• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

15, మార్చి 2012, గురువారం

అనంతుని ఛందో దర్పణం లో చెప్పిన ఛందస్సు లోని దశ దోషాలు

అనంతుని ఛందో దర్పణం లో చెప్పిన ఛందస్సు లోని దశ దోషాలు ఏమిటో చూద్దాము. 

అనంతుని ఛందో దర్పణం లో కొన్ని ముఖ్యమైన ఛందస్సు లోని 10 రకాలైన దోషాలను చెప్పాడు. అవి ఏమిటో వివరం గా చూద్దాము.


1. ఛందో భంగము (గణ భంగము):  గురువు బదులు లఘువు వేసినా.. లఘువు బదులు గురువు వేసినా ఈ రకమైన దోషం వస్తుంది.

2. యతి భంగము: యతి స్థలమునందు యత్యక్షరం లేకపొయినా..మైత్రి లేకున్నా..యతి స్థలం మారినా...యతి, మైత్రి గల అక్షరాలు గమనించక పొయినా.. అది యతిభంగమనబడును. 


3. విసంధి:  సంధి చేయవలసిన చోట.. సంధి చేయకపోతే అది విసంధి దోషమని అంటారు.

4. పునరుక్తము: ఒక శబ్దాన్ని మరల మరల ప్రయోగించడం, ఒకే అర్ధం వచ్చేట్టు ప్రయోగించడం.

ఉదా:  హిమాద్రి పర్వతము పైన అంటే... హిమద్రి లో పర్వతం ఉంది మళ్ళీ పర్వతం అని వాడకూడదు.  

అలా అని శ్రీనాధు వర్ణించు జిహ్వ జిహ్వ అంటే అది పునరుక్తి దోషం కానేరదు ఎందుకంటే..అటువంటి నాలుకే నాలుక అని అర్ధం వచ్చేట్టు చెప్పడం దోషం కాదు.

5. సంశయము: పద్య పాదాలలో అర్ధం సరిగ్గా చెప్పలేకపొయినా.. అర్ధం లో సంశయమున్నా.. సంశయ దోషము అంటారు.

6. అపక్రమము:  వరుస తప్పడమే అపక్రమము.
ఉదా:  బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు.. అంటూ.. లక్ష్మీ దేవి, సరస్వతీ దేవి, పార్వతీ దేవి అన రాదు...సరస్వతీ దేవి, లక్ష్మీ దేవి, పార్వతీ దేవి అని అనాలి.

7. వ్యర్ధము: అనుగుణముగా లేని కూడని మాటలు వాడిన.. "వ్యర్ధము" అనే దోషము కలుగుతుంది.

8. అపార్ధము:  సరి అయిన అర్ధము లేకుండా.. ప్రాస కోసమో.. యతి కోసమో సూన్య పదాలు వాడితే.. అపార్ధ దోషమంటారు. 

9.అపశబ్దము: వ్యాకరణం తో సంభందము లేకుండా...కుసంధి, దుస్సంధి వైరి సమాసాలు ఆగతికములగు సంస్కృత శబ్ద ప్రయోగాలు మొదలగు అప శబ్దములు కావ్యములందు ఉపయోగించరాదు.

10. విరోధము: ఉచితము కాని పద్ధతి లో.. ప్రకృతి కి విరుద్ధం గా వర్ణించ రాదు. ఉదా:  హైదరాబాదు నగరం లో బీచి వొడ్డున విహరిస్తున్నారు అని అన రాదు.

ఇవి కాక...

నిషిద్ధ గణము: పద్యములలో ఉదాహరణకు కంద పద్యం లో.. జగణం బేసి గణము గా వాడ రాదు. 

పదచ్చేద భంగము: ద్విపద, మంజరీ ద్విపద లలో పద పదములకు తెగ వలెను. అట్లు తెగని యడల..పదచ్చేద భంగము వస్తుంది.


1 కామెంట్‌:

శ్యామలీయం చెప్పారు...

చాలా సంతోషం అండీ. మంచి మంచి విషయాలు వ్రాసారు.

కావ్యదోషాల గురించి కూడా దయచేసి వ్రాయండి.