మనం ప్రస్తుతం మొల్ల చెప్పబోయె దశరధ మహారాజు గొప్పదనాలను తెలుసుకుంటాము. అయితే.. అయన్ను గురించి ముందుగా క్లుప్తంగా వివరించాలన్నది నా కోరిక. రక రకాల పుస్తకాలలో.. ఇతరత్రా సేకరించి మీముందు వుంచుతున్నాను.
మనం "మొల్ల రామాయణము-7" లో...శ్రీ మహా విష్ణువు దశరధ మహారాజు ఇంటనే ఎందుకు జన్మించాడనే విషయం ప్రస్తావించుకున్నాము. ఇక ఇప్పుడు ఏ సంధర్భం లో మహావిష్ణువు దశరధునికి ఆ విషయం చెప్పింది కూడా చూద్దాము.
రామాయణానికి ఒక మూల స్థంభం దశరధ మహారాజు గారు. ఒక రాజు గారు ఎలా పరిపాలించాలో మనకి నేర్పుతాడు దశరధుడు. ఒక తండ్రి ఎలా ప్రేమిస్తాడో చూపిస్తాడు దశరధుడు. ఒక దాత ఎలా దానం చెయ్యాలో చూపిస్తాడు దశరధుడు. సీతాపరిణయం కోసం జనక మహారాజు దూతలని పంపితే వారు వృద్ధుడైన ఇంద్రుడు ఎలా ఉంటాడో అలా ఉంటాడని వర్ణించారు దశరధ మహారాజు వైభవాన్ని. అలాంటి మహారాజు మరణించే క్షణం లో ఒక కొడుకు కోసం విలపిస్తూ మరణించటం, మరణించేటప్పుడు నలుగురు కొడుకులున్నా ఒక కొడుకు కూడా దగ్గర లేకుండా హా పుత్రా, హాపుత్రా అంటూ ఏడుస్తూ చనిపోవటం కాలం ఎంత బలవత్తరమైనదో చెప్పటానికి వాల్మీకి మహర్షి వాడిన ఒక బలమైన దృష్టాంతం.
రామాయణ కధా ప్రారంభమే పుత్రులు లేరనే బాధతో దశరధుడు యాగాన్ని వసిష్ట మహర్షి అనుమతితో మొదలుపెట్టటం ద్వారా జరుగుతుంది. అదే పుత్ర కామేష్టి యాగం. ఆ ఇష్టి కి ఆహ్వానించిన దేవత లంతా స్వస్వరూపంతో వేంచేస్తారు. అలా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా ఆ సభకి విచ్చేస్తారు. అప్పుడు దిక్పాలకులు, ఋషులు రావణాసురిని వల్ల వారు పడే భాదలన్నీ చర్చిస్తుండగా, శ్రీ మహావిష్ణువు లేచి " నేను ఈ దశరధ మహారాజు గారిని నా తండ్రిగా ఎంచుకొని నలుగురిగా పుట్టిపదకొండువేల సంవత్సరాలు రాజ్య పాలన చేస్తానని" ప్రకటిస్తాడు. ఆ మాట విన్న దశరధ మహారాజు పొంగి పోతాడు. తన మనోరధం తీరిందని సంతోష పడతాడు.తరవాత కౌసల్యకు రాముడు, మరునాడు కైకేయికి భరతుడు, ఆ సాయంత్రం సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మిస్తారు. పెద్ద కుమారుడైన రామున్ని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తాడు దశరధుడు. ఒక నాడు నిండు సభలో.. నా పెద్దకుమారుడైన రాముడికి యువరాజ పట్టాభిషేకం చేయదలుచుకునాను. మీ అభిప్రాయం చెప్పమని" అంటాడు. దానికి సభ అంతా తమ సమ్మతాన్ని ఎంతో సంతోషంగా విన్నవిస్తారు. అప్పుడు తిరిగి " నేను ఎన్నో సంవత్సరాలుగా రాజ్యపాలన చేస్తున్నాను. అలాంటిది నేను రామునికి యువరాజ పట్టాభిషేకం చేస్తానంటే మీరు ఎందుకు ఇంత సంతోష పడుతున్నారు. నా పాలనలో ఏమైనా దోషం ఉందా?" అని ఎదురు ప్రశ్నిస్తాడు. అప్పుడు సభికులంతా ఒకే మాటగా రాముని సుగుణాలని చెప్తే విని పుత్రోత్సాహంతో పట్టాభిషేకానికి తొందర పడిపోతూ తనే ముహూర్త నిర్ణయం చేస్తాడు. ఈ సందర్భంగా మనం దశరధుని ప్రజాభిప్రాయసేకరాణా దృక్పధాన్ని చూడవొచ్చును. అల్లాగే పుత్ర ప్రేమ మితి మీరటం వల్ల వసిష్టుని వంటి మహానుభావుని పక్కకు నెట్టేసే స్వభావాన్ని చూడవచ్చు.
తన ముద్దుల భార్య కైక తన ముద్దులకుమారుడైన రామునికి 14 సంవత్సరాల అరణ్యవాసమును కోరినప్పుడు ఇక ఆ రాజు పడే భాద అంత ఇంతా కాదు.ఆమె కోరిన రెండవ కోరిక అఇన భరతుని పట్టభిషేకమును పెద్దగా ఖండించడు కాని రామ నవాసమును మాత్రం ఏమాత్రం వొప్పుకోలేదు దశరధుడు.అప్పుడు తను వయస్సులో వుండగా జరిగిన ఒక విషయం చెప్తాడు దశరధుడు. వేటకి అడవికి వెళ్లి ఒక సరస్స్సు మాటున పొంచి వుండి నీళ్ళల్లో ఏదో శబ్దం విని ఏదో మృగం దాహార్తి తీర్చుకోవటానికి వోచ్చిందన్న భావనతో బాణాన్ని విడుస్తాడు. అది వెళ్లి ఒక ముని కుమారుడిని తగులుతుంది. అప్పుడు ఆ ముని కుమారుడు తన తల్లి తండ్రులు గ్రుడ్డి వారని వారికి నీళ్ళు తీసుకు వెళ్ళటానికి వొచ్చానని, కాబట్టి నీవైనా నా తల్లితండ్రులకి నీళ్ళు తీసుకెళ్ళమని కోరి చనిపోతాడు. అది విని ఎంతో బాధ తో నీరు తీసుకొని ఆ ముని కుమారుడి తల్లితండ్రుల వద్దకు వెళ్తాడు దశరధుడు. వారు తమ కొడుకేనని భావించి మాట్లాడుతుంటే తట్టు కోలేక తాను దశరదుడినని తనవలన వారి కొడుకు చనిపోయాడని చెప్తాడు. అది విని వారు తట్టుకోలేకపోతారు. తమ కొడుకు శవాన్ని కౌగిలించుకొని ఏడుస్తూ అంత్యకాలమునందు నీవు కూడా మాలాగే "హా పుత్రా... హా పుత్ర.. అని ఏడుస్తూ చనిపోతావని " శపిస్తారు.యవ్వనంలో వున్నప్పుడు "అసలే పుత్రులు లేరనే దిగులుతో వున్న నేను ఆ రోజు అమ్మయ్యా! నాకు కొడుకులు పుడతారు కదా అని సంతొశించాను కాని ఈ దు:ఖం నేను భరించలేక పోతున్నాను అని ఎంతో ఏడుస్తూ రాత్రి వేళ నిద్రపోతూనే మరణిస్తాడు. రాముడు వనవాసానికి వెళ్ళిన తరువాత కనీసం వారం రోజులు కూడా బ్రతకలేదు. ఆ తండ్రికి కొడుకంటే ఎంత పిచ్చిప్రేమో దీని ద్వారా సుకోవచ్చు.
ఆ తరువాత తన మేన మామల ఇంటికి వెళ్ళిన భరతుడు దాదాపు 10 రోజుల తరువాత కాని తిరిగి రాడు. అప్పటిదాకా తైలద్రోణి లో ఆ శరీరాన్ని భద్రపరిచి అప్పుడు దహన సంస్కారాలని భరతునితో చేయుస్తారు పెద్దలు. ఈ విధంగా దశరధ మహారాజు గారి కధ ముగుస్తుంది.
ఇక మొల్ల తన కావ్యం లో దశరధ మహారాజు గొప్పదనాలు వచ్చే పోస్టింగులలో చూద్దాము. స్వస్తి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి