యాగ రక్షణమునకు రాముని బంపుమని విశ్వామిత్రుని వేఁడికోలు
సీ. ఒకనాఁడు శుభగోష్ఠి నుర్వీశ్వరుఁడు మంత్రి
హిత పురోహితులును నెలమిఁ జేరి,
బంధు వర్గము రాయబారులుఁ జారులుఁ
బరిచారకులు నెల్ల సరవిఁజేరి
గాయక్లును భృత్య గణములు మిత్త్రులు
సతులును సుతులును జక్క నలరి,
సరసులుఁ జతురులుఁ బరిహాసకులుఁ గళా
వంతులు గడు నొక్క వంకఁ జేరి
తే. కొలువఁ గొలు వున్నయెడ, వచ్చి కుశికపుత్త్రుఁ
డర్థి దీవించి, తా వచ్చినట్టి కార్య
మధిపునకుఁ జెప్ప, మదిలోన నదరిపడుచు
వినయ మొప్పార నిట్లని విన్నవించె; ||46||
క. రాముఁడు దనుజులతో సం
గ్రామము సేయంగఁ గలఁడే ? కందు గదా ! నే
నే మిమ్ము గొలిచి వచ్చెద
నో మునిరాజేంద్ర ! యరుగు ముచిత ప్రౌఢిన్. ||47||
మ. అనినం గౌశికుఁడాత్మ నవ్వి, విను మయ్యా ! రాజ నీచేతఁగా
దనరా దైనను రాక్షసుల్ విపుల గర్వాటోప బాహా బలుల్
ఘనుఁడీ రాముఁడు దక్క వారి గెలువంగా రాదు, పిన్నంచు నీ
వనుమానింపక పంపు మింకఁ, గ్రతు రక్షార్ధంబు భూనాయకా ! ||48||
వ. అని ప్రియోక్తులు పలుకుచున్న విశ్వామిత్రునకు మిత్త్రకుల పవిత్రుండైన దశరథుందు మాఱాడ నోడి యప్పుడు ||49||
క. మునినాథు వెంట సుత్రా ముని నలజడి వెట్టుచున్న మూర్ఖులపై రాముని సౌమిత్రిని వెస నమ్మునితో నానంద
వార్థి మునుఁగుచుఁ బనిచెన్ ||50||
ఆ రోజులలో ఒక నాడు దశరధ మహారాజు... మంత్రి, హిత, పురోహిత, బంధువర్గ, రాయబార, జారులు, పరిచారకులు,గాయకులు, భృత్యగణము, మితృలు, సతులు, సుతులు, సరసులు, చతురులు, పరిహాసకులు, కళావంతులు, తోగూడి కొలువుదీరియుండగా..కౌశికుడు (విశ్వామిత్రుడు) ఆ సభకు విచ్చేసి..తను వచ్చిన కార్యం చెప్పాడు. మొల్ల "తా వచ్చిన కార్యమధిపునకు జెప్ప" అన్నదే గానీ.. ఏ కార్యం అనేది చెప్పలేదు. సరే ఆ విషయం విడిచి పెడదాము. అలా అనేసరికి దశరధ మహారాజు మదిలో అదరిపడి.. వినయంతో అంజలి ఘటించి విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. రాముడు బాలుడు గదా.. ఆ రక్కసులతో పోరగలడా? నేనే వస్తున్నన్ను సకల సైన్యంతో..పదండి అనగా... విశ్వామిత్రుడు ఫక్కున నవ్వి..రాక్షసుల పీచమడంచడానికి రాముడే కావాలి తక్కిన వారికి వల్లగాదు. చిన్నపిల్లవాడని అనుమానించక నాతో బంపు అని చెప్పాడు. ఏమి మాటాడలేకపోయాడు దశరధుడు. మిత్రులు ఇంకా పెద్దలు పరిపరివిధాల జెప్పగా ఒప్పుకుని చివరకు ముని వెంట పంపాడు. ముని వెంట.. రాముడు, లక్ష్మణుడు బయల్దేరాడు.. మూడు తలల కోడెనాగు పరుగులు తీస్తున్నట్టు ముగ్గురూ నడుస్తున్నారు. స్వస్తి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి