• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

31, జులై 2010, శనివారం

తత్సమము, తత్భవము, దేశ్యము, గ్రామ్యము.

౧.తత్సమము: సంస్కృత, ప్రాకృత తుల్యమైన బాష తత్సమము అనబడును.
ఇంకా వివరంగా చెప్పాలంటె, సంస్కృత శబ్దముల యొక్క, ప్రాకృత శబ్దముల యొక్క, దీర్ఘ విసార్గాదులను శాస్త్ర సమ్మతముగా మార్చి, లింగ బేదముల ను బట్టి, విభక్తులు చేర్చడం తత్సమాలని ఆర్యోక్తి.
ఉదా: "రామః" అని సంస్కృతం లో ఉన్న మాటను "డు" చేర్చి... రాముడు గా వాడడం.
"అగ్గీ" అని ప్రాకృతం లో ఉన్న మాటను "అగ్గి" గా మార్చుకోడం. మొదలైనవి.
౨. తత్భవము: సంస్కృత ప్రాకృత భావమగు బాష తత్భవము అంటారు.
వివరంగా చెప్పాలంటే..ఇది వర్ణ లోప, వర్ణాగమ, వర్ణ ఆదేస, వర్ణ వ్యత్యమములు అను నాలుగు విధములుగ మార్పు చెంది శాస్త్ర ప్రకారంగా ఆంద్ర బాష లోకి రావడం అన్నమాట.
ఇంకా వివరంగా ఉదాహరణ లో చూద్దాము.
౧. వర్ణ లోపము: తామరసం - తామర (ఇందులో సకార లోపం జరిగింది)
౨. వర్ణ ఆగమము: రదః - ఇందులో అకారం చేరి "అరదము" గా మారింది.
౩.వర్ణ ఆదేశము: అంగణం. అనే మాట - అంకణము గా మారింది. ఇందులో గకారం ను త్రోసివేసి క కారం వచ్చింది.
౪. వర్ణ వ్యత్యయము: శుచి: అనే మాట చిచ్చు గా మారింది. సంస్కృతమున అంత్యమగు చి వర్ణము ఆంధ్ర పదమున ఆద్యపదముగ మారింది.
3. దేశ్యము: త్రిలింగ దేస్య వ్యవహారంబగు బాషశ్రీశైలము, ద్రాక్షారామము, కాళేశ్వరము, వీని మధ్యన ఉండే ప్రదేశమే త్రిలింగ దేశము
యిది మరలా రొండు విధాలు1. ఆంధ్ర దేశ్యములు: ఊరు, పేరు, ఇల్లు, ముల్లు మొదలైనవి.
అన్య దేశ్యాలు: బిడారు, రోడ్డు. మొదలైన ఇతర దేశ పదాలు.
గ్రామ్యము: లక్షణ విరుద్ధమగు బాష:
వస్తాడు, తెస్తాడు.

అయితే అనింద్య గ్రామ్య బాష కూడా ఉంది. జీవగర్ర, కపిల కన్నులు మొదలైనవి. పెద్దలు గ్రంధాలలో ఉపయోగించిన పదాలను అనింద్య గ్రామ్యాలు గా భావించవచ్చు.
ఇంకా వివరంగా వచ్చే టపాలలో చూద్దాము.

23, జులై 2010, శుక్రవారం

సీస పద్యం విశేషాలు

సీస పద్యం గురించి మీకు కొన్ని ఆసక్తి కరమైన విశేషాలు తెలియజేయలనుకుంటున్నాను. సీస పద్యం చాలా ప్రాచీనమైనది. మొదటగా ఈ పద్యాన్ని గుణగ విజయాదిత్యుని కందుకూరు శాశనం (క్రీ.శ.850 సం!!) లో చూసారు. అంతకు ముందే ఎన్నో సవత్సరాలనుంచీ ఉండి ఉండవచ్చు. అయితే మనకు తెలిసింది మాత్రం 1160 సంవత్సరాల క్రితం. ఈ పద్యం చాల వరకూ శిధిలమైందని చరిత్ర కారులు చెప్పారు. అయితే ఉన్నంతవరకూ కొమర్రాజు లక్ష్మణ రావు గారు ఇచ్చారు. చూద్దాము.
"శ్రీ నిరవద్యుండు చిత్తజాత సముండు
శివ పద వర రాజ్య సేవితుండ
ఖిలుడు ననృతరిపు బలుడు నాహవరావ
దండమోద్య సిఘాసనుండగణిత
దానమాన్యుండు దయా నిలయుండును
భండన నండన పండరంగు
...................................కొలది లేని
కొట్టము ల్వోడిచి గుణక నల్ల
తాని పక్ష పాతి................
....................విభవ గౌరవేంద్ర..
ఈ పద్యం లో ఒక విశేషం ఏమిటంటే.. కొలది లేని అనే మాట వచ్చేదాకా అన్నీ తత్సమ పదాలే కావడం విశేషమే! ఈ పద్యం ఎ పాదానికి ఆ పాదం విడిపోకుండా వుండే "గునుగు సీసం" కావడం మరొక విశేషమని పెద్దలు చెప్తున్నారు. నాహవరావ దండమోద్య సిఘాసనుండగణిత దానమాన్యుండు అనే పెద్ద పెద్ద సమాసాలు అప్పుడే మొదలైన విశేషం గమనించారు గదా.

అలాగే ప్రాచీన కాలం లో ఉన్న పద్యాలను (అంటే అవి ఆవిష్కరింప బడ్డ సంవత్సరాల ద్వారా) మనకు దొరికిన శిలా శాసనాల ద్వారా వాటిని చూద్దాము.
తరువోజ - పండరంగుని అద్దంకి శాసనం - క్రీ.శ 848
ఆట వెలది - గునగ విజయాదిత్యుని ధర్మవరం - క్రీ.శ 850
తేట గీతి - గుణగ విజయాదిత్యుని ధర్మ వరం శాసనం - క్రీ.శ ౮౪౮
మధ్యాకర - బెజవాడ యుద్ధ మల్లుని శాసనం - క్రీ.శ. ౮౮౫
కందం - జిన వల్లభుని కుర్కియాల శాసనం - క్రీ.శ. ౯౪౧
చంపకమాల - గుణగ విజయాదిత్యుని సాతలూరి శాసనం - క్రీ.శ ౮౪౮
ఉత్పలమాల - విరియాల కామసాని శాసనం - క్రీ.శ.1000 ప్రాంతం లో.
మత్తేభం - సర్వదేవుని ఆది పురాణం - క్రీ.శ. 953.
రగడ - రాజ రాజు కోరుమిల్లి శాసనం - క్రీ.శ 1022.
పై పట్టిక ద్వారా ముఖ్యమైన చందస్సులు ఆది నుంచీ ఉన్నయన్న విషయం తెలుస్తోంది. వచన రచన అనేది లేక పొయినా, చక్కని పద్య రచన కు ఆనాడే బీజం పడిందన్న విషయం బోధ పడుతోంది. వచన రచన కేవలం శాసనల్లో మాత్రమే చూడగలం.
నన్నయార్యునికి ముందే కవులు వున్నారు. దానికి సాక్ష్యం ఉంది. ఐతే అవి సమగ్రం గా లేవు. సంపూర్ణ కావ్యాలేవీ దొరకలేదు. సర్వదేవుదనే కవి ఆది పురాణం రాసాడని అంటారు. ఆది పురాణం దొరికితే సర్వదేవుడు ఆది కవి లేకపోతే ఆది కవి అభ్యర్ధి గా మిగిలి పోతాడని ఆరుద్ర అన్నారు. ఏది ఏమైనా మనకు ఆనాడు పద్యాలను గ్రంధస్తం చేయక పోవడం వలన కానీ మరి ఇతర కారణాల వాళ్ళ కానీ, చారిత్రక విశేషాలు లభింపక పోవడం తెలుగు జాతికి తీరని లోటు. కాదంటారా!!!! స్వస్తి.

22, జులై 2010, గురువారం

తెలుగు భాష చరిత్ర.

నేను ఇటీవల తెలుగు బ్లాగులు చూస్తూ ఉంటె, "వసంత మాలిగై" అనే బ్లాగు లో ఉన్న ఆంధ్రుల చరిత్ర వ్యాసం నన్ను బాగా ఆకర్షించింది. మీతో పంచుకుందామని మళ్ళీ ఇక్కడ ఇస్తున్నాను. చదివి ఆనందించండి.

తెలుగు,భారత దేశంలో ఎక్కువగా మాట్లాడే ద్రవిడ భాష. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజ భాష. "త్రిలింగ" పదము నుంచి "తెలుగు" పదం వెలువడిందని అంటారు.తేనె వంటిది కనుక "తెనుగు" అనాలని కొందరు అంటారు. క్రీస్తు పూర్వం 200 నాటి శిధిలాలలొ తెలుగు భాష ఉండటంబట్టి ఈ భాష ప్రాచీనత మనకి తెలుస్తుంది ఏమైనా తెలుగుభాష మూలాన్వేషణకు సంతృప్తికరమైన, నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు. అయినా కూడా, క్రీ.పూ. మొదటి శకంలో శాతవాహన రాజులు సృష్టించిన "గాధాసప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత్ పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. కాబట్టి, తెలుగు భాష మాట్లాడేవారు, శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా కృష్ణ, గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండే వారై ఉంటారని నిర్ణయించవచ్చు.

