• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

16, జూన్ 2010, బుధవారం

తేట గీతి పద్యం.

పద్యాలగురించి తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉన్నా, సందర్భానుసారంగా చెప్పుకుంటే బాగుంటుందని భావిస్తూ, నేరుగా పద్యల్లోకి దిగుతున్నాను. ఇంకా మనం సందుల గురించి, సమాసాల గురించి తెలుసుకోవాలి. విసంధులు చేయడం, సంధి చేయ వలసిన చోట, చేయకుండా గానాలకోసం విడివిడి గా రాయడం, తప్పు, పైగా పద్యం అందం కూడా సన్నగిల్లుతుంది. అలాగే సమాసాలను సరిగా రాయక పోతే మనకే పద్యం చదువుతున్నప్పుడు, సరిగా అనిపించదు. అవన్నీ మనం సందర్భానుసారంగా చెప్పుకుందాము. మనం ప్రస్తుతం తేట తేట తెలుగు లో తేటగీతి ఎలా రాయాలో చూద్దాము.


పద్యాలు మన ఆర్యులు ౩ విధాలుగా చెప్పారు. ౧. వృత్తములు అంటే చంపకమాల, ఉత్పలమాల, శార్దూలము, మత్తేభము, మత్తకోకిల మొదలైనవి. ౨. జాతులు అంటే కందము, ద్విపద మొదలైనవి. ౩. ఉప జాతులు..తేటగీతి, ఆటవెలది, సీసము.


అంటే ఇప్పుడు మనం రాయబోయే తేటగీతి ఉప జాతికి చెందినదని గుర్తుపెట్టుకోండి. తేటగీతి పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి. ఒక్కొక్క పదం లో ఒక సూర్య గణము, రెండు ఇంద్ర గణాలు, మళ్ళీ రొండు సూర్య గణాలు వరుసగా వస్తాయి. మొదటి గణం మొదటి అక్షరానికీ, నాల్గవ గణం మొదటి అక్షరానికి యతి మైత్రి ఉండాలి. ప్రాస యతి వాడ వచ్చు. ప్రాస నియమము లేదు.


ఇప్పుడు అన్ని నియమాలు వరుసగా చూద్దాము. ఇందులో కంగారు పడవలసిన పని లేదు. ఛందస్సు గురించి భయపడకండి. ఈ పద్యం లో ప్రతి పాదం లో వరుసగా, ఒక సూర్య గణమూ, తర్వాత.. రొండు ఇంద్ర గణాలూ, మళ్ళీ రొండు సూర్య గణాలు రావాలి అని అనుకున్నాం గదా వాటి సంగతేమితో మొదట గా చూద్దాము.

1.ఇంద్ర గణాలు: నల IIII, నగ IIIU, సల IIUI, భ UII, ర UIU, త UUI గణాలు.

౨.సూర్య గణాలు: గలము లేక హగణం: UI ., మరియూ.. III నగణం.

మనకు ఇవి కావాలి తేటగీతి రాయాలంటే అంతే..

సూర్య - ఇంద్ర - ఇంద్ర - సూర్య - సూర్య. ప్రతి పాదం లో ఉండాలి.

మనం విడి విడి అక్షరాలతో ఈజీ గా తేటగీతి రాసేయగలం.

చూడండి. మామూలు పదాలు పట్టుకోండి చాలు.
అమ్మ అన్నము పెట్టెను కమ్మ గాను...
అమ్మ.. ఇది (U I) "గలం" లేక "హగణం".. సూర్య గణము కదా.. అన్నము...( UII) "భ" గణము.. భా న స ...ఇది ఇంద్రగణము కదా.. పెట్టెను (UII ) "భ" గణము.. భా న స ఇదీ ఇంద్ర గణమే. ఇక మనం రొండు సూర్య గణాలు వాడాలి కదా.. కమ్మ (U I) గలం లేక హగణం ఇది సూర్య గణము.. అలాగే.. గాను (U I) గలం లేక హగణం ఇదీ సూర్యగణం. కాబట్టి మనకు సులభంగా తేటగీతి లోని పద్యం లో మొదటి పాదం వచ్చేసింది. యతి విషయానికి వస్తే అమ్మ లో ఉండే "మ్మ" కు కమ్మ లొ ఉందే "మ్మ" కు యతి సరిపోయింది. ఒక పాదం పూర్తి అయింది ఇలాగే మిగత పాదాలను పూరించడానికి ప్రయత్నించండి. మరి.. ఆలస్యం వద్దు. నాకు మెయిల్ చేసినా. లేక వ్యాఖ్యల రూపం లో రాసిన చూద్దాము. ఎంత మంది అసలు ఈ పద్యాలను ఫాలో అవుతున్నారో కూడా తెలుస్తుంది.





5 కామెంట్‌లు:

రాజు సైకం చెప్పారు...

నేను ఫాలొ అవుతున్నాను సార్.. రేపటి లోపు ప్రయత్నించి రాస్తా...

Unknown చెప్పారు...

అమ్మ అన్నము పెట్టెను కమ్మ గాను
అక్క తిలకము దిద్దెను చక్క గాను
బడికి బయలుదేర వలయు ఘడియ కాగ
వాన రాకకై యెదురుచూసెను మన సిరి

GOVINDARAO చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
GOVINDARAO చెప్పారు...

అమ్మ అన్నము పెట్టెను కమ్మగాను
బిడ్డ బువ్వను తినియెను బుద్ధిగాను
నిద్ద రోయెను తడవున నిదానముగ
అమ్మ జోలను పాడగ హాయిగాను

అజ్ఞాత చెప్పారు...

ఓఓహహ్మ్హ్న నీ