మనం సాధారణం గా యతి కుదరనప్పుడు కొన్ని పద్యాలలో (అనుమతించిన పద్యాల మేరకు) ప్రాస యతిని వాడుతూ ఉంటాము. అలాగే ప్రాస కుదరనప్పుడు కూడా ప్రాస కుదిరే పదాలకోసం వెదుకుతూ ఉంటాము. ఇందులో తప్పు లేదు. నన్నయ్య, తిక్కన, శ్రీనాధుని లా పద్యాలు రాయగలిగితే ఈ తిప్పలన్నీ దేనికి చెప్పండి.
అందుచేత అప్పుడప్పుడూ.. కొన్ని కొన్ని ప్రాసాక్షర పదాలనూ వాటి అర్ధాలనూ తెలిసికోవడం అవసరం కూడా.
ఈ రోజు "క" గుణింతానికి సంభందించి కొన్ని ప్రాస పదాలు చూద్దాము.
అంక = పక్క, టంక = వెలిగారము, కంక = తొళ్ళిక, బంక = జిగురు, లంక = దీవి, వంక = సాకు, శంక = జంకు.
అలాగే..అంకి = మద్దెల, కంకి = వరివెన్ను, పంకి = బురద, వంకి = బాకు, అలాగే..కంకు = గద్దించు, జంకు = బెదరు, టంకు = దండోరా, నంకు = యెగతాళి, బంకు = సందు, శంకు = మేకు, సంకు = శంఖము, అలాగే... అంకె = చిహ్నము, పంకె = దుష్టుడు,లంకె = లంకియ, ఉంకు = యెగరు, డుంకు = తగ్గు, నుంకు = పస్తు అలాగే.. కొంకి = వంపు చీల, బొంకి = పుర్రె, కొంకు = జంకు, డొంకు = ఇంకు, బొంకు = కల్లలాడడం, కింక = అలుక, చింక = కోతి, జింక = లేడి, డింక = చావు, దింక = మల్లబంధము, చెంక = చెంప, తెంక = భయము, మెంక = చింబోతు, లెంక = సేవకుడు, పెంకి = మొండి వాడు, డొంక = పొద, తొంక = తోక, దొంక = చువ్వలు లేని కిటికీ, లొంక = అడవి, అంకము = బడి, కంకము = గద్ద, టంకము = నాణెము, తంకము = యెడబాటు, పంకము = బురద, అంకిణి = మల్ల బంధము, పంకిణి = సుగంధ పాత్ర, లంకిణి = ఒక రాక్షసి, వంకిణి = ఒక బాకు, మంకెన = బంధు జీవనము, కంకర = మొరప రాయి, తంకర = పొల్లు, వంకర = వక్రము..
వీటిలో చాలా మటుకు మనం విన్నవే ఉంటాయి.. కానీ అవసరమైనప్పుడే గుర్తుకు రావు, ఘటోత్కచుని చంపేటంత వరకూ కర్ణునికి "శక్తి" ఆయుధము గుర్తుకు రానట్టుగా.. ఆవిషయం గుర్తుకు తెచ్చుకుని యుద్ధరంగం లో మాత్రం ఆవిషయం మర్చిపోయేవాడట. అదే మరి విధి వక్రించడం అంటే...ఈ విషయం ప్రస్తుతం.. అప్రస్తుతం అయినా అవసరానికి గుర్తు రాక పోతే ఏ విద్య కైనా పరమార్ధం ఏమిటి చెప్పండి?
స్వస్తి..మళ్ళీ మరుసటి పోస్టింగు వరకూ.....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి