• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

2, జనవరి 2013, బుధవారం

మొల్ల రామాయణము - 14


సీ. తన కీర్తి కర్పూర తతిచేత వాసించెఁ
బటుతర బ్రహ్మాండ భాండ మెల్లఁ
దన శౌర్య దీప్తిచే నిన బింబ మనయంబుఁ
బగ లెల్ల మాఁగుడు వడఁగఁ జేసెఁ
దన దాన విఖ్యాతి ననుదినంబును నర్థి
దారిద్ర్యములు వెళ్ళఁ బాఱ దఱిమెఁ
దన నీతి మహిమచే జన లోక మంతయుఁ
దగిలి సంతతమును బొగడఁ దనరెఁ,

తే. భళిర ! కొనియాడాఁ బాత్రమై పరఁగినట్టి
వైరి నృప జాల మేఘ సమీఋఅణుండు,
దినక రాన్వయ పాధోధి వనజ వైరి,
నిశిత కౌక్షేయక కరుండు దశరథుండు. ||20||

సీ. పాలింపఁ డవినీతి పరుల మన్ననఁ జేసి
పాలించు సజ్జన ప్రతతి నెపుడు,
మనుపఁ డెన్నఁడుఁ జోరులను గారవము చేసి
మనుచు నాశ్రిత కోటి ఘనముఁగాగ,
వెఱ పెఱుంగఁడు వైరి వీరులఁ బొడగన్న
వెఱచు బొం కే యెడ దొరలునొ యని,
తలఁకఁడర్థి వ్రాతములు మీఱి పైకొన్నఁ
దలఁకు ధర్మ మ్మెందుఁ దప్పునొ యని,

తే. సరవిఁ బోషింపఁ డరి గణ షట్క మెపుడు,
వెలయఁ బోషించు నిత్యమ్ము విప్రవరుల,
భాస్క రాన్వయ తేజో విభాసితుండు,
మాన ధుర్యుండు దశరథ క్ష్మావరుండు. || 21||

సీ. కనఁగొరఁ డొక నాఁడుఁ గనులఁ బరవధూ
లావణ్య సౌభాగ్య లక్షణములు,
వినఁగోరఁ డొక నాఁడు వీనుల కింపుగాఁ
గొలుచువారలమీఁది కొండెములను,
చిత్తంబు వెడలించి జిహ్వాగ్రముఁ గోరి
పలుకఁడు కాఠిన్య భాషణములు,
తలఁపఁడించుకయైన ధన కాంక్షనే నాఁడు
బంధు మిత్త్రాశ్రిత్ర ప్రతతిఁ జెఱుప.

తే. సతత గాంభీర్య ధైర్య భూషణ పరుండు,
వార్త కెక్కిన రాజన్య వర్తనుండు,
సకల భూపాల జన సభాసన్నుతుండు,
ధర్మ తాత్పర్య నిరతుండు, దశరథుండు ||2||

సీ. విర హాతిశయమున వృద్ధిపొదఁగ లేక
విష ధరుండును గోఱ విషముఁ బూనె,
తాపంబు క్రొవ్వెంచి తరియింపనోపక
పలుమాఱుఁ గడగండ్ల బడియెఁ గరులు,
కందర్ప శరవృష్టి నంద నోపక ఘృష్టి
వనవాసమునఁ గ్రుస్సి వనరు సూపె,
దీపించి వల పాప నోపక కూర్మంబు
కుక్షిలోపలఁ దలఁ గ్రుక్కి కొనియె,

తే. కుంభినీ కాంత తమమీఁది కూర్మి విడిచి
ప్రకట రాజన్య మస్త కాభరణ మకుట
చారు మాణిక్య దీపిత చరణుడైన
దశరథ దాధీశు భుజ పీఠిఁ దగిలి నంత. ||23||

క. ఆ రాజు రాజ్యమందలి
వారెల్లను నిరత ధర్మ వర్తనులగుచున్
భూరి స్థిర విభవంబుల
దారిద్ర్యం బెఱుంగ రెట్టి తఱి నే నాఁడున్. ||24||

దశరధ మహారాజు అనన్య ధైర్యస్థైర్యాలను కొనియాడుచూ... మొల్ల...ఆయన సద్గుణాలన్నిటినీ ఏకరువు పెట్టింది.  సులభమైన పదజాలం, అర్ధం కాకపోవడానికి ఎమీ లేని భాష. ఒక్కనాడు కూడా పరవధూ లావణ్యములు చూడడట. తనను నిత్యమూ కొలిచే వారి మీద ఎవరైన చాడీలు చెప్తే వినడట.నాలుకపై ఎప్పుడూ కాఠిన్య భాషతో దూషణ చేయడట. బంధుమిత్రుల విషయంలో ఆశ్రిత పక్షపాతం లేదట. ఈవిధమైన ధర్మ తాత్పర్య నిరతుడు దశరధ మహారాజు అని చెప్తోంది మొల్ల.  అసలు కధ పుత్ర కామేష్టి తోనే మొదలవుతుంది గనుకా ఆవిశేషాలు చూద్దాము. స్వస్తి.

కామెంట్‌లు లేవు: