ఈ కార్తీక మాస సందర్భంగా శ్రీనాధమహాకవి రాసిన "శ్రీ కాశీ ఖండం" లోని 'కాశీ తీర్ధ మహిమ ' ను గురించి కొంత చెప్పుకోవడం శుభదాయకమూ.. పుణ్యదాయకం గా భావిస్తున్నాను. కాశీఖండం..అయ:పిండం అంటారు. అంత కష్టతరమైన నారికేళ పాకం లా భావిస్తారు.అయినా నాకు తోచిన రీతిలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. పెద్దలు తప్పులుంటే చెప్పి మార్గ దర్శనం చేయ ప్రార్ధన.
కాశీ తీర్ధ మహిమ - కాశీ ఖండము - సప్తమాశ్వ్వాసము
విశ్వనాధుండు లింగంబు శాశ్వతుండు
కలుగనీ! తీర్ధములు కోట్లు కాశి యందు
ననఘ! మణికర్ణికయ తీర్ధమని యెఱుంగు.(113)
తా. ఓ పాప రహితుడా! కాశీలో కోట్ల కొలది శివలింగములు ఉండవచ్చు గాక! విశ్వేశ్వరుడే లింగము.
కాశీలో కోట్ల కొలది తీర్ధములు ఉండవచ్చు గాక! మణికర్ణికయే తీర్ధమని తెలిసికొనవలెను.
కం. సేవ్యుడు విశ్వేశుడు స్నా
తవ్యము మణికర్ణి కాహ్రద జలౌఘము శ్రో
తవ్యంబులు శంభు కధా
దివ్యపురాణములు కాశి తీర్ధమునందున్!(114)
స్నాతవ్యము = స్నానమాడదగినది; మణికర్ణికా హ్రదజలౌఘము = మణికర్ణికా హ్రదమునందలి నీటి యొక్క సమూహము ..ప్రవాహమూను.స్రోతవ్యంబులు = వినదగినవి; శంభుకధా దివ్య పురాణములు = శివుని యొక్క గొప్పవైన పురాణాదులు.
తా. కాశీ తీర్ధమందు సేవించదగిన దైవము ఈశ్వరుడొక్కడే! స్నానమాడదగినది మణికర్ణికా ఘట్టము మాత్రమే! వినదగినవి శివుని యొక్క పురాణ గాధలు మాత్రమే!
సీ! వసియింప వలయు యవజ్జీవ మనురక్తి
పరత వారాణశీ పట్టణమున
జక్ర పుష్కరిణి నిచ్చలు దీర్ధమాడంగ
వలయు సంకల్ప పూర్వకము గాగ
నర్చింపవలయు గంధాక్షతంబుల బుష్ప
ఫల పత్రముల విశ్వపతి మహేశు
నిలుపంగ వలయును నెఱసు పాటిలకుండ
నాత్మ ధర్మ స్వవర్ణాశ్రమముల
తే!గీ! స్నాన మహీమంబు భక్తి తాత్పర్యగరిమ
వినగ వలయు బురాణార్ధ విదులవలన
దన యధాశక్తి వలయును దానమిడగ
గాశి గైవల్య మిన్నింట గాని లేదు.(115)
తా. శరీరములో జీవుడున్నన్ని నాళ్ళూ.. అనురాగ పరాయణత్వముతో వారణాసి యందు జీవింపవలెను. ఎల్లప్పుడూ సంకల్ప పూర్వకముగా మణికర్ణికా ఘట్టమునందు స్నానము ఆచరించవలెను. కాశీ విశ్వేశ్వరుని గంధాక్షతలతోనూ..ఫల పత్ర పుష్పములతోనూ పూజించవలెను. ఆత్మ ధర్మములైన శమదమాదులయందును,తనకు విహితములైన వర్ణ ధర్మములందునూ, తనకు విహితములైన వర్ణ ధర్మములయందునూ,ఆశ్రమ ధర్మములయందు, దోషలేశము దొర్లకుండా నడుపుకొనవలను. బహుపురాణ వేత్తలైన పెద్దల ద్వారా భక్తి తాత్పర్యాదులతోగూడి స్నానమహిమ వినవలెను. తనశక్తి మేరకు దాన ధర్మములు చేయవలెను. ఇన్నిటి ద్వారా మాత్రమే కాశీ యందు కైవల్యము లభించును.
తే!గీ! యాత్ర విధ్యుక్త సరణి జేయంగవలయు
వలయు బరివార క్షేత్ర దేవతల గొలువ
వలదు బొంకంగ; వలదు జీవముల కలుగ
వలదు నగి యైన బర మర్మములు వచింప.(116)
యాత్రను = కాశీ యాత్రను; విధ్యుక్త సరణి -- విధి = శాస్త్రమునందు,
ఉక్త = చెప్పబడిన, సరణిన్ = మార్గముననుసరించి, నగియైన = హాస్యమునకైనా,
బరమర్మములు = ఇతరుల రహస్యములు, వచింప = బయట పెట్టరాదు - చెప్పరాదు.
తా. శాస్త్రోక్త విధానము ననుసరించి కాశీ యాత్ర సాగించవలెను.పరివార దేవతలను, క్షేత్ర దేవతలను పూజింపవలెను.అసత్యములు పలుకరాదు. జీవహింస చేయరాదు. పరిహాసమునకైనను పర మర్మ, కర్మలను బయట పెట్ట రాదు.
మిగతా పద్యాలు వచ్చే పోస్టింగులలో చూద్దాము. స్వస్తి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి