• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

29, జూన్ 2010, మంగళవారం

ఆటవెలది.

చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ
బంగరు మొల త్రాడు పట్టుదట్టి
సందె దాయతులును సరిమువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతు !
ఈ పద్యం అందరం చిన్నప్పుడు చదువుకున్నదే కానీ, మనలో చాలామందికి తెలియని విషయమేమిటంటే ఇది తాళ్ళపాక అన్నమాచార్యుడు వ్రాసిందని. "చిన్నికృష్ణ నిన్ను చేరికొలుతు" అంటూ ఒక శతకాన్ని వ్రాసాడట ఆ మహానుభావుడు. కానీ అందులో ఇప్పుడు మనకు దొరికిన పద్యాలు కేవలం ఎనిమిదేనట. మిగిలినవి ఏమయ్యాయో ఇంకా తెలియదు. ఇది ఆటవెలది కి ప్రారంభం. ఇంకా మన వేమన గురించి చెప్పాలంటే మన హైదరాబాదు ట్యాంక్ బండ్ మీద చూసే ఉంటారు ఆయన విగ్రహం. కింద ఆయన గురించి.. "ఆటవెలది ని ఈటె గా విసరిన దిట్ట. చాందస భావాలకు తొలి అడ్డు కట్ట." ఆయన ఆటవెలది లో దిట్ట. అయన రాసిన సరళ ఆటవెలదులు మనం ఎ గ్రంధం లోనూ చూచి ఉండము కూడా.
ఆటవెలది తెలుగు ఛందస్సులో ఒకానొక జాతి పద్యరీతి.
లక్షణములు
ఆ.ఇనగణ త్రయంబు నింద్ర ద్వయంబునుహంస పంచకంబు ఆటవెలది.'
పాదాల సంఖ్య నాలుగు 1, 3 పాదాలు మెదటి 3 గణాలు సూర్య గణాలు ,తరువాత 2 ఇంద్ర గణాలు కలిగి 2, 4 పాదాల్లో 5 సూర్య గణాలు ఉంటాయి యతి ప్రతి పాదములొ నాల్గవ గణం మొదటి అక్షరం. ప్రాస యతి చెల్లుతుంది. ప్రాస నియమం లేదు. ఉదా:- 'విశ్వదాభిరామ వినుర వేమ' అనే మకుటంతో ఆంధ్రులకు చిరపరిచితములైన వేమన పద్యాలన్నీ ఆటవెలదులే. ఇదీ స్తూలంగా ఆటవెలది కి ప్రారంభం. ఇక మనం పద్యం లో ప్రవేశించి, గణవిభజన తో సహా నేర్చుకుందాము.

27, జూన్ 2010, ఆదివారం

పద్యానికి యతి ప్రాసలే హృద్యం, హృదయమూ....

పద్యానికి యతి, ప్రాస.. హృద్యం,ప్రాణం,అందం.. ఇవి ఏదోవిధంగా పెట్టడం కాదు. సరిగా ఉండాలి. అప్పుడే పద్యం అందగిస్తుంది. తిక్కన సోమయాజి తన నిర్వచనోత్తర రామాయణం లో (1-7)... యతి ప్రాసల గురించి ఇలా చెప్పాడు.
తెలుగు కవిత్వము చెప్పందలచిన కవి యర్ధమునకు దగి యుండెడు మాటలు గొని వళులం బ్రాసంబులు నిలుపక యొగిని బులిమి పుచ్చుట చదురే!
తిక్కన ఎంత చక్కగా చెప్పడో చూడండి. పులమొద్దు అంటున్నదు. కనుక యతి ప్రాసలు ఏవో వేసేసి పద్యాన్ని లాగించెయ్యడం సరి కాదు. అర్ధవంతం గా ఉండాలి. అలాగే వేరొక చోత "ప్రాసము ప్రకారం వేరగు నక్షరంబులన్ శృత్య రూప మంచు నిడ" అన్నాడు. దాని అర్ధం ఏమిటంటె.. బండి "ఱ" మామూలు "ర" పలకడానికి వొకే విధంగా ఉన్నయి కదా అని ప్రాస లో వాడడం సరి కాదు అని సున్నితం గా ప్రభోదించాడు. అలాగే పెద్దలు వాడారు కదా అని మనం వాడడం కూడ సబబు కాదు అని పరవస్తు చిన్నయ సూరి "ఆర్య వ్యవహారంబులు దౌష్త్యంబులు గ్రాహ్యంబునగు" అన్నడు.
కనుక యతి ప్రాసలకు పనికి వచే పదాలు తెలుసుకోంది అర్ధవంతం గా వాడండి. ఒకే పదానికి అనేక పర్యాయ పదాలు ఉంటాయి కదా? మీకు ఒకే పదాన్ని అన్ని గణాలకు పనికి వచ్చే విధంగా ఎలా ఉపయోగించాలో రేపు చెప్తాను.

24, జూన్ 2010, గురువారం

ప్రయత్నమే పద్య రచనకు తొలి మెట్టు.

మీకు తేటగీతి లోని కొన్ని ముఖ్య విషయాలను చెప్పి, వేరే చందస్సు లోకి వెళ్తాను.
మీరు అసలు ముందుగా ఒక పద్యం రాయాలి అనే పట్టుదల పెట్టుకోండి.
ఉదా: ఒక వనం మీద ఒక పద్యం రాయాలి. అనుకోండి.
మొదట గా మనకు తేటగీతి కి సూర్య - ఇంద్ర - ఇంద్ర - సూర్య - సూర్య. ప్రతి పాదం లో ఉండాలి.
మొదట గా సూర్య గణం కదా... వనము ( III ) సరిపోయింది. తరువాత ఇంద్ర గణం కావాలి.జూడగ..( UII ) తర్వాత నామది.. ( UII)ఇక మనం సంతోషం పొందినదనో..ఆటలాడిందనో రాయాలి కదా? ఆటలాడె.. మరి ఇలా రాస్తే.. యతి .. సరిపోదు కదా.. వనము అంటే.. వ.. కానీ.. ప్రాస యతి ఐతే.. న. రావాలి.
అలాంటప్పుడు నా సలహా యేంటంటే.. యతి కి పనికి వచ్చే పదాలు వెదకడం ఒక పద్ధతి.లేదా యతి కి సరిపోయే పదం మొదటగా వేసుకోడం ఇంకో పద్ధతి. మీకు ఏది సులభం అనుకుంటే అదిచెయ్యండి.
మనం పై పద్యం లో యతి సరిపోలేదు కదా.. అందుకని .
వనము జూడగ నామది.. వరకూ వచ్చాక యతి సమస్య వచ్చింది..మనం ఆట లాడె అని రాయలనుకున్నము..
వనము బదులుగా తోట.. పెట్టుకున్నట్లైతే..తోట.. లోని "ట" ఆ"ట" లోని "ట"యతి సరిపోతుంది కదా.. అలాగే ప్రయత్నించండి. పద్యం రాయంటే ఆసక్తి ముఖ్యంపెద్దగా విద్వత్తు అవసరమేమీ లెదు అని ప్రారంభించండి..
ఇంకా సందేహాలు ఉన్నయా? ఉంటే రాయండి. మైల్ ఐనా ఇవ్వండి లేదా..కామెంటురూపం లో రాయండి.
ఈ పద్యం తో నా తేట గీతి అభ్యాసాలు ముగుస్తాయి.
తెలుగు భాషకు వెలుగును తెచ్చినట్టి
పద్య కవిత ను మరచుట పాడి గాదు.
ఆంధ్ర సోదర నా మాట ఆలకించి.
పాడు కొనుమయ్య పద్యమున్ పరవశించి.

ఇలా మీరు ప్రయత్నిచండి. తప్పులైనా సరే రాయండి.నేను మీకు సరి చేసి పంపుతాను. ఈ రోజు కు స్వస్తి.

23, జూన్ 2010, బుధవారం

పర్యాయ పదాలు.

పర్యాయ పదాలు ఎక్కువగా తెలుసుకోవడం వాళ్ళ, పద్యం లో ప్రాస కు ఒక పదం కాకపోయినా ఇంకో పదం వాడుకోవచ్చు.

ఒకే అర్ధమునిచ్చు వివిధ పదములను పర్యాయ పదములు అందురు. వీటిని తెలుసుకొనుట వలన ఒకే అర్ధము గల వివిధ పదములు పరిచయము కలుగును.
అంకురార్పణ - ఆరంభము, ప్రారంభము, శ్రీకారము, మొదలు, ఆముఖము, సమారంభము.
అధికారి - అధినేత, దొర, పాలకుడు, అధిపతి, అధ్యక్షుడు.
ఆచారము - సంప్రదాయము, ధర్మము, అనుష్ఠానము, మరియాద, పాడి.
ఆజ్ఞ - ఉత్తరువు, సెలవు, ఆనతి, శాసనము, అనుమతి, ఆదేశము.
ఆపద - గండము, ఇడుము, కష్టము, క్లేశము, పీడ, ప్రమాదము, కీడు, చిక్కు.
ఆవు - మొదవు, కపిల, ధేనువు, సురభి, పావని, బహుళ, మాహేయ, గోవు, పయస్విని.
ఆశీర్వాదము - ఆశీస్సు, ఆశీర్వచనము, సంబోధన, ఆక్రందన.
ఇల్లు - గృహము, ధామము, ఆవాసము, ఆలయము, స్వగృహము, కొంప, భవనము.
ఈశానము - రుద్రభూమి, మరుభూమి, వసకాడు, ప్రేతవనము, పరేతభూమి.
ఉదాహరణము - నిరూపణము, ఉపవృత్తి, ప్రామాణ్యము, ఉదాహృతి.
ఉప్పు - లవణము, క్షారము, కటకము.
ఋషి - తాపసి, ముని, సాధువు, జడధారి, తపస్వి.
ఎల్లప్పుడు - సర్వదా, నిత్యము, కలకాలము, సతతము, అనవరతము, అహర్నిశము, ఎల్లకాలము.
ఏనుగు - ఇభము, హస్తి, సారంగము, గజము, కరేణువు, కుంజరము, దంతి, మాతంగము, వారణము, సింధువు.
ఓదార్పు - సాంత్వము, అనునయము, ఊరడింపు, లాలన, బుజ్జగింపు, ఉపశాంతి.
కట్నము - శుల్కము, వరదక్షిణ, అరణము, వీడు.
కడుపు - కుక్షి, ఉదరము, పొట్ట, కంజరము.
కన్ను - చక్షువు, అక్షిన, లోచనము, నయనము, ఈక్షణము, అవలోక్యము.
కర్పూరము - కప్రము, కుముదము, నెల, ముక్తాఫలము, హిమాంశువు, శ్వేతధామము.
కలువ - ఉత్పలము, కువలయము, పున్నాగము, తోవ, కపాలము.
కాంతి - వెలుగు, మినుకు, ప్రకాశము, ద్యుతి, ప్రతిభ, రవణము, రోచిస్సు.
కవచము - ఆయుక్తము, తొడుగు, వారణము, కవసము.
కాముకుడు - శృంగారి, కామాచారి, స్త్రీపరుడు, కామి, వలకాడు.
కాయ - కసురు, శలాటువు, పసరుకాయ.
కారణము - హేతువు, తర్కము, నిమిత్తము, మిష, సాకు, వంక, భంగి.
కీర్తి - ఖ్యాతి, ప్రతిష్ఠ, యశము, ప్రకాశము, ప్రశస్తి, నెగడ్త, పేరు.
కూతురు - అంగజ, కుమారి, తనయ, సుత, పుత్రిక, తనూజ.
కొడుకు - సుతుడు, నందనుడు, కుమారుడు, తనయుడు, అంగజుడు, పుత్రుడు, ఆత్మజుడు.
కోపము - క్రోధము, ఆగ్రహము, ఉద్రేకము, కినుక, అలుక, నెగులు, చిందు, రోషము.
క్రమము - అనుక్రమము, యధాక్రమము, సరలి, పదకము, తరువాయి.
క్షణము - లిప్త, మాత్ర, త్రుటి, ముహూర్తము.
గ్రంధము - పుస్తకము, వహి, పొత్తము, కితాబు.
చర్మము - తోలు, తాట, తొక్క, అజనము.
తండ్రి - జనకుడు, అయ్య, నాన్న, పిత, పితరుడు.
తామర - పద్మము, అంబుజము, అరవిందము, సరసిజము, సరోజిని, కంజాతము, రాజీవము.
త్రాడు - పాశము, చామము, రజ్జువు, బంధువు, వటము.
దేవాలయము - ఆలయము, నగరు, కోవెల, గుడి.
దేశము - వర్షము, రాష్ట్రము, రాజ్యము, సామ్రాజ్యము, పాళెము, నీవృతము.
ధనము - ఆదాయము, డబ్బు, సొమ్ము, అర్ధము, నగదు, దుడ్డు, ద్రవ్యము, సొత్తు, లెక్క, కాసు, పైకము.
నారదుడు - కలహాశనుడు, త్రిలోకసంచారి, కలహభోజనడు, దేవలుడు, కలహ ప్రియుడు. నేడు - ఈనాడు, ఈప్రొద్దు, ఈరోజు.
పండితుడు - అభిజ్ఞుడు, కవి, కోవిదుడు, ధేమతుడు, విద్వాంసుడు.
పెండ్లి - వివాహము, పాణిగ్రహణము, మనువు, పరిణయము, స్వీకారము, కళ్యాణము.
పన్ను - కష్టము, సుంకము, కూలి, శిస్తు, శుల్కము, ఇల్లరి.
పరిశోధన - విచారించు, పలికించు, సోదించు, అరయు, ఎంచు, ఒరయు.
పరిశోధకుడు - పరీక్షకుడు, శోధకుడు, విచారకుడు, పరిశీలకుడు.
పాపము - దుష్కృతము, కీడు, కొడిమె, అఘము, కలక, దోషము, దురితము.
పిల్లి - బిడాలము, మార్జాలము, వ్యాఘ్రాదము, త్రిశంకువు.
ప్రాణము - ఓవము, ఉసురు, సత్త్వము, ఊపిరి, అసువులు.
బుద్ధి - ప్రతిభ, ప్రజ్ఞ, ప్రాజ్ఞ, ధౌ, ప్రజ్ఞానము, మనీష.
బ్రహ్మ - విధాత, కమలగర్భుడు, చతుర్ముఖుడు, హంసవాహనుడు, చతురాననుడు, కంజాతుడు, కమలాసనుడు, నలువాయి, సృష్టికర్త.
భక్తి - బత్తి, సేవ, ఇమ్ము, విరాళి, సొరత్వము, పోరామి.
భర్త - వల్లభుడు, ప్రాణేశుడు, ఈశుడు, నాధుడు.
భార్య - అర్ధాంగి, సతి, ఆలు, ఇల్లాలు, కళత్రము, పత్ని, గృహిణి.
భోజనము - విందు, భుక్తి కడుపు, అన్నము, ఓగిరము, బోనము, భిక్ష, పబ్బము.
మనస్సు - హృదయము, ఉల్లము, మనము, ఎరచిత్తము, ఎడద, అంతరంగము, డెందము.
మాట - వాక్కు, పలుకునుడి, ఉకిత, వనము, ఆలాపము, సుద్ది, భాషణము.
ముఖము - మూతి, వదనము, మోము.
మెరుపు - సౌదామిని, అంబరాంశువు, నీలాంజన, చంచల, అశని, మేఘవహ్ని.
మేఘము - అబ్దము, వారిదము, పర్జన్యము, నీరదము, జలధరము, పయోధరము.
మేనము - అవాక్కు, అభాషణము.
యముడు - ధర్మరాజు, సమవర్తి కాలుడు, పాశి మృత్యువు, శమనుడు.
యుద్దము - రణము, సంగ్రామము, తగవు, పోరు, సమరము, భండనము, వైరము, విగ్రహము.
రక్షణ - శరణు, త్రాణము, రక్ష, అభయము, కాపుదల.
రహస్యము - గూఢము, గుప్తము, మంతనము, మర్మము, చాటు, గోపనము.
రాత్రి - అసుర, రజని, నిశీధము, నిసి, యామిని, అంజనము, మాలతి.
రైతు - సేద్యకాడు, కుటింబి, కర్షకుడు, హాలికుడు, కృషీవలుడు, కాపు.
రోగము - అనారోగ్యము, జబ్బు, అస్వస్థము, నలత, వ్యాధి, సుస్తి, అపాటము.
వరుస - అంచె, సరణి, దొంతర, క్రిమము, వళబారు, శ్రేణి, బొత్తి, సరళి
వర్తకుడు - వ్యాపారి, వణిజుడు, శ్రేష్ఠి, వ్యాపారస్థుడు, సెట్టి, వ్యవహారి.
వస్త్రము - అంబరము, చేలము, వలువ, కోక, గుడ్డ, శాటి.
వార్త - కబురు, గాద, వర్తమానము, సొద, సంగతి.
విద్యార్ధి - పాధకుడు, అద్యౌత, పాఠనుడు, అభ్యాసి.
విధము - ఒరవు, సొంపు, సూటి, క్రియ, క్రిమము, దారి, వెరవు, మార్గము.
వినోదము - వేడుక, హొయలు, వింత.
విమర్శ - సమీక్ష, పరామర్శ, అవలోకనము, విచారము, చర్చ.
విష్ణువు - శౌరి, హిర్ణగర్భుడు, అనంతుడు, గోవిందుడు, వైకుంఠుడు, చక్రాయుధుడు, పన్నగశయనుడు, జనార్ధనుడు, అక్షరుడు, శ్రీనివాసుడు, పద్మగర్భుడు.
వైతాళికుడు - ప్రబోధకుడు, ఉద్బోధకుడు, ఛాత్రికుడు
శపధము - వ్రతము, బిట్టు, బాస, పూనిక, ప్రతిన, పంతము, ప్రతిజ్ఞ
శరీరము - అంగము, బొంది, మేను, విగ్రహము, ఒడలు, దేహము.

తేట గీతి పద్యం.

వారం రోజులు అయినా సరైన సమాధానాలూ, ప్రయత్నాలు లేవు. ఐన నేను నా విధి గా పద్య పాదాన్ని పూరించి తర్వాతి విషయం లోకి వెళ్ళాలి.
సూర్య - ఇంద్ర - ఇంద్ర - సూర్య - సూర్య. ప్రతి పాదం లో ఉండాలి గదా..
తోట కూర పప్పు పులుసు తోడి పెరుగు
దీనిలో UI (తోట) కూర పప్పు పులుసు లో.... కూరపప్పుపులుసు.(UIUIIII)... లో...రగణం, నల గణం వరుసగా వచ్చాయి. రొండు ఇంద్ర గణాలు సరిపోయాయి. ప్పు అనే ద్విత్వాక్షరానికి ముందున్న ప గురువు గా మారిన విషయం గమనిచే వుంటారు. అలాగే ప్పు లఘువు గా మారడం కూడా. అలాగే మిగతా పాదాల్ని ఇస్తే గణ విభజన చేసి చూడండి.
తల్లి కరుణకు సరిసాటి ధరణి గలదె!... ౪ వ పాదం.. జన్మ జన్మ కు యామెకె జన్మ నిమ్ము.
ఇక మంచి తేట గీతి పద్యాలను చూసి గణవిభజన చేసుకుని రాయడం ప్రారంభించండి.
ఇప్పుడు మనం తెలుసుకున్న విషయాలను ఒకసారి మననం చేసుకుందాము.
తేటగీతి కి సూర్య - ఇంద్ర - ఇంద్ర - సూర్య - సూర్య. ప్రతి పాదం లో ఉండాలి.
మొదటి గణం మొదటి అక్షరానికీ, నాల్గవ గణం మొదటి అక్షరానికి యతి మైత్రి ఉండాలి. ప్రాస యతి వాడ వచ్చు. ప్రాస నియమము లేదు. ఈ విషయాలు మనసులో సదా ఆడుతూ ఉండాలి. చిన్న చిన్న పదాలతో రాసుకోండి.
ముఖ్యంగా ప్రాస పదాలు తెలిసి ఉండాలి. ఈ కింద కొన్ని ప్రాస పదాలు ఇస్తున్నాను చూడండి. ఈ పదాలు నేను తెలుగు దానం అనే వెబ్ సైటు నుంచి తీసుకున్నవి. వారికి కృతజ్ఞతలు.
పాప గిలక తాత పిలక
సబ్బు మరకగడ్డి పరక
గుడి గంటవరి పంట
రంగు పలకకంటి నలక
పళ్ళ గంపముళ్ళ కంప
పిచ్చి కుక్కపూల మొక్క
చిట్టి తల్లిబుజ్జి చెల్లి
కాకి ఈకమేక తోక
తేలు కొండిరైలు బండి
బావి గట్టురావి చెట్టు
దోస పండుపూల చెండు
పట్టు కుచ్చుగొర్రె బొచ్చు
గండు పిల్లిబొడ్డు మల్లి
చీల మండుగోల కొండ
వెండి కొండనిండు కుండ
ఆల మందతీయ కంద
వరి అన్నంరాతి సున్నం
నీటి బుడుగపాము పడగ
ప్రాస వాక్యాలు
మంచి మాట ముద్దుకల్లలాడవద్దు
కీడు చేయ ముప్పువాదులాడ తప్పు
కట్టు లేని నోరుగట్టు తెగిన ఏరు
పెద్ద వారి మాటపెరుగన్నం మూట
కలసి మెలసి మెలుగుకలిమి బలిమి కలుగు
పొల్లుమాట విడువుగట్టిమాట నుడుపు
మాట తప్పబోకుమంచి విడువబోకు
అడుసు తొక్కుటేల?కాలు కడుగు టేల?
చదువురాని మొద్దుకదలలేని ఎద్దు
కీడుచేయ ముప్పువాదులాడ తప్పు
మంచివిద్య చదువుమంచిబుద్ధులొదవు
గట్టిమాట నుడువుగర్వమంత విడువు
ప్రియములేని విందునయముకాని మందు
పోరునష్టం పొందులాభం కలసి ఉంటే కలదు సుఖం.
ఇలాంటి పదాలు గమనించండి. ప్రాస ఆటోమాటిక్ గ పడాలంటే బాష మీద కొంచెం పట్టు సాధించండి.

16, జూన్ 2010, బుధవారం

తేట గీతి పద్యం.

పద్యాలగురించి తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉన్నా, సందర్భానుసారంగా చెప్పుకుంటే బాగుంటుందని భావిస్తూ, నేరుగా పద్యల్లోకి దిగుతున్నాను. ఇంకా మనం సందుల గురించి, సమాసాల గురించి తెలుసుకోవాలి. విసంధులు చేయడం, సంధి చేయ వలసిన చోట, చేయకుండా గానాలకోసం విడివిడి గా రాయడం, తప్పు, పైగా పద్యం అందం కూడా సన్నగిల్లుతుంది. అలాగే సమాసాలను సరిగా రాయక పోతే మనకే పద్యం చదువుతున్నప్పుడు, సరిగా అనిపించదు. అవన్నీ మనం సందర్భానుసారంగా చెప్పుకుందాము. మనం ప్రస్తుతం తేట తేట తెలుగు లో తేటగీతి ఎలా రాయాలో చూద్దాము.


పద్యాలు మన ఆర్యులు ౩ విధాలుగా చెప్పారు. ౧. వృత్తములు అంటే చంపకమాల, ఉత్పలమాల, శార్దూలము, మత్తేభము, మత్తకోకిల మొదలైనవి. ౨. జాతులు అంటే కందము, ద్విపద మొదలైనవి. ౩. ఉప జాతులు..తేటగీతి, ఆటవెలది, సీసము.


అంటే ఇప్పుడు మనం రాయబోయే తేటగీతి ఉప జాతికి చెందినదని గుర్తుపెట్టుకోండి. తేటగీతి పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి. ఒక్కొక్క పదం లో ఒక సూర్య గణము, రెండు ఇంద్ర గణాలు, మళ్ళీ రొండు సూర్య గణాలు వరుసగా వస్తాయి. మొదటి గణం మొదటి అక్షరానికీ, నాల్గవ గణం మొదటి అక్షరానికి యతి మైత్రి ఉండాలి. ప్రాస యతి వాడ వచ్చు. ప్రాస నియమము లేదు.


ఇప్పుడు అన్ని నియమాలు వరుసగా చూద్దాము. ఇందులో కంగారు పడవలసిన పని లేదు. ఛందస్సు గురించి భయపడకండి. ఈ పద్యం లో ప్రతి పాదం లో వరుసగా, ఒక సూర్య గణమూ, తర్వాత.. రొండు ఇంద్ర గణాలూ, మళ్ళీ రొండు సూర్య గణాలు రావాలి అని అనుకున్నాం గదా వాటి సంగతేమితో మొదట గా చూద్దాము.

1.ఇంద్ర గణాలు: నల IIII, నగ IIIU, సల IIUI, భ UII, ర UIU, త UUI గణాలు.

౨.సూర్య గణాలు: గలము లేక హగణం: UI ., మరియూ.. III నగణం.

మనకు ఇవి కావాలి తేటగీతి రాయాలంటే అంతే..

సూర్య - ఇంద్ర - ఇంద్ర - సూర్య - సూర్య. ప్రతి పాదం లో ఉండాలి.

మనం విడి విడి అక్షరాలతో ఈజీ గా తేటగీతి రాసేయగలం.

చూడండి. మామూలు పదాలు పట్టుకోండి చాలు.
అమ్మ అన్నము పెట్టెను కమ్మ గాను...
అమ్మ.. ఇది (U I) "గలం" లేక "హగణం".. సూర్య గణము కదా.. అన్నము...( UII) "భ" గణము.. భా న స ...ఇది ఇంద్రగణము కదా.. పెట్టెను (UII ) "భ" గణము.. భా న స ఇదీ ఇంద్ర గణమే. ఇక మనం రొండు సూర్య గణాలు వాడాలి కదా.. కమ్మ (U I) గలం లేక హగణం ఇది సూర్య గణము.. అలాగే.. గాను (U I) గలం లేక హగణం ఇదీ సూర్యగణం. కాబట్టి మనకు సులభంగా తేటగీతి లోని పద్యం లో మొదటి పాదం వచ్చేసింది. యతి విషయానికి వస్తే అమ్మ లో ఉండే "మ్మ" కు కమ్మ లొ ఉందే "మ్మ" కు యతి సరిపోయింది. ఒక పాదం పూర్తి అయింది ఇలాగే మిగత పాదాలను పూరించడానికి ప్రయత్నించండి. మరి.. ఆలస్యం వద్దు. నాకు మెయిల్ చేసినా. లేక వ్యాఖ్యల రూపం లో రాసిన చూద్దాము. ఎంత మంది అసలు ఈ పద్యాలను ఫాలో అవుతున్నారో కూడా తెలుస్తుంది.





14, జూన్ 2010, సోమవారం

తెలుగులో మొదటి పదం.

ఎప్పుడూ, ఛందస్సు గురించి కాకుండా, అప్పుడప్పుడూ, తెలుగు భాష గురించి తెలుగు పుట్టుపూర్వోత్తరాల గురించి తెలుసుకోడం ఆసక్తి కరంగా ఉంటుందని భావిస్తూ.. కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను.
ఆంద్ర సాహిత్యం లో మనకు మొదట లభిస్తున్న కావ్యం నన్నయ గారి " ఆంద్ర మహా భారతం" ఐనా, ఆయనకు ఒక శతాబ్దం ముందే మల్లియ రేచనుడు అనే కవి కవి జనాశ్రయము అనే లక్షణ గ్రంధాన్ని తెలుగు లో రాసాడు. కానీ అతని మాటల్లోని "తెలుగు" పదాన్ని సంసయించారు మన కవిపుంగవులు. ఇంకా ప్రాచీనుడు ఉద్యోతనుడు, ఆయన ఆంద్ర ప్రసక్తి చేసాడు తన రచనల్లో. ప్రాకృతం లో రాసిన ఆంద్ర ప్రసక్తి ఉంది చూడండి.
"పియ మహిళా సంగామే సుందర గత్తేయ భోయణే రొద్దే,
అటుపుటు రటుం భణంతే ఆంధ్రే కుమారో సలోయేతి"
అంటే అర్ధం ఏమిటంటే.. పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి ఇలా చెప్పారు.
"అందగత్తెలన్నా..అధవా.. యుద్ధరంగామన్నా..సమానంగా ప్రేమించే వాళ్ళు, అందమైన శరీరాలు గల వాళ్ళూ.. తిండి లో దిట్టలూ... అయిన ఆంధ్రులు... అటూ పుటూ, రటూ, అనుకుంటూ వస్తూ ఉండగా చూచాడు."
తొలి తెలుగు మాట?
మన అమరావతీ స్తూపం, చాలా ప్రాచీనమైనది. క్రీస్తు పూర్వం ౨౦౦ మొదలుకుని క్రీ.స. ౨౦౦ వరకూ అనేక దశలలో దాని నిర్మాణం సాగింది. ఇక్కడ దొరికిన ఒక రాతి పలక మీద "నాగబు" అనే మాట కనపడింది. దీన్ని వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఇది తెలుగు పదమని మొదటగా గుర్తించారు.ఇదే మనకు లభించిన మొదటి తెలుగు మాట. దాని అసలు సిసలు ద్రావిడ పదం "చెంబు" అంటారు.



ప్రాస నియమము అంటే ఏమిటి?

ఒక పద్యం లో కనీసం నాలుగు పాదాలు ఉంటాయి కదా. పద్య పాదం లోని రోండవ అక్షరాన్ని ప్రాస అంటారని తెలుసుకున్నాము. పద్యం మొదటి పాదం రొండో అక్షరం ఏమి ఉంటె అదే అక్షరం రొండు, మూడు మరియూ నాలుగు పాదాలలో ఉండాలి.
ఉదా: మొదటి పాదం రొండో అక్షరం "ప" ఉంటె, రొండు, మూడు, నాలుగు పాదాలలో కూడా "ప" ఉండాలి. అంటే పు, పె, పి అనే హల్లులు కూడా ఉండవచ్చు.

10, జూన్ 2010, గురువారం

ప్రాస యతి అంటే ఏమిటి?

యతి అంటే ఏమిటో తెలుసుకున్నాము. అలాగే, ప్రాస యతి అంటే ఏమిటో తెలుసుకున్నాక మనం, ఈ యతులను ప్రాస యతులను పద్యాలలో ఎలా ఉపయోగించాలి అనే విషయం చూద్దాము. ప్రాస అంటే "పద్య పాదం లోని రొండో అక్షరం" అని గుర్తు పెట్టుకోండి నిన్న మనం యతుల విషయం లో , పద్య పాదం లోని మొదటి అక్షరానికి పద్యం లో నియమిత స్తానానికి (ఉదా: నాల్గవ గణం మొదటి అక్షరం) యతి చెల్లుతుంది అనుకుంటే, ప్రాస యతి విషయం లో "పద్య పాదం లోని రొండో (ప్రాస) అక్షరానికీ, పద్యం లో నియమిత స్తానానికి ప్రక్కన ఉండే అక్షరానికి (ఉదా: నాల్గవ గణం రొండో అక్షరానికీ) యతి చెల్లు విధంగా రాయడాన్ని ప్రాస యతి అంటారు." అంటే ప్రాస అక్షరాన్ని యతి కి వాడుకుని యదార్ధంగా ఉండాల్సిన యతికి బదులుగా, ఆ పక్కన ఉన్న అక్షరాన్ని వాడుకుంటారు. ఈ విధమైన ప్రాస యతి అన్ని పద్యాలలో పనికి రాదు కొన్ని రకాలైన పద్యాలలో మాత్రమే వాడుకోవచు. ఆవిషయాలు మనం తర్వాత వివరం గా చూద్దాము.

9, జూన్ 2010, బుధవారం

యతి, ప్రాస యతుల వివరణ.

