• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

19, జనవరి 2013, శనివారం

మొల్ల రామాయణము - 19


విశ్వామిత్రుడు వారిని తీసుకుని మిధిలా నగరం లో జరుగుచున్న సీతా స్వయంవరానికి సాగాడు. ఆ మార్గ మధ్యం లో..

శ్రీ రాముని పాద ధూళి సోక నహల్యయైన శిల

ద. ముదితాపసి వెనువెంటను
వదలక చనుదెంచునట్టి వడి రాముని శ్రీ
పద రజము సోఁకి, చిత్రం
బొదవఁగఁ దనుపట్టే నెదుట నొక యుపల మటన్ ||62||

క. పదనై, యొప్పిదమై, దడుఁ
గదలుచు బంగారు పూదె కరఁగిన రీతిన్
మొదలుచు, లావణ్య స్థితి
సుదతిగఁ జూపట్టి నిలిచె సురుచిర లీలన్. ||63||

ఉ. ఆ ముని వల్లభుండు కొనియాడుచుఁ బాడుచు, వేడ్కతోడ శ్రీ
రాముని జూచి యట్లనియె, రామ! భవ త్పద ధూళి సోఁకి, యీ
భామిని రాయి మున్ను, కులపావన! చూడఁగఁ జిత్రమ్మ్యె నీ
నమ మెఱుంగు వారలకు నమ్మఁగ వచ్చును భుక్తి ముక్తులున్ ||64||

వ. అని యక్కాంతా రత్నంబు పూర్వవృత్తాంతం బంతయునెంతయు సంతసమ్మున నమ్మ్నుజేంద్ర నందనుల కెఱింగింపుచు, మిథిలా నగరంబునకుం జనియె నచ్చట;||65||


విశ్వామిత్రుడు రామ లక్ష్మణులతో కలిసి సోణపుత్రానదీతీరం దాటి ఒక పెద్ద అడవిలో ప్రవేశించగానే రాముడు అడిగాడు.. మహర్షీ.. ఈ అడవి ఇంత ప్రశాంత రమాణీయంగా ఉంది. కానీ మనుష్యుల జాడ లేదు. ఏమిటి దీని వృత్తాంతము అని అడిగాడు. ఈ అడవిలో గౌతమ మహర్షి అహల్య తపో దీక్షలో ఉండేవారు చాలా కాలం క్రితం. ఆరోజులలో ఒక నాడు..నిఖిలలోకాశ్చర్యకర సౌందర్యవతి యైన అహల్య అందానికి ముగ్దుడై దేవేంద్రుడు,          ముని తెల్లవారు ఝామున నదీ తీరానికి వెళ్ళిన సమయంలో, ఇంట ప్రవేసించి అహల్యా..భోగార్ధియై వచ్చాను. తిరస్కరించకు అన్నాడు. ఆవిడ ఇది ఋతుకాలమా? అని అడిగింది. ఇంద్రుడు వూరుకోలేదు. ఏవేవో ధర్మ శాస్త్రాలు చెప్పి మొత్తానికి అహల్య తో శయ్యా సుఖం అనుభవించాడు. అహల్య దేవేంద్రా చాలా సంతోషం ఇక వెళ్ళి రా ! మహర్షి వచ్చే వేళ అయింది. ఆయన వస్తే ఇద్దరికీ మంచిది కాదు అనేసరికి దేవేంద్రుడు బయటికి వచ్చి పర్ణశాల దాటుతున్నడో లేదో రానే వచ్చాడు మహర్షి. అగ్నిహోత్ర సదృశ కాంతి తో విరాజిల్లే మహర్షి ఒక క్షణంలో జరిగినదంతా గ్రహించాడు. వాసవా..ఇంత మోసంతో అకృత్యానికి తలపడ్డావు. విఫలుడివవుతావు అని శపించేసి ఇటు తిరిగాడు. ఓసీ! ఇంత నీచానికి పాల్పడ్డ నీవు శిలవై ఈ బూడిద లో పడివుండు. పవిత్రాత్ముడు..రఘువంశీయుడు అయిన రామ చంద్రుడు ఈ ఆశ్రమంలో కాలు పెడితే నీకు మామూలు రూపం వస్తుంది అని ఆమెకూ శాపం ఇచ్చి తపో దీక్షకు సాగి పోయాడు గౌతమ మహర్షి. ఇదీ దీని కధ అన్నాడు. 

అలా నడుస్తున్నారో లేదో.. శ్రీ రాముని పాద ధూళి సోకి ఒక రాయి ఒక బంగారు పూదె కరిగిన రీతిలో మొదలై ఒక సుదతి గా మారింది. విశ్వామిత్రుడు పరమానంద భరితుడై... రామా.. నీ నామం చాల పవిత్రమైనది. భక్తి ముక్తి కూడా కలుగుతాయి అని దీవించాడు.

మొల్ల ఈ కధ "అని యక్కాంతా రత్నంబు పూర్వ వృత్తాంతంబంతయు నెంతయు సంతసమ్మున నమ్మంజేంద్ర నందనులకు కెరింగింపుచు" అని టూకీ గా లాగేసింది.ఆ తర్వాత మునివెంబడి రామ లక్ష్మణులు మిధిలా నగరానికి వెళ్ళారు. అక్కడ.. స్వస్తి.


కామెంట్‌లు లేవు: