చాలా కాలం తర్వాత మీ ముందుకు వస్తున్నందుకు క్షమించండి. ఇకపైన కనీసం నెలకు ఒకటి రొండు పోస్టింగులైనా పెడదామని అనుకుంటున్నాను.
మధ్యాక్కరలు - ఛందస్సు
కన్నడం లో ఈ ఛందస్సు ను "అక్షరలు" అంటారు. అదే తెలుగు లో "అక్కరలు" గా మారింది. "పాదే పాదే ప్రతి గణమపి యతిర్లక్ష్యతే సర్వేషాం మక్షరాణాం" అని చెప్పడం ద్వారా వీటిని మనం జానపదాలనుండి ఉద్భవించాయని చెప్పవచ్చు. ఈ అక్కరలలో చంద్ర గణాలు అక్కరకు వస్తాయి. చంద్ర గణాలు అంటే ఏమిటో ఇదివరలో తెలిసికొన్నాము.ఐతే "మధ్యాక్కర"లో మాత్రం చంద్ర గణాలు రావు. ఇవి చాల ప్రాచీనమైన శాసనాల్లో కూడా లభిస్తున్నాయి. బెజవాడ యుద్ధమల్లుని శాససనం (క్రీ!శ!898-934) మధ్యాక్కర, వెంకయ చోడుని దొంగలసాని శాసనం లో (క్రీ!శ! 991 సం.) మహాక్కరలు లభ్యమౌతున్నాయి. బహుశా.. కన్నడం.. ఆంధ్ర ఒకే గొడుగు కింద ఉన్నప్పటి నుండీ ఈ "అక్కరలు" వ్యాప్తి లో ఉండి వుండ వచ్చు అని చరిత్ర కారులు భావిస్తున్నారు. ప్రాచీన కవుల్లో... నన్నయ్య, ఎర్రన వాడగా... అధునికుల్లో విశ్వనాథ మధ్యాక్కరలు చాలా సుప్రసిద్ధం గా నిలిచాయి.
చంద్ర గణాలు మళ్ళీ ఒక సారి మననం చేసికొందాము.
చంద్ర గణములు
భల = UIII
భగరు = UIIU
తల = UUII
తగ = UUIU
మలఘ = UUUI
నలల = IIIII
నగగ = IIIUU
నవ = IIIIU
సహ = IIIUI
సవ = IIUIU
సగగ = IIUUU
నహ = IIIUI
రగురు = UIUU
నల = IIII
ఈ అక్కరలు ఐదు విధాలుగా ఉన్నాయి. 1. మహాక్కర 2.మధురాక్కర 3.అంతరాక్కర 4.అల్పాక్కర మరియూ 5. అత్యంత ప్రసిద్ధి గాంచిన మధ్యాకరలు.
1. మహాక్కరలో ... 1 సూర్యగణం, 5 ఇంద్ర గణాలూ, 1 చంద్ర గణమూ.. కలిపి మొత్తం 7 గణాలు ఉంటాయి.యటి నాలుగు గణముల మీద ఉంటుంది. ప్రాస నియమం ఉంది.
వారి జాప్తుండు పంచేంద్ర గుణములు వనజారి యునుగూడి వెలయుచుండ.
UI UUI UUI IIII IIUI IIUI IIIUI
పై విధంగా ఉంటుంది.
2. మధురాక్కరలో ... 1 సూర్యగణం, 3 ఇంద్ర గణాలూ, 1 చంద్ర గణమూ.. కలిపి మొత్తం 5 గణాలు ఉంటాయి.యతి మూడు గణముల మీద ఉంటుంది. ప్రాస నియమం ఉంది.
తనర జనకుండు నన్నప్ర దాతయు నుభయ త్రాత
III IIUI UUI UII IIIUI
పై విధంగా ఉంటుంది.
3. అంతరాక్కరలో ... 1 సూర్యగణం, 2 ఇంద్ర గణాలూ, 1 చంద్ర గణమూ.. కలిపి మొత్తం 4 గణాలు ఉంటాయి.యతి మూడవ గణము చివరి అక్షరం మీద ఉంటుంది. ప్రాస నియమం ఉంది.
ఇనుడొ కండును నింద్రులి ద్దరునునొక్క
III UII UIU IIII
పై విధంగా ఉంటుంది.
ఇక్క్డ ఒక తమాషా గమనించారా! దీనికీ తేటగీతి కీ పోలిక ఉంది.
యతి స్తానం గానీ ఒక్క అక్షరం ముందుకు జరిగిందా తేటగీటి ని పోలి ఉంటుంది.
4. అల్పాక్కరలో ... 2 ఇంద్ర గణాలూ, 1 చంద్ర గణమూ.. కలిపి మొత్తం 3 గణాలు ఉంటాయి.యతి రొండవ గణము మీద ఉంటుంది. ద్వితీయాక్షర ప్రాసతో ఉంది.
ఒగి నిద్దరింద్రులు నొక విధుడు
నెగడు నల్పాక్కర నియతి తోడ.
పై విధంగా ఉంటుంది.
చివరి పాదం సీస పద్య ఉత్తరార్ధము వలె ఉంది కదా!
5. మధ్యాక్కరలో ... 2 ఇంద్ర గణాలూ,1 సూర్య గణమూ..2 ఇంద్ర గణములూ మళ్ళీ 1 సూర్య గణమూ .. కలిపి మొత్తం 6 గణాలు ఉంటాయి.యతి మూడు గణము ల పై ఉంటుంది. ప్రాస ఉంది.
పై విధంగా ఉంటుంది.
మధ్యాక్కర ల విషంలో యతి విషయంలో కొంత స్పష్టత కనపడడం లేదు. నన్నపార్యుడు 4 గణములపైన అంటే పంచమగణాద్యక్షర యతి పాటించగా..ఎర్రన చతుర్ధ గణాద్యక్షర యతి పాటించడం విశెషం. ఎర్రన యతి గేయ ఛందో వైఖరి అంటారు .
ఈపురు షుండని స్త్రీయు నిద్దరే ఇంతియు బతియు
ఇం ఇం సూ ఇం ఇం సూ
విశ్వనాధ మధ్యాక్కరలలో గమనిస్తే ...
తిరుపతికింబోయి యొడలి నగలెల్ల దీసి ఇచ్చెదరు
అనే పాదం లో నన్నయ వలె ఐదవ గణము ప్రధమాక్షరం యతి గా పాటించడం గమనార్హం!
కాబట్టి యతి విషయంలో ఖచ్చితం గా వ్యవహరించలేకపోతున్నాము.
ఈ "అక్కర"ల విషయంలో ప్రొఫెసర్ కోవెల సంపత్కుమారాచార్య విశేష కృషి చేసారు. వారి అనుభవాలను ఉదాహరణలను నేను కొన్ని పైన పేర్కోనడం జరిగింది.
ఈ పోస్టింగు మీకు నచ్చిందా! తెలియజేస్తారుగా...
3 కామెంట్‌లు:
ఆర్యా చాలా బాగున్నది. ఈ వివరాలను తెలుగు వికీ ఛందస్సు పేజీలో కూడా పొందు పరిస్తే ఆసక్తి కలవారికి ఉపయోగంగా ఉంటుంది.
🙏
బెజవాడ శాసనం లో గల పద్యాల ఏవి
కామెంట్‌ను పోస్ట్ చేయండి