క. ఇమ్ముల న ప్పురి వప్రము
కొమ్ములపై నుండి పురము కొమ్ములు వేడ్కన్
దమ్ముల చుట్టము పద జల
జమ్ములు పూజింతు రొగి నజస్రముఁ బ్రీతిన్. ||5||
క. పరువున మురువై యుండును
సురపురమునఁ గల్ప తరులు చూపఱకింపై;
పరువున మురువై యుండును
దురగంబు లయోధ్యఁ గల ప్రతోళికలందున్. ||6||
క. దాన గునమ్మున సురపురి
నే నాఁడును నమర రత్న మెన్నిక కెక్కున్;
దాన గుణంబున మిక్కిలి
యేనుఁగు లా పురములోన నెన్నిక కెక్కున్. ||7||
క. కవి గురు బుధ మిత్త్రాదులు
వివిధార్చనలను సురపురి వెలయుదు రెలమిన్;
గవి గురు బుధ మిత్త్రాదులు
వివి ధార్చనలం బురమున వెలయుదు రెపుడున్. ||8||
క. భోగానురాగ సంపద
భోగులు వర్తింతు రందు భూ నుత లీలన్;
భో గానురాగ సంపద
భోగులు వర్తింతు రిందు భూ నుత లీలన్, ||9||
సీ. ప్రకటాగ్ని హోత్ర సంపన్ను లౌదురు గాని
రమణీయ రుక్మ కారకులు గారు,
షుభ పవిత్రోజ్జ్వల సూత్ర ధారులు గాని
టక్కరి హాస్య నాటకులు గారు,
ఉభయ సంధ్యాది విధ్యుక్త కర్ములు గాని
చర్చింపఁగా నిషాచరులు గారు,
తిలమించి చూడ సద్ద్విజు లౌదురే కాని
తలఁపంగఁ బక్షి జాతములు కారు,
బాడబులు గాని యగ్ని రూపములు గారు,
పండితులు గాని విజ్ఞుల పగిదిఁగారు,
ధీవరులు గాని జాతి నిందితులు గారు,
పరమ పావను లా పురి ధరణి సురులు. ||10||
అష్టాదశ వర్ణనలలో...పుర వర్ణన అయ్యాక చాతుర్వర్ణముల వర్ణాన లో మొల్ల బ్రాహ్మణులు ఆ నగరంలో ఎలా ఉన్నదీ చెప్తోంది. ఆ నగరంలో బ్రాహ్మణులు సద్వర్తనులై నిత్యాగ్ని హోత్రులై సంధ్యాది విధులను నిత్యం నిర్వర్తిస్తూ వారి వారి నిత్య కర్మలను చేస్తూ ఆయూరిలో బ్రాహ్మణులు పరమ పావనులుగా ఉన్నారని మొల్ల చెప్తోంది.
ఇక ఈ అష్టాదశ వర్ణనల విషయానికొస్తే.. అష్టాదశ వర్ణనలు కన్నడం నుంచి నన్నెచోడుడు గ్రహించాడని అంటారు కొంతమంది. ఏది ఎమైనా.. ఈ అష్టాదశ వర్ణనలు వివరంగా తెలుసుకొవలసిన అవసరం ఎంతైనా ఉంది. అవి ఏమిటంటే..
1. పుర వర్ణన.
2. గిరి వర్ణన.
3. వన వర్ణన.
4. నది వర్ణన.
5. సముద్ర వర్ణన.
6. ద్యూత వర్ణన.
7. వివాహ వర్ణన.
8. విరహ వర్ణన.
9. యుద్ధ వర్ణన.
10. షడృతువుల వర్ణన.
11. ప్రాత: సంధ్యాకాల వర్ణన.
12. సూర్యోదయ సూర్యాస్తమాన వర్ణన.
13. మధుపాన వర్ణన.
14. రాయబార వర్ణన.
15. స్త్రీ వర్ణన.
16. బ్రాహ్మణాది చాతుర్వర్ణముల వర్ణన.
17. చతురంగ సైన్య వర్ణన.
18. వేదాంత విచారణ.
ప్రబంధము అనగానే... ఒక వొరవడి.. పడికట్టు సృష్టించిన వ్యక్తి నన్నె చోడుడు.. తన కుమార సంభవం లో ఎన్నొ వర్ణనలు చిత్ర విచిత్రం గా...వర్ణించాడు. అష్టాదశ వర్ణనలు గల కావ్యమును ప్రబంధము అనవచ్చును.16 వ శతాబ్దం లొ రాయల వారి కాలం లో వెలువదిన కావ్యాలనే ప్రబంధాలు అని పిలుస్తున్నారు. "కధైక్యమును, అష్టాదశ వర్ణనలు కలిగి శృంగార రస ప్రధానమై అర్ధ అతిశయ శబ్దమును గ్రహించి, ఆలంకారిక సాంకేతికములకు విధేయమై, అనతి విస్తృతి గల ఇతి వృత్తముతో భాషాంతరీకరణము గాక స్వతంత్ర రచన అనదగు తెనుగు కావ్యము ప్రబంధము "
ఆచార్య పింగళి లక్ష్మీ కాంతం ప్రబంధ పరిణామాన్ని ఈ విధం గా వివరించారు.... "భారతం లో బీజ ప్రాయముగ, ఎర్రన లో అంకుర ప్రాయముగ, సోమన్న లో మొలకగా పొడసూపిన ప్రబంద లత శ్రీనాధుని చేతి లో కొనలు సాగి, చిగిర్చి మారాకు వేసినది. అది పుష్ప ఫల సమన్వితమగుట రాయలకాలం లో జరిగినది. మను చరిత్రయే ఆ లత పూచిన తొలిపూవు, పండిన తొలి ఫలము.."
ఐతే రామాయణము ప్రబంధము అనాలా? కానే కాదు. ఈ మొల్ల నన్నె చోడుని తర్వాత కాలంలో వచ్చింది కాబట్టి... ఎవరు ఏ గ్రంధం రాసినా ఆ వొరవడి లోనే వెళ్ళారు అనవచ్చునెమో. పెద్దలు పరిశీలించి విశదీకరిస్తే మనం తెలుసుకోవచ్చు. ఈ రోజుకు స్వస్తి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి