• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

15, మార్చి 2012, గురువారం

అనంతుని ఛందో దర్పణం లో చెప్పిన ఛందస్సు లోని దశ దోషాలు

అనంతుని ఛందో దర్పణం లో చెప్పిన ఛందస్సు లోని దశ దోషాలు ఏమిటో చూద్దాము. 

అనంతుని ఛందో దర్పణం లో కొన్ని ముఖ్యమైన ఛందస్సు లోని 10 రకాలైన దోషాలను చెప్పాడు. అవి ఏమిటో వివరం గా చూద్దాము.


1. ఛందో భంగము (గణ భంగము):  గురువు బదులు లఘువు వేసినా.. లఘువు బదులు గురువు వేసినా ఈ రకమైన దోషం వస్తుంది.

2. యతి భంగము: యతి స్థలమునందు యత్యక్షరం లేకపొయినా..మైత్రి లేకున్నా..యతి స్థలం మారినా...యతి, మైత్రి గల అక్షరాలు గమనించక పొయినా.. అది యతిభంగమనబడును. 


3. విసంధి:  సంధి చేయవలసిన చోట.. సంధి చేయకపోతే అది విసంధి దోషమని అంటారు.

4. పునరుక్తము: ఒక శబ్దాన్ని మరల మరల ప్రయోగించడం, ఒకే అర్ధం వచ్చేట్టు ప్రయోగించడం.

ఉదా:  హిమాద్రి పర్వతము పైన అంటే... హిమద్రి లో పర్వతం ఉంది మళ్ళీ పర్వతం అని వాడకూడదు.  

అలా అని శ్రీనాధు వర్ణించు జిహ్వ జిహ్వ అంటే అది పునరుక్తి దోషం కానేరదు ఎందుకంటే..అటువంటి నాలుకే నాలుక అని అర్ధం వచ్చేట్టు చెప్పడం దోషం కాదు.

5. సంశయము: పద్య పాదాలలో అర్ధం సరిగ్గా చెప్పలేకపొయినా.. అర్ధం లో సంశయమున్నా.. సంశయ దోషము అంటారు.

6. అపక్రమము:  వరుస తప్పడమే అపక్రమము.
ఉదా:  బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు.. అంటూ.. లక్ష్మీ దేవి, సరస్వతీ దేవి, పార్వతీ దేవి అన రాదు...సరస్వతీ దేవి, లక్ష్మీ దేవి, పార్వతీ దేవి అని అనాలి.

7. వ్యర్ధము: అనుగుణముగా లేని కూడని మాటలు వాడిన.. "వ్యర్ధము" అనే దోషము కలుగుతుంది.

8. అపార్ధము:  సరి అయిన అర్ధము లేకుండా.. ప్రాస కోసమో.. యతి కోసమో సూన్య పదాలు వాడితే.. అపార్ధ దోషమంటారు. 

9.అపశబ్దము: వ్యాకరణం తో సంభందము లేకుండా...కుసంధి, దుస్సంధి వైరి సమాసాలు ఆగతికములగు సంస్కృత శబ్ద ప్రయోగాలు మొదలగు అప శబ్దములు కావ్యములందు ఉపయోగించరాదు.

10. విరోధము: ఉచితము కాని పద్ధతి లో.. ప్రకృతి కి విరుద్ధం గా వర్ణించ రాదు. ఉదా:  హైదరాబాదు నగరం లో బీచి వొడ్డున విహరిస్తున్నారు అని అన రాదు.

ఇవి కాక...

నిషిద్ధ గణము: పద్యములలో ఉదాహరణకు కంద పద్యం లో.. జగణం బేసి గణము గా వాడ రాదు. 

పదచ్చేద భంగము: ద్విపద, మంజరీ ద్విపద లలో పద పదములకు తెగ వలెను. అట్లు తెగని యడల..పదచ్చేద భంగము వస్తుంది.


12, మార్చి 2012, సోమవారం

దృత విలంబితము, మానిని, కవిరాజ విరాజితము


ఈ దృత విలంబితము జగతీ ఛందము లోని జన్యము అంటారు.
న, భ, భ, ర అనే నాల్గు గణాలూ..12 అక్షరాలు ఉంటాయి. 7 వ అక్షరం యతి స్తానం.ప్రాస నియమం ఉంది.
నన్నయ్య భట్టారకుని రచనల్లో ఈ దృత విలంబితము ఒక్కటే ఉంది. అది ఆది పర్వం చతుర్ధాశ్వాసం లో చివరి పద్యం.

త్రిభువనాంకు శ దీప్తి నిధీ! సమ
స్తభువనా శ్రయ  ధర్మ ధురంధరా!
శుభ యశ: పరిశోభిత పూర్వది!
క్పృభు విలాస! కృపారస బంధురా!

అని ఆశ్వాసాంతం లో రాజరాజ నరేంద్రుడిని కీర్తించాడు నన్నయ్య.


అలాగే నన్నయ్య చమత్కృతి ఇంకోతి చూద్దాము.

అరుదైన ప్రయోగాలైన మానిని, కవిరాజ విరాజితం అనే చందస్సులు చూద్దాము.

ఆది పర్వం లోనే.. ఒక "మానిని" వృత్తము చూద్దాము.


"ఏచి తనర్చి తలిర్చిన క్రోవుల నిమ్మగు ఠావుల జొంపములం
బూచిన మంచి యశో కములన్, సుర పొన్నల, బొన్నల, గేదగులం,
గాచి బెడంగుగ బండిన యా సహకారములం, గదళీ  తతులం
జూచుచు, వీనుల కింపెసగన్ వినుచున్ శుక కోకిల సుస్వరముల్!"

దుష్యంతో పాఖ్యానం లో పద్యం ఇది.  ఈ మనిని ప్రతి పాదం లో
7 భగణాలపైన ఒక గురువు వుంటుంది.  1-13-19 అక్షరాలకు  ఒక యతి
ప్రకారం 3 యతులు ఉంటాయి.  నన్నయ్య మాత్రం 13 వ అక్షరం మాత్రమే
యతి గా గ్రహించాడు.

విశేషం ఏమిటంటే...
మానినీ వృత్తపాదం లో మొదటి గురువును రొండు లఘువులుగా
మారిస్తే కవిరాజ విరాజితం అవుతుంది.  

చమత్కారం ఏమిటంటే.. చతుర్ధాశ్వాసం లో 20 వ పద్యం మానిని రాసి
21 వ పద్యం గా కవిరాజ విరాజితం రాయడమే.. 

చని చని ముందట నాజ్య హవిర్ధృత సౌరభ ధూమ లతాతతులం
బెనగిని మ్రాకుల కొమ్మలమీద నపేతలతాంతములైనను బా
యని మధుప ప్రకరంబుల జూచి జనాధిపుదెంతనెఱింగె దపో
వనమిది యల్లదె దివ్యమునీంద్రుని  నివాసము దానగు నంచు నెదన్.

ప్రతి చరణం లో 1 నగణం, 6 జగణాలు, 1 నగణం ఉంతాయి.
1-14-18-20 యతి స్తానాలుంటాయి. కనీ నన్నయ్య మాత్రం 14 వ స్తానం
యతిగా పరిగణించాడు.

మానినీ, కవి విరాజితాలు జంట గా వాడి.. శకుంతలా దుష్యంతుల
భావి కళ్యాణాన్ని సూచించాడేమో. అందుకే నన్నయ్యది అక్షర రమ్యత
అన్నారు. 



6, మార్చి 2012, మంగళవారం

మధ్యాక్కరలు - ఛందస్సు

చాలా కాలం తర్వాత మీ ముందుకు వస్తున్నందుకు క్షమించండి. ఇకపైన కనీసం నెలకు ఒకటి రొండు పోస్టింగులైనా పెడదామని అనుకుంటున్నాను.

మధ్యాక్కరలు - ఛందస్సు

కన్నడం లో ఈ ఛందస్సు ను "అక్షరలు" అంటారు. అదే తెలుగు లో "అక్కరలు" గా మారింది. "పాదే పాదే ప్రతి గణమపి యతిర్లక్ష్యతే సర్వేషాం మక్షరాణాం" అని చెప్పడం ద్వారా వీటిని మనం జానపదాలనుండి ఉద్భవించాయని చెప్పవచ్చు. ఈ అక్కరలలో చంద్ర గణాలు అక్కరకు వస్తాయి. చంద్ర గణాలు అంటే ఏమిటో ఇదివరలో తెలిసికొన్నాము.ఐతే "మధ్యాక్కర"లో మాత్రం చంద్ర గణాలు రావు. ఇవి చాల ప్రాచీనమైన శాసనాల్లో కూడా లభిస్తున్నాయి. బెజవాడ యుద్ధమల్లుని శాససనం (క్రీ!శ!898-934) మధ్యాక్కర, వెంకయ చోడుని దొంగలసాని శాసనం లో (క్రీ!శ! 991 సం.) మహాక్కరలు లభ్యమౌతున్నాయి. బహుశా.. కన్నడం.. ఆంధ్ర ఒకే గొడుగు కింద ఉన్నప్పటి నుండీ ఈ "అక్కరలు" వ్యాప్తి లో ఉండి వుండ వచ్చు అని చరిత్ర కారులు భావిస్తున్నారు. ప్రాచీన కవుల్లో... నన్నయ్య, ఎర్రన వాడగా... అధునికుల్లో విశ్వనాథ మధ్యాక్కరలు చాలా సుప్రసిద్ధం గా నిలిచాయి.

చంద్ర గణాలు మళ్ళీ ఒక సారి మననం చేసికొందాము.

చంద్ర గణములు
భల = UIII
భగరు = UIIU
తల = UUII
తగ = UUIU
మలఘ = UUUI
నలల = IIIII
నగగ = IIIUU
నవ = IIIIU
సహ = IIIUI
సవ = IIUIU
సగగ = IIUUU
నహ = IIIUI
రగురు = UIUU
నల = IIII

ఈ అక్కరలు ఐదు విధాలుగా ఉన్నాయి. 1. మహాక్కర 2.మధురాక్కర 3.అంతరాక్కర 4.అల్పాక్కర మరియూ 5. అత్యంత ప్రసిద్ధి గాంచిన మధ్యాకరలు.

1. మహాక్కరలో ... 1 సూర్యగణం, 5 ఇంద్ర గణాలూ, 1 చంద్ర గణమూ.. కలిపి మొత్తం 7 గణాలు ఉంటాయి.యటి నాలుగు గణముల మీద ఉంటుంది. ప్రాస నియమం ఉంది.

వారి జాప్తుండు పంచేంద్ర గుణములు వనజారి యునుగూడి వెలయుచుండ.
UI UUI UUI IIII IIUI IIUI IIIUI

పై విధంగా ఉంటుంది.

2. మధురాక్కరలో ... 1 సూర్యగణం, 3 ఇంద్ర గణాలూ, 1 చంద్ర గణమూ.. కలిపి మొత్తం 5 గణాలు ఉంటాయి.యతి మూడు గణముల మీద ఉంటుంది. ప్రాస నియమం ఉంది.

తనర జనకుండు నన్నప్ర దాతయు నుభయ త్రాత
III IIUI UUI UII IIIUI

పై విధంగా ఉంటుంది.

3. అంతరాక్కరలో ... 1 సూర్యగణం, 2 ఇంద్ర గణాలూ, 1 చంద్ర గణమూ.. కలిపి మొత్తం 4 గణాలు ఉంటాయి.యతి మూడవ గణము చివరి అక్షరం మీద ఉంటుంది. ప్రాస నియమం ఉంది.

ఇనుడొ కండును నింద్రులి ద్దరునునొక్క
III UII UIU IIII

పై విధంగా ఉంటుంది.

ఇక్క్డ ఒక తమాషా గమనించారా! దీనికీ తేటగీతి కీ పోలిక ఉంది.
యతి స్తానం గానీ ఒక్క అక్షరం ముందుకు జరిగిందా తేటగీటి ని పోలి ఉంటుంది.

4. అల్పాక్కరలో ... 2 ఇంద్ర గణాలూ, 1 చంద్ర గణమూ.. కలిపి మొత్తం 3 గణాలు ఉంటాయి.యతి రొండవ గణము మీద ఉంటుంది. ద్వితీయాక్షర ప్రాసతో ఉంది.

ఒగి నిద్దరింద్రులు నొక విధుడు
నెగడు నల్పాక్కర నియతి తోడ.

పై విధంగా ఉంటుంది.

చివరి పాదం సీస పద్య ఉత్తరార్ధము వలె ఉంది కదా!

5. మధ్యాక్కరలో ... 2 ఇంద్ర గణాలూ,1 సూర్య గణమూ..2 ఇంద్ర గణములూ మళ్ళీ 1 సూర్య గణమూ .. కలిపి మొత్తం 6 గణాలు ఉంటాయి.యతి మూడు గణము పై ఉంటుంది. ప్రాస ఉంది.

పై విధంగా ఉంటుంది.

మధ్యాక్కర విషంలో యతి విషయంలో కొంత స్పష్టత కనపడడం లేదు. నన్నపార్యుడు 4 గణములపైన అంటే పంచమగణాద్యక్షర యతి పాటించగా..ఎర్రన చతుర్ధ గణాద్యక్షర యతి పాటించడం విశెషం. ఎర్రన యతి గేయ ఛందో వైఖరి అంటారు .

ఈపురు షుండని స్త్రీయు నిద్దరే ఇంతియు బతియు

ఇం ఇం సూ ఇం ఇం సూ

విశ్వనాధ మధ్యాక్కరలలో గమనిస్తే ...

తిరుపతికింబోయి యొడలి నగలెల్ల దీసి ఇచ్చెదరు

అనే పాదం లో నన్నయ వలె ఐదవ గణము ప్రధమాక్షరం యతి గా పాటించడం గమనార్హం!

కాబట్టి యతి విషయంలో ఖచ్చితం గా వ్యవహరించలేకపోతున్నాము.

"అక్కర" విషయంలో ప్రొఫెసర్ కోవెల సంపత్కుమారాచార్య విశేష కృషి చేసారు. వారి అనుభవాలను ఉదాహరణలను నేను కొన్ని పైన పేర్కోనడం జరిగింది.

పోస్టింగు మీకు నచ్చిందా! తెలియజేస్తారుగా...