సీతా స్వయంవరము
సీ. ద్రవిడ కర్ణాటాంధ్ర యవన మహారాష్ట్ర
రాజ కుమారులు తేజ మలరఁ,
బాండ్య ఘూర్జర లాట బర్బర మళయాళ,
భూప నందనులు విస్ఫూర్తి మీఱ,
గౌళ కేరళ సింధు కాశి కోసల సాళ్వ
ధరణిశ పుత్రులు సిరి వెలుంగ,
మగధ మత్స్య కళింగ మాళవ నేపాళ
నృప తనూభవులు నెన్నికకు నెక్క,
తే. మఱియు నుత్కల కొంకణ ముద్ర పౌండ్ర
వత్స గాంధార సౌరాష్ట్ర వంగ చోళ
రాజ్యముల నొప్పు ఛప్పన్న రాజ సుతులు
వచ్చి రక్కామినీ స్వయంవరమునకును ||66||
కొందఱు పల్లకీ, మఱి కొందఱు తేరుల, నందలంబులం
గొందఱు, కొంద ఱశ్వములఁ, కొందఱు మత్త గజేంద్ర సంఘమున్
గొందఱు స్వర్ణ డోలికలఁ, గోరిక నెక్కి నృప నందనుల్
సందడిఁగాఁగ వచ్చిరి, బుజంబు బుజంబును ద్రోపులాడఁగన్. ||67||
వ. అట్టి సమయంబున ||68||
చ. గురు భుజశక్తి గల్గు పదికోట్ల జనంబులఁ బంప, వారు నా
హరుని శరాసనంబుఁ జొనియాడుచుఁ బాదుచుఁ గొంచు వచ్చి, సు
స్థిరముగ వేది మధ్యమునఁ జేర్చిన, దానికి ధూప దిపముల్
విరులును గంధ మక్షతలు వేదుక నిచ్చిరి చూడ నొప్పుగన్ ||69||
వ. అట్టి సమయంబున జనక భూప్లాలుందు రాజ కుమారులం గనుం గొని యిట్లనియె; ||70||
శివ ధనువు నెక్కు పెట్టిన ధీరునకు సీత నిత్తునని జనకుని ప్రకటన
ఉ. కొంకక సావధాన మతిఁ గూర్చి వినుం డిదె, మ త్తనూజకై
యుంకువ సేసిఁనాడ వివిధోజ్జ్వల మైన ధనంబుఁ, గాన నీ
శంకరు చాప మెక్కిడిన సత్త్వఘనుం డగువాని కిత్తునీ
పంకజనేత్ర సీత, నరపాలకులార! నిజంబు సెప్పితిన్. ||71||
ఆ. అనుచుఁ బలుకుచున్న యవనీశ తిలకుని
వాక్యములకు నుబ్బి, వసుమతీశ
సుతులు దామ తామె మతిలోనఁ జెలఁగుచు
దగ్గఱంగఁ బోయి ధనువుఁ జూచి, ||72||
మొల్ల రామాయణంలో రామలక్ష్మణులు అహల్యా శాపవిమోచనానంతరం సీతా స్వయంవరానికి వెళ్ళినట్లు ఉండగా..వాల్మీకి రామాయణం లో... మొదట విశ్వామిత్ర మహర్షి జనకుని యఙఞవాటిక చేరినట్లు ఆ పిదప పురోహితుడైన శతానందుని కలిసి సీతా స్వయంవరానికి వెళ్ళినట్లూ ఉంది. సరే! ఏది ఏమైతేనేమిటి! స్వయంవరమే ముఖ్య ఘట్టము కదా!
ఐతే శతానందుడు అహల్య కుమారుడు. తన తల్లి శాప విముక్తురాలైనదన్న విషయం తెలుసుకుని ఆనందపడి.. తల్లి యోగక్షేమాలు అడుగుతాడు. తర్వాత రామలక్ష్మణులవైపు తిరిగి ఓ! రామచంద్రా! ఎంత అదృష్టవంతులయ్యా మీరు.. ఈ మహర్షి అండలో ఉండడం. సర్వదా శ్రేయస్కరం. ఈయన ఎటువంటి వాడొ యెరుగుదురా అంటూ.. విశ్వామిత్రుని కధ.. "శబల గోవు" పై మనసు పడడం, తపస్సు చేసి.. రాజర్షి అవటం..తృప్తి చెందక మళ్ళీ తపస్సు చేసి బ్రహ్మర్షి అవటం చెప్తాడు. ఆ పిమ్మటే శివధనుర్భంగ విషయం ప్రస్తావనకు వస్తుంది.
మరి మన ప్రస్తుతానికి వస్తే ఎన్న్నెన్నో దేశాల రాజకుమారులు పల్లకీలమీధ రధాల మీద గుర్రాల మీద గజాల మీద సందడిగా భుజ భుజాలూ రాచుకునేంత మంది వచ్చారు అని చెప్పింది మొల్ల. వాల్మీకి రామాయణం చూస్తే స్వయంవరం ఒక రోజులో జరిగింది కాదు అనిపిస్తుంది. వాల్మీకి రామాయణంలో విశ్వామిత్రుని కోరిక మేరకు జనకుడు ఆ విల్లున్న పెట్టెను ఎనిమిది చక్రాలున్న పెట్టే ను ఐదు వేలమంది లాక్కొని వచ్చినట్టు ఉండగా..పది కోట్ల జనంబులు పంప వారు ఆ విల్లున్న పెట్టెను తెచ్చినట్టుగా ఉంది. మరీ పదికోట్లంటే ఆషామాషీ కాదు గదా! అతిశయోక్తి మరీ మిన్ను ముట్టింది మొల్లకు.
ఆ సమయంలో జనకుడు ఇలా అన్నాడు.