• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

13, జులై 2010, మంగళవారం

సీస పద్యం.

మనం పాట లాగా పాడుకోవడానికి బాగా వీలుండే పద్యం సీసమే! పూర్వం పౌరాణిక నాటకాలలో, ఇలాంటి సీసాలు ఎక్కువ గా ఉండేవి. ఇంకా రాయడం సులువు. మళ్ళీ, ఇంటి పేర్లు, పేర్లు కష్టమైన గురు లఘువులు ఉన్నవి, అన్నీ ఇందులో సులభంగా ఇమిడి పొయ్యే పద్యం ఇది. బాగా ప్రాక్టీసు చేసుకుంటే అన్ని విధాల ఉపయోగ పడుతుంది. ఇది కూడా ఇంద్ర, సూర్య గణాలు లతో ఉండేదే కాబట్టి, ఆటవెలది, తేట గీతి లాగ ఆడుకుంటూ పాడుకుంటూ రాసెయ్యొచ్చు.

ఈ పద్యం లో, నాలుగు పెద్ద పాదాలు ఉంటాయి. ఆ నాలుగు పెద్ద పాదాలనూ..మళ్ళీ నాలుగు పెద్ద పాదాలుగా, నాలుగు చిన్న పదాలుగా విడగొట్టి రాస్తారు.

దీని స్వరూపం ఇలా ఉంటుంది.

ఒకటో పాదం .... ఇంద్ర - ఇంద్ర - ఇంద్ర - ఇంద్ర - పెద్ద పాదం.
రెండో పాదం.. ఇంద్ర - ఇంద్ర - సూర్య - సూర్య- చిన్న పాదం.

మూడు నాలుగూ... ఐదూ ఆరూ... ఏడు ఎనిమిదీ.. పదాలు వరుసగా ఉంటాయి. ఇలాగే..
ప్రతి చిన్న పాదం లోని మొదటి గణం మొదటి అక్షరానికీ.. మూడవ గణం మొదటి అక్షరానికీ యతి చెల్లాలి. ప్రాస యతి కూడా చెల్లుతుంది. ఈ పద్యానికి ప్రాస నియమము లేదు.
పై సీస పద్యం రాసిన తర్వాత దాని కింద ఒక తేటగీతి లేక, ఒక ఆట వెలది ని గానీ రాయాలి. అప్పుడే.. సీసం పూర్తి అయినట్టు లెక్క. ఇలా రాయడాన్ని ఎత్తు గీతి అంటారు.
ఇక ఒక పద్యానికి గణ విభజన చేసి చూద్దామా.. స్వస్తి.

3 కామెంట్‌లు:

కౌటిల్య చెప్పారు...

ఒకటో పాదం .... ఇంద్ర - ఇంద్ర - ఇంద్ర - ఇంద్ర - పెద్ద పాదం.
రెండో పాదం.. ఇంద్ర - పై - పద్యం - రాసిన. - చిన్న పాదం....
ఇది కొంచెం అర్థం కాలేదు..దయచేసి అర్థమయ్యేట్టు వివరించరూ..

Dr.Tekumalla Venkatappaiah చెప్పారు...

కౌటిల్య గారూ.. ఇది కేవలం ప్రారంభం మాత్రమే! మనం వివరంగా గణ విభజన చేసి చూసినప్పుడు ఇలాంటి సందేహాలు రావనే తలుస్తాను. తప్పక మీరు కోరిన విధంగా నిదానంగానే వెళ్దాము.మీరు ఇంత శ్రద్ధగా నేర్చుకుంటుంటే.. తొందరేమీ లేదు. మీరు కోరిన విధంగానే వివరంగా చెప్తాను. సందేహాలుంటే అడగండి.సెలవు.

Dr.Tekumalla Venkatappaiah చెప్పారు...

నిన్న రొండవ పాదం గురించి రాయడంలో చిన్న ముద్రా రాక్షసం దొర్లింది. సరి చేసాను. గమనించగలరు.