"పురాణగాధలకు పుట్టినిల్లైన నైమిశారణ్యంలో.. శౌనక మహర్షి సత్రయాగం గావిస్తున్న రోజుల్లో.. స్వాహాకార, వషట్కారాలతో నైమిశారణ్యంలో అహ్లాదకర వాతావరణం నెలకొని యుండగా... అక్కడికి నిఖిల పురాణగాధా రహస్య విశేషాలు తెలిసిన సూత మహర్షి దయచేసారు. అక్కడి మునులు, ఋషులు అమితానందం పొందిన వారై, మహర్షీ.. ఇక్కడివారందరికీ.. హృదయాహ్లాదాన్ని కలిగించే పురాణం ఎదైనా చెప్పండి అనగా సూత మహర్షి నాయనలారా.." ఈ విధమైన ప్రారంభమే దాదాపు అన్ని పురాణాలకూ ఇతిహాసాలకూ.. ఉంటుంది.
ఐతే! ఏమిటీ..నైమిశారణ్యం.. ఎవరీ సూతమహర్షి అని అలోచన రావడం అరుదు. ఆ సందేహానికి సమాధానమే ఈ పోస్టింగు.
మొత్తం పురాణాలలో ఎనిమిది ఇతర దేవతలనుగురించి తెలుపుచుండగా..పది పురాణాలు శివ మహత్యాన్ని చెప్తున్నాయి. వేదాలలో వలె పురాణాల్లో కూడా శివ మహత్యం తెలిపేవి ఎక్కువ. అసలు పురాణానికి.. 1.సర్గము, 2.ప్రతిసర్గము, 3.వంశము, 4.వంశాను చరితము, 5.మన్వంతరము అనే ఐదు లక్షణాలు వుండాలని లాక్షణికులు చెప్తారు.
ఉ! అట్టిదివో పురాణము మహత్త్వము సూతుడు తద్విదుండుగా
బట్టి కనిష్ట జన్మమున బ్రాకృతుడయ్యు నురు ప్రభావులై
నట్టి మహా మునీంద్రులకు నంబుజ సంభవు నంతవారికిన్
దిట్ట తనంబు మీఱ నుపదేస మొనర్చుచునుండు బ్రహ్మమున్! (కాశీ ఖండ 1-76)
ఆహా! పురాణ విద్య మహిమ యట్టిది కదా! ఆ విద్య తెలిసినవాడు కాబట్టే..సూతుడు జన్మమును బట్టి..కనిష్టుడూ.. ప్రాకృతుడూ ఐనా..మహా మహా మునులు, ఋషులూ, బ్రహ్మసమానులైనవారికీ..దిట్టతనముతో బ్రహ్మ తత్వం ఉపదేసిశ్తూ..సకల పురాణాలనూ బోధిస్తూ ఉండేవాడు..
"అయం సాక్షాన్మహాయోగీ వ్యాసస్సర్వజఞ ఈశ్వర:
మహాభారతమాశ్చర్యం నిర్మమే భగవాన్ గురు:
తస్య శిష్యా మహాత్మానశ్చత్వారో మునిసత్తమా:
అభవంత్స మునిస్తేభ్య: పైలాదిభ్యో దదాచుచ్త్రితిం
తేభ్యోధీతా. శృతిస్సర్వా సాధ్వీ పాపప్రణాశినీ
తయా వర్ణా శ్రమాచారా: ప్రవృత్తా వేదవిత్తమా:
పురాణానాం ప్రవక్తారం సమునిర్మామయోజయేత్
తస్మా దేవ మునిశ్రేష్టా: పురాణం ప్రదదామ్యహం."
ఇది సూతుని అధికారానికి ప్రమాణంగా ఆర్యులు చెప్తూ ఉంటారు.
ఇక నైమిశారణ్య విషయనికి వద్దాము మళ్ళీ.
సీ!ఆది మనోమయంబగు నొక్క చక్రంబు
కల్పించె బ్రహ్మ జగద్ధితముగ
గల్పించి యా బండికలు డొల్చె సత్యలో
కంబున నుండి యా కమలగర్భు
డది డొల్లగిలి విష్టపాతరంబులు దాటి
క్రమముతో భూమి చక్రమున వ్రాలె
వాలి రం హస్ఫూర్తి వచ్చి వచ్చి ధరిత్రి
నిమ్నోన్నతుల శీర్ణ నేమి యయ్యె!
తే!గీ! నేమి విరిసిన కతన నన్నేల నెలవు
నైమిశంబయ్యె నదియ తానైమిశంబు
దన్మహాపుణ్య వనమున ద్వాదశాబ్ది
సత్ర యాగము గావించె శౌనకుండు.
తొల్లి ఆదిలోకంలో లోకహితార్ధమై బ్రహ్మమనోమయమగు నొక చక్రమును గల్పించెను. ఆ చక్రమును సత్యలోకమునుండి దొర్లించెను.(నేమి అంటే బండి చక్రపు కమ్మి అని అర్ధం) ఆ చక్రము దొర్లి దొర్లి అన్ని లోకములు దాటి భూలోకమునందు వ్రాలెను. అమిత వేగమున వచ్చి వచ్చి భూమిట్ట పల్లములలో చక్రముకమ్మి విచ్చి పోయిన ప్రదేశములో "నైమిశ" మయ్యెను . ఆ ప్రదేశములోని వనము గూడ నైమిశారణ్యమయ్యెను.
అదీ అసలు నైమిశారణ్యం కధ. మీ అభిప్రాయాలు తెలియజేయండి... నమస్సులతో.. శెలవు.