తెలుగు భాష మూలపురుషులు యానాదులు. పురాతత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష ప్రాచీనత 2,400 సంవత్సరాలనాటిది ఆదిమ ద్రావిడ భాషల చరిత్ర క్రీస్తుకు పూర్వం కొన్ని శతాబ్దాల వెనకకు వెళ్తే తెలుగు చరిత్రను మనము క్రీస్తు శకం 6 వ శతాబ్దము నుండి ఉన్న ఆధారములను బట్టి నిర్ణయించవచ్చు. తెలుగు లోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శకం ఎ.డి. కి చెందినది. శాసనాలలో మనకు లభించిన తొలితెలుగు పదం 'నాగబు'. చక్కటి తెలుగు భాషా చరిత్రను మనము క్రీస్తు శకం 11 వ శతాబ్దం నుండి గ్రంథస్థము చేయబడినది.
ఆంధ్రులగురించి చెప్పిన పద్యములలో ఒక పద్యం
"పియమహిళా సంగామే సుందరగత్తేయ భోయణీ రొద్దే
అటుపుటురటుం భణంతే ఆంధ్రేకుమారో సలోయేతి"
(ఈ విషయం నేను ఇంతకూ ముందే నా బ్లాగు లో ఇచ్చాను)
ఇది ఉద్యోతనుడు ప్రాకృతభాషలో రచించిన కువలయమాల కథలోనిది. ఈ ప్రాకృతానికి పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి తెలుగు అనువాదం కాళ్ళకూరు నారాయణరావు తన "ఆంధ్ర వాఙ్మయ చరిత్ర సంగ్రహము"లో ఈ యుగాన్ని క్రింది భాగాలుగా విభజించాడు.
అజ్ఞాత యుగము: క్రీ.పూ. 28 నుండి క్రీ.త. 500 వరకు:
ఆంధ్రుల భాష గురించి కేవలం అక్కడక్కడా ఉన్న ప్రస్తావనల ద్వారా తెలుస్తున్న కాలం లబ్ధ సారస్వతము: క్రీ.త. 500 నుండి 1000 వరకు.:శాసనాల వంటిని కొన్ని లభించిన కాలం క్రీ.పూ. 28 ముందు:ఆంద్రదేశం అనే పదం ఎలా వచ్చిందంటే: ఈ కాలంలో "ఆంధ్ర" అనే పదం మాత్రం కొద్ది ప్రస్తావనలలో ఉంటున్నది గాని "తెలుగు" అనే పదం ఎక్కడా లభించడంలేదు. అంతే కాకుండా ఆంధ్రుల జాతి గురించి ప్రస్తావించబడింది కాని భాష గురించి ఎలాంటి విషయం చెప్పబడలేదు.
అయితే ఆంధ్రులు, తెలుగులు కలసిన ఫలితంగా ప్రస్తుత భాష రూపు దిద్దుకొన్నది గనుక "ఆంధ్ర దేశం" ప్రస్తావననే కొంత వరకు తెలుగు భాషకు చెందిన ప్రస్తావనగా భావిస్తున్నారు. తెలుగు భాషకు తెలుగు, తెనుగు, ఆంధ్రము అనే మూడు పదాలున్నాయి. ఆంధ్రులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించడానికి ముందు కృష్ణా గోదావరీ ప్రాంతం తెలుగు దేశమని పిలువబడేదని,తమిళ,మళయాళ,కన్నడ భాషలలాగా తెలుగు కూడా ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది. క్రమంగా మిగిలినవానికి భిన్నంగా పరిణమించింది. చిలుకూరు నారాయణరావు వంటివారి అభిప్రాయం ప్రకారం తెలుగు భాష సంస్కృత ప్రాకృత జన్యం. ఏమైనా తెలుగు భాష తక్కిన (మాతృక) భాషలనుండి విడివడి ఏ దశలో పరిణమించిందో చెప్పడం సాధ్యం కాలేదు.
మొట్ట మొదటిగా ఆంధ్రుల ప్రస్తావన క్రీ.పూ. 1500 - క్రీ.పూ. 800 మధ్య కాలంలోనిదిగా భావించబడుతోంది.
తెలుగుబాష వ్యవాహారం :భాషనుబట్టి జాతికి పేరు రావడం చరిత్ర ధర్మం కాదు. జాతిని బట్టే భాషకు వారి భాషగా పేరు వస్తుంది. భాష, జాతి, సంస్కృతి అన్యోన్యాశ్రయములు. భాష పుట్టిన కొన్ని శతాబ్దాల తరువాత గాని ఆ భాషలో వాఙ్మయం పుట్టదు. ఇలా చూస్తే క్రీ.శ. 1000 ప్రాంతంలో పరిణత సాహిత్యం ఆవిష్కరింపబడిన తెలుగు భాష అంతకు పూర్వం ఎన్నో శతాబ్దాలనుండి వ్యవహారంలో ఉండి ఉండాలి. భరతుడు నాట్య శాస్త్రంలో బర్బర కిరాత ఆంధ్ర జాతుల భాషలకు బదులు శౌరసేనినిని ఉపయోగించాలని వ్రాశాడు. పై కారణాల వలన "ఆంధ్ర భాష" లేదా "తెలుగు భాష" క్రీ.పూ. నాటికి ప్రత్యేకమైన భాషగా ఏర్పడి ఉండాలని ఊహించడానికి వీలవుతుంది
"తెలుగు భాష వయస్సెంత?" అనే ప్రశ్నకు సరైన జవాబు లేదు కాని కొంతమంది రచయితలు తెలుగు భాష ఎంత పాతదో నిర్ణయించే ప్రయత్నం చేశారు.
క్రీ.పూ. 28 నుండి క్రీ.త. 500 వరకు (అజ్ఞాత యుగ0):క్రీ.పూ. 500 - క్రీ..త. 500 మధ్య కాలంలో జరిగిన జైన బౌద్ధ మతోన్నతులు, పతనాలు అప్పటి సాహిత్యంపై గాఢమైన ప్రభావం కలిగి ఉండాలని చరిత్ర కారుల అభిప్రాయం.
ఈ కాలానికి సబంధించిన కొన్ని అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.
***ఇప్పటికి తెలుగు భాష లిపి ప్రత్యేకంగా (బ్రాహ్మీ లిపినుండి వేరుగా) అభివృద్ధి అయిన తార్కాణాలు లేవు. "లిపికి ముందే సారస్వతము ఉండవచ్చును గాని అది కేవలం గ్రామ్య పదములో, వీరుల పాటలో, యక్షగానములో, మోహపుం గాసట బీసట యల్లికలో యై శృతి పరంపరాగతములై యుండును. లిపి మూలమున వాఙ్మయము విస్తారముగా వర్ధిల్లుటకు వీలున్నది. అందునను తెనుగున వాఙ్మయము లిపి నిర్మాణానంతరమే ఆరంభమై యుండును". కనుక ఈ కాలంలో తెలుగు సారస్వతం లేదనే భావించవచ్చు.
***శాతవాహనుల కాలంలో తెలుగు ప్రజా భాషయే గాని సారస్వత భాష కాదు, పండిత భాష కాదు. ఆనాటి రాజభాష ప్రాకృతము. పండిత భాష సంస్కృతము. కనుక తెలుగు సాహిత్యం అభివృద్ధి కావడానికి పెద్దగా ప్రోత్సాహం లభించకపోయి ఉండవచ్చు.
***బౌద్ధ జైన మతాలు విలసిల్లిన కాలలో ఎంతో కొంత సాహిత్యం లిఖితంగా కాని, మౌఖికంగా గాని ఉండి ఉండాలి. అయితే తరువాత విజృంభించిన శంకరవాదము, వీరశైనం కాలంలో మతోద్రేకాల కారణంగా బౌద్ధ జైన మత సంస్థల నాశనంతో పాటు ఎంతో సారస్వతం కూడా దగ్ధమైయుండవచ్చును. మతోద్రేకము ఎంతకైనా దారి తీయగలదు. కాకుంటే నన్నయ భారతం వంటి ఉద్గ్రంధం ఒక్కమారు ఆకసంనుండి ఊడిపడదు కదా? జైనపండితులు ఆ సమయంలో కన్నడ దేశానికి తరలిపోయి ఉండవచ్చు.
***ప్రాచీనాంధ్ర వాఙ్మయం లభించకున్నాగాని పూజ్యపాదుడు, పంపడు, మోళిగయ్య, నాగార్జునుడు, భీమకవి మొదలైన తెలుగువారు కన్నడ సాహిత్యానికి చేసిన సేవలను బట్టి చూస్తే తెలుగు భాషలో సాహిత్య పరంపర ఉండదనుకోవడం అసహజంగా కనిపిస్తుంది.
ఆంధ్రులు కవులుగా నున్నయెడల ఆంధ్రమున కవిత్వము లేదనుట ఆశ్చర్యం. అయితే అప్పటిమత ఘర్షణలలో "విజయం" సాధించిన స్థానిక బ్రాహ్మణులకు సంస్కృతమే ఆదరణీయంగా ఉండేది గనుక తెలుగు లిఖిత సాహిత్యం పూర్తిగా నిరాదరణకు గురై ఉండవచ్చు.
మనకు తెలిసినంతలో శాసనపరమైన మొదటి తెలుగు పదములు:
""అమరావతీ స్తూపంలో ఒక రాతి పలక మీద నాగబు అనే తెలుగు పదం""అత్తా, పాడి, పొట్ట, పిలుఆ (పిల్ల), కరణి, బోణ్డీ (పంది), మోడి, కులుఞ్చిఊణ "" పూర్వాంధ్రభాష (తెళుగు) లక్షణాలు ఇవి కావచ్చు: 1.ఆర్యావర్తంలో సామ్రాజ్యం స్థాపించి సప్తశతివంటి ప్రాకృత గ్రంధాలు వ్రాసిన "కర్ల తెల్లంగు" రాజుల మాతృభాష కనుక శుద్ధ సంస్కృతంకంటే ప్రాకృత పదాలే ఎక్కువగా ఉండవచ్చును. 2.అప్పటికి బౌద్ధ జైన ప్రాబల్యమే తెలుగు సీమలో అధికం గనుక సారస్వతం కూడా వారిదే అయిఉండవచ్చును. 3.అటువంటి పూర్వాంధ్రం నేటి ఆంధ్రంగా మారేసరికి 14,814 తత్సమ శబ్దాలు చేరాయి. ఉన్న 12,337 దేశ్య పదాలలో తద్భవాలు 2,000. తురక ఇంగ్లీషు పదాలు 1,500. రూపములు మారి వికృతి చెందిన దేశ్యములే అనిపించేవి దాదాపు 4,000. కనుక శుద్ధ దేశ్యపదాలు 4,000 - 5,000 మధ్య ఉండవచ్చును. ఈ నాలుగు వేల పదాలు లోక వ్యవహారానికి చాలు. క్రీ.త. 500 నుండి 1000 వరకు (శాసనాధారాలు): సింధు లోయ నాగరికత లిపి ఇంతవరకు సరిగా చదువబడలేదు. వేదసూత్ర వాఙ్మయం కేవలం మౌఖికమో, లేక అక్షర బద్ధం కూడా అయిందో తెలియరావడంలేదు. కనుక అశోకుని శాసనాలలో కనిపించే మౌర్యలిపియే భారతీయ భాషలన్నిటికి మాతృక అనిపిస్తున్నది. అందులోనుండే తెలుగు అక్షరాలు రూపొందినాయనిపిస్తుంది.కుబ్బీరకుని భట్టిప్రోలు శాసనము, అశొకుని ఎఱ్ఱగుడిపాడు (జొన్నగిరి) గుట్టమీది శాసనము ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతంలో లభించే మొదటి వ్రాతలుగా భావిస్తున్నారు. వాటిలోని భాష ప్రాకృతము, లిపి బ్రాహ్మీలిపి. తరువాత అమరావతిలోని నాగబు అనే పదము (క్రీ.శ. 1వ శతాబ్ది) , విక్రమేంద్రవర్మ చిక్కుళ్ళ సంస్కృత శాసనంలోని "విజయరాజ్య సంవత్సరంబుళ్" (క్రీ.శ. 6వ శతాబ్ది) మనకు కనిపిస్తున్న మొదటి తెలుగు పదాలు.నాగార్జునకొండ వ్రాతలలో కూడ తెలుగు పదాలు కనిపిస్తాయి. మరిన్ని వివరాలు త్వరలో తెలియ జేస్తాను. సెలవు.

20, జులై 2010, మంగళవారం

సీస పద్యం గణ విభజన ఒకటి చేసి చూడాలి కదా! ఈ దిగువ ఇస్తున్నాను చూడండి.
కమలాక్షు నర్చించు కరములు కరములు
శ్రీనాధు వర్ణించు జిహ్వ జిహ్వ
సుర రక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు
శేష శాయి కి మొక్కు శిరము శిరము
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు
మధువైరి దవిలిన మనము మనము
భగవంతు వలగొను పదములు పదములు
పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి.

ఆహా ఎంత మంచి పద్యమో చూశారా!
దీనికి గణ విభజన చెయ్యాలి కదా!
ఒక సారి ఈ నియమాలు స్ఫురణ కు తెచ్చుకుందాము.
ఈ పద్యం లో, నాలుగు పెద్ద పాదాలు ఉంటాయి. ఆ నాలుగు పెద్ద పాదాలనూ..మళ్ళీ నాలుగు పెద్ద పాదాలుగా, నాలుగు చిన్న పదాలుగా విడగొట్టి రాస్తారు.దీని స్వరూపం ఇలా ఉంటుంది.
ఒకటో పాదం .... ఇంద్ర - ఇంద్ర - ఇంద్ర - ఇంద్ర - పెద్ద పాదం.
రెండో పాదం.. ఇంద్ర - ఇంద్ర - సూర్య - సూర్య- చిన్న పాదం.
మూడు నాలుగూ... ఐదూ ఆరూ... ఏడు ఎనిమిదీ.. పదాలు వరుసగా ఉంటాయి. ఇలాగే..ప్రతి చిన్న పాదం లోని మొదటి గణం మొదటి అక్షరానికీ.. మూడవ గణం మొదటి అక్షరానికీ యతి చెల్లాలి. ప్రాస యతి కూడా చెల్లుతుంది. ఈ పద్యానికి ప్రాస నియమము లేదు.
నల, నగ, సల, భ, ర, త లు. ఇంద్ర గణాలు.
గల లేక హ మరియూ న గణాలు సూర్య గణాలు
ఇవి ఎప్పుడూ మనసులో తిరుగుతూ ఉంటేనే మనం పద్యాల్ని సమర్దవంతం గా రాయగలము అనే విషయాన్ని గుర్తుంచుకోండి.
మొదటగా పెద్ద పాదం చూద్దాము.
కమలాక్షు IIUI
నర్చించు UUI
కరములు IIII
రములు IIII
పైన పెద్ద పాదం లో సల, త, నల, నల వచ్చయి కదా..
చిన్న పాదము :

్రీనాధు UUI

ర్ణించు UUI

ిహ్వ UI

జిహ్వ UI

త, త, గల లేక హలం వరుసగా రొండు సార్లు వచ్చాయి కదా. రొండు పాదాలలో మొత్తం

ఆరు ఇంద్ర గణాలు, చివరలో రొండు సూర్య గణాలు ఉన్నాయి కదా!

ఇక యతి విషయం లో శ్రీ నాదు లో ని "శ్రీ" కి జిహ్వ లోని "జి" కి సరి పోయింది కదా.

ఇలాగే మిగతా పాదాల్ని గణవిభజన చేసి చూడండి. ఇవాల్టికి స్వస్తి.

19, జులై 2010, సోమవారం

తిట్టు కవిత్వం

తెలుగు దనం వారి సౌజన్యం తో తెలుగు లో తిట్టు కవిత్వం గురించి ఇస్తున్నాను.
లలిత కళలలో అత్యంత విశిష్టమైనది కవిత్వం. ఇది అనేక విధాలుగా రంజింపజేస్తుంది. ఆశుకవిత్వం, చిత్ర కవిత్వం, మధుర కవిత్వం, విస్తర కవిత్వం, శాస్త్ర కవిత్వం, తిట్టు కవిత్వం అను అనేక రూపాల్లో కవిత్వం చెప్పబడుతున్నది. వీటిలో తిట్టు కవిత్వం యొక్క స్థానం ప్రత్యేకమైనది. ఆదికవి వాల్మీకి వాక్కు నుంచి ఆవిర్భవించిన మొట్టమొదటి కవిత్వం తిట్టు కవిత్వం కవిత్వమంటే ఆశ్చర్యం కలగకమానదు.
మానిషాద ప్రతిష్ఠాం త్వ, మగమ శ్శాశ్వతీ స్సమా:యత్క్రౌచ మిథునా దేక, మవధీ: కామ మోహితం"
క్రౌంచ మిధునములో నొకదానిని గూలనేసిన నిషాదుని చూసి వాల్మీకి తిట్టిన తిట్టు, శోకంతో బహిర్గతమైంది. దీనినే దూషణ కవిత, నిందాహేళన కవిత అని కూడా అంటారు. సాధారణంగా ఈ కవిత్వం ఆవేశపూరితంగా ఉంటుంది. తెలుగులో తిట్టు కవిత్వం చాటుపద్య రూపంగానూ, గ్రంధస్థ కుకవినిందాది రూపముగాను భాసిస్తున్నది. తిట్టుకవుల పద్యాలు చాలావరకు చాటువులుగానే ఉన్నాయి.
పల్లెల్లోనూ, పట్టణాలలోనూ కొందరు ముదుసళ్ళు అలవోకగా చెప్పే అనేక చాటుపద్యాల్లో తిట్టు కవిత్వం సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. 12వ శతాబ్దానికి చెందిన వేములవాడ భీమకవి తిట్టు కవిత చెప్పడంలో దిట్ట. ఇతడు శ్రీనాధ కవిచే ప్రశంశించబడినవాడు. భీమన తిట్టు కవితలో తెలుగులో ఆదికవి.
"గొప్పలు చెప్పుకొంచు నను గూటికి బంక్తికి రాకుమంచు నీత్రిప్పుడు బాపలందరును దిట్టిరి కావున నొక్కమారు నీయప్పములన్ని కప్పలయి యవ్నము సున్నముగాగ మారుచున్బప్పును శాకముల్ పులుసు పచ్చడులుం జిరురాలు గావుతన్"
అని తనని ముండ కొడుకంటూ భోజనానికి రానివ్వని పెద్దని తిడుతూ ఆ భోజన పదార్ధాలను చూసి పద్యం చెప్పాడు. 13వ శతాబ్దానికి చెందిన ఖడ్గ తిక్కన యుద్ధ రంగమునుండి పారిపోయి ఇంటికి రావడంతో అతని భార్య చానమ్మ అతని స్నానానికి మంచం అడ్డుపెట్టి పసుపు ఉండ పెట్టడంతో ఇదేమిటని అడిగిన భర్తతో ఆమె ..
"పగరకు వెన్నిచ్చినచో, నగరే నిను మగతనంపు నాయకులెల్లన్ముగురాడువారమైతిమి, వగపేటికి జలకమాడ వచ్చినచోటన్" అంది.
ఆ ఇల్లాలు చెప్పిన సమాధానం సుతిమెత్తని తిట్టు కవితగా లోక ప్రచారమైనది. స్ఫూర్తిదాయకమైనది కూడా.
వేములవాడ భీమకవి తరువాత తిట్టు కవిత్వంలో ఉద్దండత చూపిన వాడు 14-15 శతాబ్దాలకు చెందిన శ్రీనాధుడు. పల్నాటి సీమలో జొన్న కూడుతప్ప వరి అన్నం దొరకని పరిస్థితి ఏర్పడడంతో ....
"జొన్నకలి జొన్నయంబలి, జొన్నన్నము జొన్నపిసరు జొన్నలె తప్పన్సన్నన్నము సున్న సుమీ, పన్నుగ బల్నాటిసీమ ప్రజలందరికిన్" అని పరిహసించాడు.
పల్నాటి సీమలొనే త్రాగ నీరు లభించకపోవడంతో పరమశివుణ్ణి నిందిస్తూ...
"సిరిగల వానికి జెల్లును దరుణుల బదియారువేల దగ బెండ్లాడన్దిరిపమున కిద్దరాండ్రీ, పరమేశా! గంగ విడువు, పార్వతిచాలున్" అన్నాడు.
శ్రీనాధుని తర్వాత 16వ శతాబ్దానికి చెందిన తెనాలి రామకృష్ణుడు అత్యంత సమర్ధుడైన తిట్టు కవి, చాటుకవి. ఇతడు హాస్య కవితా సామ్రాజ్యాధిపతి. వికటకవిగా ఈయన ఆంధ్ర దేశంలోని ఆబాల గోపాలానికీ చిరపరిచితుడు. రాయల వారి ఆస్థానమునకు వచ్చిన బట్టు కవి ఆస్థాన పండితుల సామర్ధ్యానికి పరీక్ష పెడుతూ ....
"కుంజర యూధంబు దోమకుత్తుకజొచ్చెన్"
అని సమస్యనీయగా రామకృష్ణుడు వెంటనే ....
"గంజాయి త్రాగి తురకల సంజాతులగూడి కల్లు చవిగొన్నావా?లంజెల కొడకా! యెక్కడ, కుంజర యూధంబు దోమకుత్తుకజొచ్చెన్" అని పూరించాడు. ఐతే రాయలవారు యిది సరియైన పూరణ పద్ధతి కాదని మందలించడంతో రామకృష్ణుడు "పెద్దనాది మహా కవులకు బట్టు కవి ఇటువంటి సమస్యనివ్వడంతో అట్లు పూరించితిని. వీనికీ పూరణమే సరియైనది" అని బదులిచాడు. వెంటనే రాయలు ఐతే ఆ సమస్య నేనే యిస్తే ఏవిధంగా పూరిస్తావు?" అనడంతో రామకృష్ణుడు....
"రంజనచెడి పాండవులరి, భంజనులై విరటుగొల్వ బాల్పడి రకటా!సంజెయ! యేమని చెప్పుదు, గుంజర యూధంబు దోమ కుత్తుకజొచ్చెన్"
అని పూరించి రాయల వారి అనుగ్రహాన్నీ, అభినందనలనూ పొందాడు.
ఈ కోవలోనే కాలము, కర్తృత్వము తెలీని తిట్టు పద్యం తప్పులెన్నువారి గూర్చినది...
"నక్కలు బొక్కలు వెదకును, నక్కరతో నూరబంది యగడిత వెదకున్కుక్కలు చెప్పులు వెదకును, దక్కడి నా లంజెకొడుకు తప్పే వెదకున్".
అబద్ధాలాడువాని గూర్చిన హేళనతో కూడిన పద్యం....
"ఆడినమాటలు దప్పిన, గాడిదకొడుకంచు దిట్టగా వినియయ్యో!వీడా నా కొక కొడుకని, గాడిద యేడ్చెంగదన్న ఘనసంపన్నా!"
లోభిని గూర్చిన తిట్టు పద్యం ...
తిట్టిన రోసముంబడడు దీవనయిచ్చిన సంతసింప డాకట్టిడి లోభి కెంత యధికారము గల్గిననేమి? లేకయేబెట్టుగ నున్న నేమి? నడపీనుగుకున్ మణిభూషణంబులన్ బెట్టిన న్సరియె మెచ్చునొ నొచ్చునొ కాళికేశ్వరీ!"
తిట్టు కవిత్వంతోనే సంతృప్తి చెందని కొందరు కవులు తిట్టు గ్రంధాలను సైతం రచించి ఆ వాజ్ఙయముకు శాశ్వత స్థానాన్ని కల్పించారు. తిట్టు కావ్యాలకే అధిక్షేప కావ్యములని పేరు. ఇవి ఒక వ్యక్తి లేదా ఒక సంఘం యొకా దోషాలను యెత్తి చూపుతాయి. వీటిలో అధికంగా వచ్చినవి శతకాలు. పలు శతకాల్లో తిట్టు కవిత్వం కలదు. తెలుగు శతకాలాలొ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందిన సుమతీ శతకంలో అనేక తిట్టు పద్యాలు కలవు.
"అల్లుని మంచితనంబును, గొల్లని సాహిత్య విద్య కోమలి (టి) నిజమున్బొల్లున దంచిన బియ్యము, తెల్లని కాకులుని లేవు తెలియర సుమతీ"
అనే పద్యం ఒక ఉదాహరణ మాత్రమే. వేమన తిట్టు పద్యాలలో ప్రముఖ స్థానం వహించాడనడంలో ఎవరికీ అభ్యంతరం లేదు. ఇతని తిట్టు కవిత హాస్య గర్భితమై ఉంటుంది. "తలలు బోడులైనా తలపులు బోడులౌనా", "తల్లి శూద్రురాలు తానెట్లు బాపడు", "మంత్ర జలముకన్న మంగలి జలమెచ్చు" వంటి పద్యాలలో ఎంతో సందేశముంది. 17వ శతాబ్దికి చెందిన చౌడప్ప కవి తిట్టు కవిత్వంలో దిట్టగా పేరెన్నికగన్నవాడు. వేమన ఆటవెలదిలో ఏల అందెవేసిన చెయ్యో చౌడప్ప కందములో అంతటి ప్రతిభాశాలి. చౌడప్ప తన శతకములో బూతులు, శృంగారాల గురించిన అనేక పద్యాలు వ్రాశాడు. "పది నీతులు పది బూతులు, పది శృంగారములు గల్గు పద్యములు సభన్ జదివినవాడే యధికుడు....", "నీతులకేమి యొకించుక, బూతాడక దొరకు నవ్వు పుట్టదు" అని తన ఉద్దేశాన్ని బహిరంగంగా చాటాడు.
చౌడప్ప పద్యాలలో మచ్చుకు కొన్ని...
"ఇయ్యగ నిప్పించంగల, యయ్యలకేగాక మీసమందరికేలా,
రొయ్యకు లేదా బారెడు....""ముండల కొడుకుల సంపద,
దండులకెగాని దానధర్మములకు రాకుండు..."
"లంజెలు రాకుండిన గుడి రంజిల్లదు ప్రజల మనసు రాజిల్లదురాలంజెలనేల సృజించెనొ, కంజుకుడు...""దినము లోపల నుత్తమ,
దినమే తద్దినము నాటి తిండికి సమమే...""బూతని నగుదురు కడుతమ, తాతలు ముత్తాత మొదలు తరతరముల వా'రే తీరున జన్మించి రొ...."తిట్టు కవిత్వం, పద్యాల వలనే తిట్ల దండకం కూడా తెలుగులో ప్రసిద్ధమైంది.
అధిక్షేప కృతుల రచనలో కందుకూరి వీరేశలింగం గారు కూడా పేరెన్నికగన్నవారు. అనేక ప్రహసనాలను వీరు రచించారు. అలాగే శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, వేలూరి శివరామ శాస్త్రి, వసురాయ కవి, తదితరులు తిట్టు కవిత్వాన్ని అందించి తెలుగు సాహిత్యంలో చెరగని ముద్ర వేశారు. తిట్టు కవిత్వాన్ని తిరుపతి వేంకట కవులు సైతం చెప్పారు. తిట్టు కవిత సాధారణంగా ఆశు కవితయే. ఆశు కవితకు ఆవేశం సాధారణ లక్షణం కావున తిట్టు కవితలో కూడా ఆవేశం ఉండడం సహజం. తిట్టు కవిత నేడు కూడా లేకపోలేదు. ఐతే తెలుగులో ఉన్న తిట్టు కవిత మరి ఏ ఇతర భాషలోనూ లేదు. తిట్టు కవితను కవితా వినోదంగా భావిస్తే ఇది అధిక్షేపణీయం కాదు.

14, జులై 2010, బుధవారం

తెలుగు వ్యాకరణ గ్రంధాలు - ఒక పరిశీలన

తెలుగు భాష చరిత్ర గురించి అప్పుడప్పుడూ కొంచెం కొంచెం తెలుసుకోవడం ఆసక్తి దాయకంగా ఉంటుందని భావిస్తూ.. "తెలుగు లో వ్యాకరణ గ్రంధాలు" వాటి గురించి తెలుసుకుందాం. ఛందస్సు, వ్యాకరణం, అలంకారాలు పద్య రచనకు దోహదం కలిగిస్తాయి. మొదట ఛందో గ్రంధాలలోనే, అక్కడక్కడ వ్యాకరణ అంశాలను చర్చించడం కనపడుతుంది. మనకు లభించే ఛందో గ్రంధాల్లో " కవిజనాశ్రయము" మొదటిది. దీని కాలం వివాదాస్పదము అయినా..కేతన రచించిన "ఆంద్ర భాషా భూషణం" కంటే ప్రాచీనమైనదని చరిత్ర కారుల అభిప్రాయం. కవి ఎవరో కూడా తెలియ రాక పోవడం గమనించ దగ్గ విశేషం. దీనిలో దోషాదికారం అనే విషయం చెప్తూ.. విసంధి, దుస్సంధి, కుసంధి మొదలైన వ్యాకరణ విశేషాలు ఉదాహరణలతో తెలుప బడ్డాయి.

కేతన రాసిన "ఆంద్ర భాషా భూషణం" పద్య వ్యాకరణ గ్రంధం. ఇందులో ముఖ్యంగా వ్యాకరణ విశేషాలు తెలుపబడ్డాయి. తర్వాత విన్నకోట పెద్దన "కావ్యాలంకార చూడామణి" లో ఛందో అంశాలతో బాటుగా, వ్యాకరణ విశేషాలు పలు పేర్కొన బడినవి.

నన్నయ భట్టు దే అని నమ్ముతున్న " ఆంద్ర శబ్ద చింతామణి" పైన పేర్కొన్న రెండు గ్రందాల కంటే కూడా మంచి సూత్రా నియమాలతో రాయబడింది. ఐతే, దీనిలో ఛందస్సు గురించి లేక పోవడం కొరతే! కొందరు దీనికి పాఠ బేధాలు కల్పించి, అప్పకవీయానికి మూలమైన "చింతామణి" తయారు చేసారు.అందువల్లనే, అప్పకవీయం.. ప్రామాణిక చదో గ్రంధంగా రూపు దిద్దుకుంది. దానికి ముందే తెలుగు లో వచ్చిన "బాల సరస్వతీయం", అహోబల పండితీయ రూపం లో చింతామణికి వ్యాఖ్యానం వచ్చే వరకూ కూడా. బల సరస్వతీయానికి ప్రాముఖ్యత కలుగలెదు.

మనం ఈ గ్రంధాలను ముఖ్యంగా, 1) ఫద్య వ్యాకరణ గ్రంధాలు 2) సంస్కృత శ్లోక బద్ధ వ్యాకరణ గ్రంధాలు 3) సంస్కృత సూత్ర బద్ధ వ్యాకరణాలు 4) చింతామణి కి వ్యాఖ్యానాలు 5) తెలుగు సూత్రములతో రచించిన వ్యాకరణాలు 6) గద్య మయములైన వివరణాత్మక వ్యాకరణాలు గా విభజించ వచ్చు.

ఐతే బహుళ ప్రచారాన్ని పొందిన వాటిల్లో.. కేతన రాసిన ఆంధ్ర భాషా భూషణం, విన్నకోటపెద్దన రాసిన కావ్యాలంకార చూడామణి, అనంతా మాత్యుని చందో దర్పణం, ముద్దరాజు రామన రాసిన కవిజన సంజీవిని కొన్ని. వీటిల్లో ఏమేమి రాసారో తర్వాత తెలుసుకుందాము. కావ్య రచనకు మార్గ నిర్దేశనం గా తెలుగులో వ్యాకరణ రచన ఆరంభమయింది. దానితో భాషా స్వరూప స్వభావాలు నిరూపించ బడ్డాయి. సంధి సమాసాలలో ద్వైరూప్య సాధనకై రూపాంతరాలున్న తావులను అన్వేషించి చందస్సు లో వివిధ స్తలాలలో, గణ యతి ప్రాసాదులకు అనువుగా వాటిని వాడుకునేందుకు కవులకు శాస్త్ర నిర్దేశనము చేయుట వ్యాకరణ గ్రంధాల ప్రధాన ఉద్దేశ్యము.
చివరిగా ఒక మాట. "యదధీత మవిఙాఞతం నిగదేనైవ శబ్ద్యతే, అనగ్నా వివ శుష్కైధో న తజ్జ్వలరి కర్హిచిత్ తస్మా దనర్ధకం మాధీగీష్మహీ త్యధ్యేయం వ్యాకరణం"అంటె..మన జాతి ప్రాచీన సాహిత్యాన్ని తద్ద్వారా మన సంస్కృతి సాంప్రదాయలను నిలబెట్టుటకు వ్యాకరణం ఎంతో ప్రయోజనం.




13, జులై 2010, మంగళవారం

సీస పద్యం.

మనం పాట లాగా పాడుకోవడానికి బాగా వీలుండే పద్యం సీసమే! పూర్వం పౌరాణిక నాటకాలలో, ఇలాంటి సీసాలు ఎక్కువ గా ఉండేవి. ఇంకా రాయడం సులువు. మళ్ళీ, ఇంటి పేర్లు, పేర్లు కష్టమైన గురు లఘువులు ఉన్నవి, అన్నీ ఇందులో సులభంగా ఇమిడి పొయ్యే పద్యం ఇది. బాగా ప్రాక్టీసు చేసుకుంటే అన్ని విధాల ఉపయోగ పడుతుంది. ఇది కూడా ఇంద్ర, సూర్య గణాలు లతో ఉండేదే కాబట్టి, ఆటవెలది, తేట గీతి లాగ ఆడుకుంటూ పాడుకుంటూ రాసెయ్యొచ్చు.

ఈ పద్యం లో, నాలుగు పెద్ద పాదాలు ఉంటాయి. ఆ నాలుగు పెద్ద పాదాలనూ..మళ్ళీ నాలుగు పెద్ద పాదాలుగా, నాలుగు చిన్న పదాలుగా విడగొట్టి రాస్తారు.

దీని స్వరూపం ఇలా ఉంటుంది.

ఒకటో పాదం .... ఇంద్ర - ఇంద్ర - ఇంద్ర - ఇంద్ర - పెద్ద పాదం.
రెండో పాదం.. ఇంద్ర - ఇంద్ర - సూర్య - సూర్య- చిన్న పాదం.

మూడు నాలుగూ... ఐదూ ఆరూ... ఏడు ఎనిమిదీ.. పదాలు వరుసగా ఉంటాయి. ఇలాగే..
ప్రతి చిన్న పాదం లోని మొదటి గణం మొదటి అక్షరానికీ.. మూడవ గణం మొదటి అక్షరానికీ యతి చెల్లాలి. ప్రాస యతి కూడా చెల్లుతుంది. ఈ పద్యానికి ప్రాస నియమము లేదు.
పై సీస పద్యం రాసిన తర్వాత దాని కింద ఒక తేటగీతి లేక, ఒక ఆట వెలది ని గానీ రాయాలి. అప్పుడే.. సీసం పూర్తి అయినట్టు లెక్క. ఇలా రాయడాన్ని ఎత్తు గీతి అంటారు.
ఇక ఒక పద్యానికి గణ విభజన చేసి చూద్దామా.. స్వస్తి.

12, జులై 2010, సోమవారం

స్పందన బాగానే ఉంది.

పద్య మంజూష మొదలెట్టి 2నెలలు అయిన సందర్భంగా, అసలు ఎంతమంది ఆసక్తి కరంగా చూస్తున్నారు అనే విషయం తెలుసుకోవాలని, ఒక "పోలు" నిర్వహించాను. మొత్తం 9 మంది ఓటు వేయగా.. ఏడు మంది బాగుంది అని, ఒకరు పర్వాలేదు అనీ, ఒకరు మాత్రం బాగా లేదు అన్నట్టు గా చెప్పారు. బాగానే ఉంది. వారు ఎందువల్ల బాగా లేదు అన్నారో తెలీదు. వారు సింపుల్ గ, బాగాలేదు అని సర్టిఫికేటు ఇచెయ్యడం గాకుండా, ఎందువల్ల బాగోలేదు, వారు ఏమైనా మెరుగు అవడానికి సలహాలు ఇవ్వగలరా! అనేది ముఖ్యం. అని నా అభిప్రాయం. అయినా 88% మంది బాగుంది అన్నాక బ్లాగు ఆపేది లేదు లెండి. కొన్ని అనివార్య కారణాల వాళ్ళ పోయిన వారం ఎక్కువ టపాలు ఇవ్వలేక పొయ్యాను. నమస్కారాలతో. టేకుమళ్ళ వెంకటప్పయ్య.

6, జులై 2010, మంగళవారం

ఆటవెలది రాద్దాం ఇలాగా..

పద్యాలు రాయడంలో, ఆటవెలది గానీ, తేటగీతి కానివ్వండి, మన మనసులో ఒకట్యూనింగు లాగా ఏర్పడే వరకూ ప్రాక్టీసు చెయ్యాలి. మీరేమి అనుకున్న విరామ సమయంలో, మనసులోనే గణ విభజన చేసుకోండి. ఉదా: ఆటవెలది అయితే, మొదట ఒక సూర్య గణం రావాలి కదా. మూడు లఘువులతో గానీ.. (III) లేక UI తో ప్రారంభించాలి అనే విషయం మనసులో పెట్టుకోండి. అంటే, పద్యం చెప్తూ ఉన్నప్పుడే , సరిగా వెళ్తోందా మన ఆటవెలది బండి అని ఆలోచించుకుంటూ వెళ్ళండి.
ఒక ఉదాహరణ చూద్దాము. ఆటవెలది గురించి ఒక పద్యం రాయాలనుకుంటే మొదట, ప్రారంభం.. "ఆట" అని చేద్దాము తర్వాత, మళ్ళీ ఇంకో రొండు సూర్య గణాలు రావాలి. "వెలది" సరిపోతుంది. "రాయ" సరిపోతుంది. ఇక ఇంద్ర గణాలు రొండు ఎన్నుకోవాలి. నల, నగ, సల, భ, ర, త ఉండాలి కదా. ఇక యతి చూచుకుంటూ.. ఇంద్ర గణము రాయాలి. "ఆదరను" మళ్ళీ.. "బెదరను". అనే మాట వేద్దాము. కాబట్టి మనకు మొదటి పాదం తయారయింది. ఇలా పదాల అటూ ఇటూ తిప్పుతూ.. గణాలు చెదరకుండా.. యతి భంగం కాకుండా.. రాయడం ప్రాక్టీసు చేసుకోవాలి.

మొదట సంధులు సమాసాల గొడవ వదిలేసి, చిన్న చిన్న పదాలతో. ప్రారంభించండి. పదాలు పద్యం లో అటూ ఇటూ మార్చుకోవచ్చు. భావం చెడకుండా చూసుకోవాలి అంతే. .. ఇవాల్టికి ఇది ప్రాక్టీసు చేయండి. రేపు ఇంకో ఛందస్సు తో కలుద్దాము. స్వస్తి.

2, జులై 2010, శుక్రవారం

ఒక ముఖ్య విషయం గమనించండి.

ఒక విషయము మీకు చెప్పాలి. సంయుక్తాక్షరానికీ, ద్విత్వక్షరాలకీ ముందున్న లఘువు, గురువు గా మారుతుందని ఇంతకూ ముందు అనుకున్నాం కదా! అక్కడ మనం ఇంకో విషయం కూడా గుర్తు పెట్టుకోవాలి. ఒక పదం లో మొదటి అక్షరమే, సంయుక్త లేక ద్విత్వాక్షరం అయింది అనుకోండి. అప్పుడు, దాని కన్నా ముందు లఘువు వేరొక పదం లో ఉంటే, గురువు అవదు. ఎట్టి మార్పూ ఉండదు. గమనించండి.
చంపక మాల లోని ఒక పాదం ద్వారా మీకు ఆ విషయం చెప్తాను.
కలిపి - నద్రాక్ష - పాకమ - నాకమ్మ - దనంబు - నకమ్ము - యౌచురా.
న జ భ జ జ జ ర
III, IUI, UII, IUI, IUI,IUI, UIU.
"ద్రా" అనే సంయుక్తాక్షరం ముందు "న" లఘువు ఉన్నప్పటికీ, కలిపిన - ద్రాక్ష వేరు వేరు పదాలు అవడం వల్ల, న లఘువు గానే ఉండి పోయింది. ఇలాంటి విషయాలు గమనించుకోవాలి.

1, జులై 2010, గురువారం

నానార్ధములు

సాధారణముగా ఒక పదమునకు ఒకే అర్ధముండును. కానీ కొన్ని పదములకు ఒకటి కంటే ఎక్కువ అర్ధములుండును. అట్టి పదముల అనేక అర్ధములను నానార్ధములు అని అందురు. తెలుగుదనం వారి సౌజన్యం తో కొన్ని ఇక్కడ ఇస్తున్నాను. ఇవి మన పద్యాలు రాయడానికి ఉపయోగ పడతాయి.

అంకము - నాటకభాగము, సమీపము, చిహ్నము, అంకె.
అంగము - శరీరము, ఉపాయము, భాగము, అవయవము.
అంటు - మైల, తాకు, నేలపైపాతిన కొమ్మ.
అంబ - తల్లి, పార్వతి, అంబిక.
అంబరము - ఆకాశము, వ్యసనము, వస్త్రము.
అక్షరము - ఓం కారము, తపస్సు, ధర్మము, వర్ణము, యజ్ఞము.
అని - చెప్పి, యుద్ధము, సేన, అన్ని, ప్రసిద్ధి.
అనువు - అనుకూలము, తీర్పు, అవకాశము, ఉపాయము, విధము.
అబ్దము - మేఘము, సంవత్సరము.
అభ్రకము - రెల్లు గడ్డి, మబ్బు, కర్పూరము, స్వర్గము, ఆకాశము.
అమృతము - సుధ, పాలు, నీరు, నెయ్యి .
గంగ - నది, గోదావరి, నీరు, గంగానది.
గతి - నడక, వలె, స్థితి.
గణము - జాతి, సమూహము, సమాజము, అక్షర సముదాయము.
గాత్రము - కంఠము, దేహము, అవయవము.
గుణము - స్వభావము, వింటినారి.
గురువు - బృహస్పతి, ఉపాధ్యాయుడు, తండ్రి , తాత, అన్న.
ఘనము - మేఘము, గొప్ప.
తపసు - తస్సు, అగ్ని, వేసవి, పక్షి.
తమస్సు - చీకటి, అంధకారము, అజ్ఞానము.
తరంగం - కెరటము, గుర్రపుదాటు, వస్త్రము.
తీర్ధము - రేవు, పుణ్యక్షేత్రము, పవిత్ర జలము, అగ్ని.
తెగ - కులము, పొడవు, పక్షము, వింటినారి.
తోయము - నీరు, స్నేహము.
త్రోవ - దారి, ఉపాయము, పద్ధతి.
దానము - మదజలము, ఈవి.
దిక్కు - ఉపాయము, దిశ, మార్గము, గతి.
దేవి - సరస్వతి, దేవపత్ని, పార్వతి.
దైవము - దేవత, భాగ్యము, కొతావు, ఒకరకమైన వివాహ పద్ధతి.
దోషము - పాపము, పొరపాటు, ఆవుదూడ, చేటు భుజము.
ధ్వని - చప్పుడు, వ్యంగ్యము.
ధర్మము - ఆచారము, న్యాయము, గుణము, పుణ్యము, యజ్ఞము, విల్లు.
ధార - ప్రవాహము, కత్తి పదును పరంపర, నీటివాలు.
నరుడు - మానవుడు, అర్జునుడు, ఒకముని.
నాగము - పాము, ఏనుగు.
నింగి - ఆకాశము, స్వర్గము.
నీరజ - నీటిలో పుట్టినది, తామర ముత్యము.
పుండరీకము - పెద్ద పులి, తెల్ల తామర, మామిడి పండు తీర్ధము.
పక్షము - రెక్క, 15 దినముల కాలము, ప్రక్క అర్ధదేహము, సమూహము.
పదము - పాలు, శబ్దము, పాదము.
పాడి - తీర్పు, ధర్మము, వివాదము, తగవు, న్యాయము.
పాదము - కాలు, పద్యపాదము, నాలుగవ వంతు.
పితామహుడు - బ్రహ్మ, తాత.
పుణ్యము - ధర్మము, నీరు, బంగారము, పుష్పము.
పురము - పట్టణము, శరీరము, ఇల్లు, మేడ.
పూట - దినము, సగము, పూచి.
పేరు - నామము, ప్రసిద్ధి, పెద్ద, నగ.
ప్రవాహము - వరద, పారుదల, ధార, ఉత్తమాశ్వము.
ప్రాణము - ఊపిరి, గాలి, ఉసురు, బలము, హృదయము.
ప్రియము - వెల, ప్రీతి, ఇష్టము, ఎక్కువైనది.
ప్రీతి - సంతోషము, ఛంధస్సులో ఒకటి, మన్మధుని భార్య.
బలము - సత్తువ, దేహము, రక్తము, బలాత్కారము, శక్తి, సైన్యము, దండు.
భగము - అల, అవమానము, ఆటంకము, విరచుట.
భరణము - పోషించుట, కూలి, భోజనము, మోయుట.
భాష - మాట, వివరణము, సరస్వతి.
భూతము - ప్రాణి, గడచినకాలము, సత్యము, పిశాచము, గతకాలము.
భూరి - బంగారము, గొప్ప.
మండలము - నలుబది దినములు, బింబము, జిల్లా.
మది - మనస్సు, కోరిక, తెలివి.
మాంసము - కాలము, పురుగు.
మానము - కొలత, అభిమానము.
మార్గము - త్రోవ, పద్ధతి, పరిశీలన, ఉపాయము.
మాలిక - పుష్పములదండ, రాజగృహము, విరజాజిచెట్టు.
ముఖము - నోరు, విధము, మొగము.
ముని - బుద్ధుడు, ఋషేశ్వరుడు, మామిడిచెట్టు.
మేలు - ఉపకారము, పుణ్యము, శ్రేష్ఠత, న్యాయము, అందము.
మౌళీ - కిరీటము, కొప్పు, శిరస్సు, జటాజూటము.
యుగము - జంట, వయస్సు, కాలము.
రంగము - యుద్ధభూమి, నృత్యము, రంగు, నాట్య ప్రదర్శన, స్థలము.
రంధ్రము - కన్నము, నింద, తప్పు, నవసంఖ్య.
రతి - సంభోగము, అనురాగము, మన్మధుని భార్య.
రత్నము - మణి, వజ్రము, అమూల్యమగు వస్తువు, నీరు.
రథము - తేరు, రెల్లు, శరీరము, పాదము.
రసము - ద్రవము, నీరు, పాదరసము, నవరసములు.
రాజు - చంద్రుడు, ప్రభువు, ఇంద్రుడు.
రూపు - ఆకారము, దేహము, చక్కదనము, నిజము.
లీల - ఆట, వినోదము, పోలిక, సొగసు, చులకన.
లోకము - జగత్తు, జనము, చూపు, గుంపు.
వంశము - కులము, వెదురు, సమూహము.
వనము - నీరు, అడవి.
వాహిని - సైన్యము, నది.
విభుడు - శివుడు, ప్రభువు, సర్వవ్యాపకుడు, బ్రహ్మ.
విరోధము - పగ, ఎడబాటు, అడ్డంకి, ఒక అలంకారము.
విషయము - సమాచారము, దేశము, ఇంద్రియము.
వీధి - త్రోవ, పంక్తి, వాడ, నాటకభేదము.
వృషభము - ఎద్దు, పుణ్యము, నెమలిపింఛము, వృషభరాశి.
వెరవు - విధము, తగినది, తగిన విధము, బ్రతుకుతెరవు.
శరము - బాణము, రెల్లు, నీరు.
శిఖి - నెమలి, బాణము, అగ్ని సిగగలవాడు.
సత్యము - నిజము, మంచితనము, ఒట్టు కృతయుగము.
సిరి - సరస్వతి, సంపద, లక్ష్మి, విషము, సాలిపురుగు.
సొమ్ములు - నగలు, పశువులు, డబ్బు.

ఆటవెలది.

ఆటవెలది పద్య పాదం లో నాలుగు పాదాలు ఉంటాయి. ౧, ౩ పాదాలలో..వరుసగా ౩ సూర్య గణాలు, ౨ ఇంద్ర గాణాలూ ఉంటాయి. ౨, ౪ పాదాలలో..ఐదేసి సూర్య గణాలు ఉంటాయి. ప్రతి పాదం లోని మొదటి గణం మొదటి అక్షరానికీ, నాల్గవ గణం మొదటి అక్షరానికీ యతి మైత్రి చెల్లుతుంది. ప్రాస నియమం లేదు. ప్రాస యతి వాడవచ్చు.
సూర్య, సూర్య, సూర్య, ఇంద్ర, ఇంద్ర.
సూర్య, సూర్య, సూర్య, సూర్య, సూర్య.
మొదటి రొండు పాదాల గణాలు పై విధంగా ఉంటాయి. అలాగే తర్వాతి రొండు పాదాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఒక పద్యం చూద్దామా?
వేషధారినెపుడు విశ్వసింపగరాదు
వేషదోషములొక విధయె యగును
రట్టుకాదె మునుపు రావణు వేషంబు
విశ్వదాభిరామ వినురవేమ!
వేష బాషలను చూసి భ్రమ పడవద్దు అని చెప్తున్నాడు వేమన.
మొదటి పాదం లో.. వేష, ధారి, నెపుడు...అనేవి మూడు సూర్య గణాలు కదా..(UI, UI, III).. విశ్వసిం. పగరాదు.. అనేవి. ఇంద్ర గణాలు.. కదా.. ( UIU...IIUI...) ర గణం, సల.. అనేవి సరిపోయాయి. అలాగే.. రొండవ పాదం లో.. చూద్దాము.
వేష, దోష, ములొక,విధయె, యగును. ఇవన్నీ సూర్య గణాలే కదా...(UI, UI, III, III, III) కాబట్టి రొండో పాదం సరి పోయింది కదా.. ఇలాగే ౩, ౪ పాదాలు చూడండి.
ఆటవెలది సులభంగా రాయాలంటే ఎలా అనే విషయం రేపటి టపా లో చూద్దాము.