కౌశికుని యాజ్ఞపై రాముడు తాటకను గూల్చుట
మత్త. వారిఁ దోడ్కొని కౌశికుండట వచ్చు నయ్యెడ ఘోర కాం
తార మధ్యమునందు నొక్కతె దైత్య కామినీ భీకరా
కార మొప్పఁగ నట్టహాస వికార మేర్పడ వచ్చునా
క్రూర రాక్షసిఁజూసి యమ్ముని కుంజరుం డొగి రామునిన్. ||51||
క. తాటక వచ్చిన దదిగో
తాటది యని యెంచుచు మొగమాడక నీ వీ
పాటి పడవేయు మని తడ
బాటున శంకించు రామ భద్రున కనియెన్ ||52||
వ. ఇట్లు చెప్పిన యామునిచంద్రుని పల్కులాలించి, రామచంద్రుండు తన యంతరంగమ్మున నిట్లని వితర్కించె; ||53 ||
ఈ యాఁడుదానిఁ జంపఁగ
నా యమ్మున కేమి గొప్ప ? నగరే వీరుల్?
చీ యని రోయుచు నమ్ముని
నాయకు భయ మెఱిఁగి తన మనమ్మున నలుకన్. ||54 ||
క. వ్రేటు గొని రామచంద్రుఁడు
సూటిగ నొక దిట్ట కోల సురలు నుతింపన్
ఘోటక సమ వక్షస్థలఁ
దాటక నత్యుగ్రలీల ధరపైఁ గూల్చెన్ ||55||
వ. ఇట్లు తాటకం గీటణంచినయంత, న మ్మునీంద్రుందు మేటి సంతోషమ్మున రామునింగొనియాడుచు, నశ్రమంబున నిజాశ్ర మంబున కేఁతెంచి, రామ సౌమిత్రుల సాయంబున జన్నంబుసేయుచున్న సమయంబున ||56||
రాముఁడు రాక్షసులను జంపి తపసి జన్నమును గాచుట
క. ఆకాశవీధి నెలకొని
రాకాసులు గురిసి రమిత రక్తముఁ, బలలం
బా కౌశికు యజ్ఞముపై
భీకరముగ ముని గణంబు భీతిన్ బొందన్ ||57||
ఉ. అంబర వీధి నిల్చి త్రిదశాంతకు లెంతయు నేచి, రక్తమాం
సంబులు గాధి నందనుని జన్నముపైఁ గురియంగ, నంతలో
నంబర రత్న వంశ కలశాంబుధి చంద్రుఁడు, రామచంద్రుఁడు
గ్రంబుగఁద్రుంచెఁ జండ బల గర్వులఁ దమ్ముఁడు దాను నొక్కటై ||58||
వ. ఇట్లు రామచందృండు సాంద్ర ప్రతాపంబు మించ నింద్రారులఁ ద్రుంచిన నమ్మునిచండ్రుఁడు నిర్విఘ్నంబుగా జన్నం బొనర్చి రామ సౌమిత్రులంబూజించె నట్టి సమయమ్మున;
క. ధరణీ సుత యగు సీతకుఁ
బరిణయ మొనరింప జనక పార్థివుఁ డిల భూ
వర సుతుల రం డని స్వయం
వర మొగిఁ జాటించె నెల్ల వారలు వినఁగన్ ||60||
వ. ఇట్లు స్వయంవర మహోత్సవ ఘోషంబున సంతోషమ్ము నొంది విశ్వామిత్రుండు రామ సౌమిత్రుల మిథిలా నగరంబునకుఁ దోడ్కొని, చనుచుండు మార్గంబున; ||61 ||
వారిని తీసుకుని అలా వెళ్తూ ఉండగా..ఒక ఘోరాడవి లో ప్రవేశించారు. ఆ అడవిలో భీకరాకారం తో ఒక రాక్షసిని చూసి. రామా.. అదిగో తాటక.. ఆడది అని అనుమానిచక దాన్ని సం హరించు అనగానే..రామచంద్రుడు అలోచనలో పడ్డాడు.ఆడదాన్ని చంపడమా మానడమా అని.. విశ్వామిత్రుడు.. ఎమయ్యా.. రామచంద్రా ఏమిటి నీ సందేహం?
ఆడదని చూడకు. దుష్టులను దండించడం రాజు యొక్క విధి. అనే లోపు దాని ముక్కూ చెవులూ.. చేతులూ ఖండించగా అది రాళ్ళ వాన కురిపిస్తోంది. రాముడు ఒక్క శబ్దవేది వదిలాడు.. అది దాని రొమ్ము చీల్చి నేలకు పడవేసింది. ముని సంతసించి వారికి బాలాతిబల విద్యలు నేర్పాడు. అవి ఉన్న వారికి ఆకలి దప్పులు వుండవు. అలసట ఉండదు. అలా వారిని తీసుకుని సాగుతున్నాడు ముని.
రానే వచ్చారు ముని ఆశ్రమానికి. యఙఞం ప్రారంభం అయింది. రక్కసులు ఆకాశ వీధి లో చేరి రక్త మాంసాలు కురిపించే దానికి సిద్ధం కాగా.. అక్కడ ఒక మేఘ మండలం సృష్టించి మధ్యలోనే ఆపు చేసారు. మారీచ సుబాహులలో ఒకడు చావగా మిగిలిన వాడిని శత యోజన దూరంలో సముద్రం ఒడ్డున పడేట్టు బాణం వదిలాడు రాముడు.
యఙఞం నిర్విఘ్నంగా సాగి పోయింది. విశ్వామిత్రుడు వారిని తీసుకుని మిధిలా నగరం లో జరుగుచున్న సీతా స్వయంవరానికి సాగాడు. ఆ మార్గ మధ్యం లో... స్వస్తి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి