతో యతి చెల్లుతుంది.కాని కవర్గములోని మొదటి నాలుగ అక్షరాలకూ అవి బిందుపూర్వకములు కానప్పచికీ చివరి అనునాసికాక్షరమైనజ్ఞ తో యతి చెల్లుతుందని అప్పకవి చెప్పియున్నాడు.దీనిని విశేష యతి అంటారు.అప్పకవి దీనిని చెప్పడానికి తిక్కన గారి భారతంలోని శాంతి పర్వంలోని క్రింది ప్రయోగం కారణమట.
క. జ్ఞానము కేవల కృప న
జ్ఞానికి నుపదేశవిధిఁ బ్ర కాశము సేయం
గానది సకల ధరిత్రీ
దానంబున కంటె నధికతర ఫలదమగున్.
చాలా ధన్య వాదాలు గోపాల కృష్ణ గారూ... వీలైనన్ని రాద్దామని చూస్తున్నా.. ఏది ఏమైనా మీ లాంటి వాళ్ళ ఆశీశ్శులే..నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నాయి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి