• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

19, జులై 2010, సోమవారం

తిట్టు కవిత్వం

తెలుగు దనం వారి సౌజన్యం తో తెలుగు లో తిట్టు కవిత్వం గురించి ఇస్తున్నాను.
లలిత కళలలో అత్యంత విశిష్టమైనది కవిత్వం. ఇది అనేక విధాలుగా రంజింపజేస్తుంది. ఆశుకవిత్వం, చిత్ర కవిత్వం, మధుర కవిత్వం, విస్తర కవిత్వం, శాస్త్ర కవిత్వం, తిట్టు కవిత్వం అను అనేక రూపాల్లో కవిత్వం చెప్పబడుతున్నది. వీటిలో తిట్టు కవిత్వం యొక్క స్థానం ప్రత్యేకమైనది. ఆదికవి వాల్మీకి వాక్కు నుంచి ఆవిర్భవించిన మొట్టమొదటి కవిత్వం తిట్టు కవిత్వం కవిత్వమంటే ఆశ్చర్యం కలగకమానదు.
మానిషాద ప్రతిష్ఠాం త్వ, మగమ శ్శాశ్వతీ స్సమా:యత్క్రౌచ మిథునా దేక, మవధీ: కామ మోహితం"
క్రౌంచ మిధునములో నొకదానిని గూలనేసిన నిషాదుని చూసి వాల్మీకి తిట్టిన తిట్టు, శోకంతో బహిర్గతమైంది. దీనినే దూషణ కవిత, నిందాహేళన కవిత అని కూడా అంటారు. సాధారణంగా ఈ కవిత్వం ఆవేశపూరితంగా ఉంటుంది. తెలుగులో తిట్టు కవిత్వం చాటుపద్య రూపంగానూ, గ్రంధస్థ కుకవినిందాది రూపముగాను భాసిస్తున్నది. తిట్టుకవుల పద్యాలు చాలావరకు చాటువులుగానే ఉన్నాయి.
పల్లెల్లోనూ, పట్టణాలలోనూ కొందరు ముదుసళ్ళు అలవోకగా చెప్పే అనేక చాటుపద్యాల్లో తిట్టు కవిత్వం సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. 12వ శతాబ్దానికి చెందిన వేములవాడ భీమకవి తిట్టు కవిత చెప్పడంలో దిట్ట. ఇతడు శ్రీనాధ కవిచే ప్రశంశించబడినవాడు. భీమన తిట్టు కవితలో తెలుగులో ఆదికవి.
"గొప్పలు చెప్పుకొంచు నను గూటికి బంక్తికి రాకుమంచు నీత్రిప్పుడు బాపలందరును దిట్టిరి కావున నొక్కమారు నీయప్పములన్ని కప్పలయి యవ్నము సున్నముగాగ మారుచున్బప్పును శాకముల్ పులుసు పచ్చడులుం జిరురాలు గావుతన్"
అని తనని ముండ కొడుకంటూ భోజనానికి రానివ్వని పెద్దని తిడుతూ ఆ భోజన పదార్ధాలను చూసి పద్యం చెప్పాడు. 13వ శతాబ్దానికి చెందిన ఖడ్గ తిక్కన యుద్ధ రంగమునుండి పారిపోయి ఇంటికి రావడంతో అతని భార్య చానమ్మ అతని స్నానానికి మంచం అడ్డుపెట్టి పసుపు ఉండ పెట్టడంతో ఇదేమిటని అడిగిన భర్తతో ఆమె ..
"పగరకు వెన్నిచ్చినచో, నగరే నిను మగతనంపు నాయకులెల్లన్ముగురాడువారమైతిమి, వగపేటికి జలకమాడ వచ్చినచోటన్" అంది.
ఆ ఇల్లాలు చెప్పిన సమాధానం సుతిమెత్తని తిట్టు కవితగా లోక ప్రచారమైనది. స్ఫూర్తిదాయకమైనది కూడా.
వేములవాడ భీమకవి తరువాత తిట్టు కవిత్వంలో ఉద్దండత చూపిన వాడు 14-15 శతాబ్దాలకు చెందిన శ్రీనాధుడు. పల్నాటి సీమలో జొన్న కూడుతప్ప వరి అన్నం దొరకని పరిస్థితి ఏర్పడడంతో ....
"జొన్నకలి జొన్నయంబలి, జొన్నన్నము జొన్నపిసరు జొన్నలె తప్పన్సన్నన్నము సున్న సుమీ, పన్నుగ బల్నాటిసీమ ప్రజలందరికిన్" అని పరిహసించాడు.
పల్నాటి సీమలొనే త్రాగ నీరు లభించకపోవడంతో పరమశివుణ్ణి నిందిస్తూ...
"సిరిగల వానికి జెల్లును దరుణుల బదియారువేల దగ బెండ్లాడన్దిరిపమున కిద్దరాండ్రీ, పరమేశా! గంగ విడువు, పార్వతిచాలున్" అన్నాడు.
శ్రీనాధుని తర్వాత 16వ శతాబ్దానికి చెందిన తెనాలి రామకృష్ణుడు అత్యంత సమర్ధుడైన తిట్టు కవి, చాటుకవి. ఇతడు హాస్య కవితా సామ్రాజ్యాధిపతి. వికటకవిగా ఈయన ఆంధ్ర దేశంలోని ఆబాల గోపాలానికీ చిరపరిచితుడు. రాయల వారి ఆస్థానమునకు వచ్చిన బట్టు కవి ఆస్థాన పండితుల సామర్ధ్యానికి పరీక్ష పెడుతూ ....
"కుంజర యూధంబు దోమకుత్తుకజొచ్చెన్"
అని సమస్యనీయగా రామకృష్ణుడు వెంటనే ....
"గంజాయి త్రాగి తురకల సంజాతులగూడి కల్లు చవిగొన్నావా?లంజెల కొడకా! యెక్కడ, కుంజర యూధంబు దోమకుత్తుకజొచ్చెన్" అని పూరించాడు. ఐతే రాయలవారు యిది సరియైన పూరణ పద్ధతి కాదని మందలించడంతో రామకృష్ణుడు "పెద్దనాది మహా కవులకు బట్టు కవి ఇటువంటి సమస్యనివ్వడంతో అట్లు పూరించితిని. వీనికీ పూరణమే సరియైనది" అని బదులిచాడు. వెంటనే రాయలు ఐతే ఆ సమస్య నేనే యిస్తే ఏవిధంగా పూరిస్తావు?" అనడంతో రామకృష్ణుడు....
"రంజనచెడి పాండవులరి, భంజనులై విరటుగొల్వ బాల్పడి రకటా!సంజెయ! యేమని చెప్పుదు, గుంజర యూధంబు దోమ కుత్తుకజొచ్చెన్"
అని పూరించి రాయల వారి అనుగ్రహాన్నీ, అభినందనలనూ పొందాడు.
ఈ కోవలోనే కాలము, కర్తృత్వము తెలీని తిట్టు పద్యం తప్పులెన్నువారి గూర్చినది...
"నక్కలు బొక్కలు వెదకును, నక్కరతో నూరబంది యగడిత వెదకున్కుక్కలు చెప్పులు వెదకును, దక్కడి నా లంజెకొడుకు తప్పే వెదకున్".
అబద్ధాలాడువాని గూర్చిన హేళనతో కూడిన పద్యం....
"ఆడినమాటలు దప్పిన, గాడిదకొడుకంచు దిట్టగా వినియయ్యో!వీడా నా కొక కొడుకని, గాడిద యేడ్చెంగదన్న ఘనసంపన్నా!"
లోభిని గూర్చిన తిట్టు పద్యం ...
తిట్టిన రోసముంబడడు దీవనయిచ్చిన సంతసింప డాకట్టిడి లోభి కెంత యధికారము గల్గిననేమి? లేకయేబెట్టుగ నున్న నేమి? నడపీనుగుకున్ మణిభూషణంబులన్ బెట్టిన న్సరియె మెచ్చునొ నొచ్చునొ కాళికేశ్వరీ!"
తిట్టు కవిత్వంతోనే సంతృప్తి చెందని కొందరు కవులు తిట్టు గ్రంధాలను సైతం రచించి ఆ వాజ్ఙయముకు శాశ్వత స్థానాన్ని కల్పించారు. తిట్టు కావ్యాలకే అధిక్షేప కావ్యములని పేరు. ఇవి ఒక వ్యక్తి లేదా ఒక సంఘం యొకా దోషాలను యెత్తి చూపుతాయి. వీటిలో అధికంగా వచ్చినవి శతకాలు. పలు శతకాల్లో తిట్టు కవిత్వం కలదు. తెలుగు శతకాలాలొ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందిన సుమతీ శతకంలో అనేక తిట్టు పద్యాలు కలవు.
"అల్లుని మంచితనంబును, గొల్లని సాహిత్య విద్య కోమలి (టి) నిజమున్బొల్లున దంచిన బియ్యము, తెల్లని కాకులుని లేవు తెలియర సుమతీ"
అనే పద్యం ఒక ఉదాహరణ మాత్రమే. వేమన తిట్టు పద్యాలలో ప్రముఖ స్థానం వహించాడనడంలో ఎవరికీ అభ్యంతరం లేదు. ఇతని తిట్టు కవిత హాస్య గర్భితమై ఉంటుంది. "తలలు బోడులైనా తలపులు బోడులౌనా", "తల్లి శూద్రురాలు తానెట్లు బాపడు", "మంత్ర జలముకన్న మంగలి జలమెచ్చు" వంటి పద్యాలలో ఎంతో సందేశముంది. 17వ శతాబ్దికి చెందిన చౌడప్ప కవి తిట్టు కవిత్వంలో దిట్టగా పేరెన్నికగన్నవాడు. వేమన ఆటవెలదిలో ఏల అందెవేసిన చెయ్యో చౌడప్ప కందములో అంతటి ప్రతిభాశాలి. చౌడప్ప తన శతకములో బూతులు, శృంగారాల గురించిన అనేక పద్యాలు వ్రాశాడు. "పది నీతులు పది బూతులు, పది శృంగారములు గల్గు పద్యములు సభన్ జదివినవాడే యధికుడు....", "నీతులకేమి యొకించుక, బూతాడక దొరకు నవ్వు పుట్టదు" అని తన ఉద్దేశాన్ని బహిరంగంగా చాటాడు.
చౌడప్ప పద్యాలలో మచ్చుకు కొన్ని...
"ఇయ్యగ నిప్పించంగల, యయ్యలకేగాక మీసమందరికేలా,
రొయ్యకు లేదా బారెడు....""ముండల కొడుకుల సంపద,
దండులకెగాని దానధర్మములకు రాకుండు..."
"లంజెలు రాకుండిన గుడి రంజిల్లదు ప్రజల మనసు రాజిల్లదురాలంజెలనేల సృజించెనొ, కంజుకుడు...""దినము లోపల నుత్తమ,
దినమే తద్దినము నాటి తిండికి సమమే...""బూతని నగుదురు కడుతమ, తాతలు ముత్తాత మొదలు తరతరముల వా'రే తీరున జన్మించి రొ...."తిట్టు కవిత్వం, పద్యాల వలనే తిట్ల దండకం కూడా తెలుగులో ప్రసిద్ధమైంది.
అధిక్షేప కృతుల రచనలో కందుకూరి వీరేశలింగం గారు కూడా పేరెన్నికగన్నవారు. అనేక ప్రహసనాలను వీరు రచించారు. అలాగే శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, వేలూరి శివరామ శాస్త్రి, వసురాయ కవి, తదితరులు తిట్టు కవిత్వాన్ని అందించి తెలుగు సాహిత్యంలో చెరగని ముద్ర వేశారు. తిట్టు కవిత్వాన్ని తిరుపతి వేంకట కవులు సైతం చెప్పారు. తిట్టు కవిత సాధారణంగా ఆశు కవితయే. ఆశు కవితకు ఆవేశం సాధారణ లక్షణం కావున తిట్టు కవితలో కూడా ఆవేశం ఉండడం సహజం. తిట్టు కవిత నేడు కూడా లేకపోలేదు. ఐతే తెలుగులో ఉన్న తిట్టు కవిత మరి ఏ ఇతర భాషలోనూ లేదు. తిట్టు కవితను కవితా వినోదంగా భావిస్తే ఇది అధిక్షేపణీయం కాదు.

4 కామెంట్‌లు:

పుష్యం చెప్పారు...

మంచి వ్యాసం వ్రాసారు. కర్తృత్వం తెలియని ఇంకొక తిట్టు పద్యం:
ఒక కవికి ఒక కోమటి రెండురూపాయలు మాత్రమే ఇచ్చి పొమ్మనమంటే ఇలా తిట్టాడుట

కం//
రెండిచ్చితి రెండిచ్చితి
మెండిచ్చితి పొమ్మటంచు మేలంబేలా
కండూయమాన దేహా
మండూకమువంటి కంఠ, మరిమరి శుంఠా!

Dr.Tekumalla Venkatappaiah చెప్పారు...

పుష్యం గారూ! నేను విన్నదాని ప్రకారం.. వేములవాడ భీమకవి ఒక కోమటి గురించి చెప్తూ.. "కోమటి కొక్కటిచ్చి, పది గొన్నను నష్తములేదు" అనగా.. అక్కడే ఉన్న ఇంకొక కవి. అరరే! వేములవాడ భీమకవీ! "కోమటికొక్కటియ్యక పదిగొన్నను నష్తము లేదు" అన్నాట్ట. ఇలాంటివి చాలా ఉన్నాయి. నాతో పాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ.. శెలవు.

Sai Praveen చెప్పారు...

మంచి వ్యాసం రాసారండి.
పద్యాలు పాదాల విభజనతో రాసి ఉంటే మరింత బాగుండేది. ధన్యవాదాలు.

Unknown చెప్పారు...

శ్రీ వేములవాడ భీమకవి జన్మవృత్తాంతం:

తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామమునకు 12 కిలోమీటర్ల దూరాన వేములవాడ అనే గ్రామము ఉంది. ఆ గ్రామంలో సోమనాథామాత్యుడను ఒక నియోగి బ్రాహ్మణుడుండెను. ఎంతకాలానికీ ఇతనికి సంతానము కలుగలేదు. సంతానము కోసం ఇతను ఐదుగురిని పెళ్ళాడాడు. శివభక్తిపరాయణుడై యజ్ఞయాగాలను చేస్తూ, ఎన్నో విధాలుగా పరమేశ్వరున్ని ఆరాధించాడు. ఎన్నో దానధర్మాలు చేశాడు. అయినా పుత్రలేమి బాధ మాత్రం తప్పలేదు ఇతనికి. ఇలా కాలం గడుస్తుండగా ఒకనాటిరాత్రి పరమేశ్వరుడు స్వప్నంలో దర్శనమిచ్చి “నీ మరణం తర్వాత నీకు పుత్రుడు కలుగుతాడు. అతని వల్ల నీకు పుణ్యలోకసిద్ధి కలుగుతుంది” అని చెప్పాడు. ఆనాటి నుంచి దిగులు మానేసి, సంతోషంగా కాలం గడిపి మరణించాడు. ఇతని ఐదుగురు భార్యలలో చివరి భార్య మాచెమ్మ. అందరిలోనూ చిన్న వయస్సు కలది. అమాయకురాలు. నిష్కల్మషమైన మనసు కలది, భర్తలాగా పరమేశ్వరుని మీద అపారమైన భక్తి కలది.

మరింత సమాచరం కోసం: http://shribheemalingeswaraswamy.blogspot.in/