ఈ నాలుగు రోజుల సమయం లో మీరు గణ విభజన గురించి, యమాతారాజభానసలగం గురించి అధ్యయనం చేసి ఉంటారనుకుంటాను. ఇక యతుల గొడవ ఏంటో చూద్దాము.
పద్యం లోని మొదటి అక్షరాన్ని యతి అంటారు. ఈ యతికి పద్యం లో ఏదో ఒక నిర్దేశిత అక్షరం తో యతి కుదరాలి. ఒక రకంగా చెప్పాలంటే, ఇది ఒక విరామ చిహ్నం గా భావించాలి. ఏక బిగిన పద్యం చదవకుండా, ఎక్కడో ఒక చోట విరామ చిహ్నంగా ఆపుదలకు, పద్యం అందగించడానికి పెద్దలు ఏర్పరచిన నియమం ఇది.
ఇక అక్షరాల మధ్యన ఉండే యతి మైత్రి చూద్దాము. ఒక గుణింతం తీసుకుని ఆ ప్రకారం యతి మైత్రి ని గమనించ వచ్చు.
క గుణింతం తీసుకుంటే....
క, కా, కై, కౌ ల మధ్యన యతి మైత్రి ఉంది.
కి, కీ, కె, కే ల మధ్యనా..
కు, కూ, కొ, కో. ల మధ్యనా మైత్రి చెల్లును.
ఈ క్రింది యతి మిత్రులు కూడా గమనించండి.
1. అ, ఆ, ఐ, ఔ, య, హ...
2.ఇ, ఈ, ఎ, ఏ, ఋ, ౠ
3. ఉ, ఊ, ఒ, ఓ
4. క, ఖ, గ, ఘ
5.చ,ఛ,జ,ఝ, శ, ష, స.
6. ట, ఠ, ద, ధ,
7, ప, ఫ,బ, భ, వ.
8.త, థ, ద, ధ
9.న, ణ, ఙ.
10, ల, ర, ళ .
ఈ అక్షరాల మధ్యన యతి మైత్రి ఉంది కాబట్టి, పద్యం లో నియమిత స్తానం లో ఈ అచ్చు, లేక హల్లుతో గూడిన అక్షరాలను వాడాలి. అవి ఎలాగో వచ్చే పోస్టింగు లో చెప్తాను. ఈ లోపు మీరు ఈ యతి మైత్రుఅలను గుర్తుపెట్టుకోడానికి ప్రయత్నిస్తారు గదా...

4, జూన్ 2010, శుక్రవారం

గణ విభజన వివరణ.

గణ విభజన అనేది, పద్య రచన లో చాల ముఖ్యమైన ఘట్టం. గణాలను సులభంగా గుర్చించడం, పదాన్ని చూడగానే, గణం చెప్పగలగడం, ప్రాక్టీసు మీద గానీ రాదు. ఐతే ధ్యాస అదే విషయం పై ఉంటే సులభం గానె మీరు గణ విభజన చెయ్య గలుగుతారు. చివరలో మీకు దీనిలో ఉన్న చిట్కాలు చెప్తాను.
మొదటగా గణ విభజన చూద్దాము.
1. ఏకాక్షర గణాలు: గ U , ల I
2. రెండు అక్షరాల గణాలు: గలము లేక హగణం: ఉదా: సీత U I
౩. వగణం లేక లగం. ఉదా: రమా. IU
౪.గగం. ఉదా: రామా. ఊఊ
౫. లలం. ఉదా: రమ. II
౬.ఇంద్ర గణాలు: నల IIII, నగ IIIU, సల IIUI, భ UII, ర UIU, త UUI గణాలు.
యమాతారాజభానసలగం. అనే సూత్రం ద్వారా గణాలను సులభంగా గుర్తించవచ్చు. అదెలాగో చూడండి.
1. యమాతా IUU యగణం.
2. మాతారా UUU మగణం.
3. తారాజ UUI తగణం.
4. రాజభా UIU రగణం.
5. జభాన IUI జగణం.
6. భానస UII భగణం.
7. నసల III నగణం.
8. సలగం IIU సగణం.
9. లగం IU వగణం.
10. గం U గగణం.
ఈ గణ విభజనను బాగా బట్టీ పట్టి సూత్రం ద్వారా గుర్తుంచుకోండి. తదుపరి కొన్ని పదాలతో మనం గణ విభజన చేద్దాము.

3, జూన్ 2010, గురువారం

గురు లఘువుల విషయం లో కీలకమైన అంశాలు (గుర్తుంచుకోదగ్గవి)

గురు లఘువుల విషయం చాల ముఖ్యమైనది కాబట్టి, ఒక సారి ముఖ్యమైన విషయాలను, మననం చేసుకుందాం.
౧. ఏక మాత్ర (ఒక చిటికె) సమయం లో పలుక గలిగేవి లఘువులు.
ఉదా: క,కి,కు, కృ, కె, కొ . మొదలైనవి.
౨. ద్వి మాత్రా కాలం లో పలుకగాలిగేవి గురువులు.
ఉదా: కా,కీ,కూ,కౄ,కే,కై,కో,కౌ, కం, క: మరియూ
సున్నా, విసర్గ, న కార పొల్లు, ఐత్వం, ఓత్వం తో కూడిన అక్షరాలూ, శ్రీ అనే అక్షరం గురువులు.
ఇంకా... ద్విత్వక్షరాలకు, సంయుక్తాక్షరాలకు ముందున్న ఆక్షరములు గురువులు అవుతాయి. ఒక వేళ, ఆ (ద్వి లేక సంయుక్త) అక్షరానికి దీర్ఘం ఉన్నట్టయితే, ఆ అక్షరం కూడా గురువు అవుతుంది. ఉదా: ఇడ్లీ , కిళ్ళీ వంటి పదాలు, ( U U ).
పై విషయాలను జాగ్రత గా గమనించండి. వచ్చే పోస్టింగు లో గణ విభజన చేద్దాము.

2, జూన్ 2010, బుధవారం

గురు లఘువులను గుర్తించడం.

ఈ పదాలకు గురు లఘువులను గుర్తిద్దాము.
నస - రొండు లఘువులు - I I
అమల - మూడు లఘువులు. - I I I
కాకి - ఒక గురువు ఒక లఘువు. - U I
కైక - ఒక గురువు ఒక లఘువు.- U I
కోకిల - ఒక గురువు, రొండు లఘువులు.- U I I
కెంపు - ఒక గురువు ఒక లఘువు. - U I
కెల - రొండు లఘువులు. - I I
కౌలు - ఒక గురువు ఒక లఘువు. - U I
కృపాణము - ఒక లఘువు, ఒక గురువు, రొండు లఘువులు. IU II
ఇక సంయుక్తాక్షరాలు, ద్విత్వాక్షరాలు చూద్దాము.
ద్విత్వాక్షరాలు: ఒక గురువు మరియూ ఒక లఘువు. ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరము గురువు, తర్వాతది లఘువు. - U I
అత్త - - U I
అమ్మ - - U I
అవ్వ -- U I
అక్క - - U I
అన్న - - - U I.

సంయుక్తాక్షరాల సంగతి కొంచెం చూద్దాము.
ఇవి కూడా ముందున్న అక్షరాన్ని గురువు గా మార్చి, ఆ సమ్యుక్తాక్షరం లఘువు గా ఉంటుంది.
రక్తము - U I I
అన్య _ U I
పుణ్య - U I
భ్రుగ్న - U I

ఈ సంయుక్తాక్షరాలలో ఇంకో ట్విస్ట్ చెప్తాను గమనించండి జాగ్రతగా..
ఇడ్లీ , కిళ్ళీ వంటి పదాలు, ( U U ) ముందు పదాన్ని గురువు గా మారుస్తాయి, మళ్ళీ ఆ సంయుక్తాక్షరాలు దీర్ఘం తో కూడి ఉన్నాయి కదా అందుకని, ఆ అక్షరం కూడా గురువు అవుతుంది. అంటే రెండు అక్షరాలూ గురువులే నన్నమాట. వచ్చే టపా లో గురులఘువుల సారాంశాన్ని "ముఖ్యమైన గుర్తుంచుకోవలసిన విషయాలు" చెప్పి గురు లఘువుల గుర్తింపు ముగించి, గణ విభజన కు వెళ్దాము.

గురు లఘువులు.

ఈ గురు లఘువుల లో కొన్ని రకాల బీజాక్షరాలు ఉన్నాయి. అవి ఏంటో చెప్తాను.
అ,ఆ,ఎ,క,చ,ట,త,ప, య, ష... వీటిని వాయు బీజాక్షరాలు అంటారు.
ఇ,ఈ,ఐ,ఖ,ఛ,ఠ,ధ,ఫ,ర,స.... వీటిని అగ్ని బీజాక్షరాలు అంటారు.
ఉ, ఊ,ఓ,గ,జ,డ,ద,బ,ల,హ ... వీటిని భూ బీజాక్షరాలు అంటారు.
ఋ, ౠ,ఔ,ఘ,ఝ,ఢ,ధ,భ,వ,ళ ... వీటిని జల బీజాక్షరాలు అంటారు.
అం,ఙ,ఞ,ణ,న,మ,అ: ... వీటిని గగన బీజాక్షరాలు అంటారు.
వాయు, అగ్ని,గగన బీజాక్షరాలు పద్యమొదట పెడితే మంచిది కాదు అంటారు.
భూమి, జల బీజాక్షారాలు మొదట నిలిపితే శుభం అంటారు ఆర్యులు.
శ్రీ, కం,కః,నిన్,నున్, ఐత్వము,ఓ త్వములతో గూడినవి గురువులు గా భావించాలి.

ఇక, "కా" గుణింతము ద్వారా, గురు లఘువు లను గుర్తు పట్టగాలిగితే అదే మాదిరి మిగిలిన గుణింతాలను అభ్యాసం చెయ్యవచు.
లఘువులు: క,కి,కు, కృ, కె, కొ .
గురువులు: కా,కీ,కూ,కౄ,కే,కై,కో,కౌ, కం, క:
ఒత్తు ఉన్న అక్షరాలు రొండు రకాలు.
౧. సంయుక్తాక్షరాలు: ఒక హల్లు కింద వేరొక హల్లుకు సంబందించిన గుర్తు ఉంచడం.
ఉదా: ప్మ, క్య, వ్య, త్న మొదలైనవి.
౨.ద్విత్వాక్షరాలు: ఒక హల్లు కింద అదే హల్లు కు సంబందించిన గుర్తులు ఉంచడం.
ఉదా: క్క, ప్ప, మ్మ, య్య, త్త మొదలైనవి.
వీటి పరమార్ధం ఏమిటంటే, ఈ సంయుక్త మరియూ ద్విత్వాక్షరాల ముందు ఉన్న అక్షరాలూ గురువులు గా భావించాలి. మరి ఈ సంయుక్త, ద్విత్వక్షరాలను మాత్రం లఘువులు గా పరిగణించాలి. గురు లఘువులను గుర్తించడం ఎలాగో వచ్చే పాఠాల్లో చూద్దాము.