• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

11, జనవరి 2013, శుక్రవారం

మొల్ల రామాయణం - 16

అగ్నిదేవుఁడు ప్రత్యక్షమై దశరథునకుఁ బాయస మిచ్చుట

మ. ఇల సాకేత నృపాల శేఖరుఁడు దా హేలా విలాసంబుతో
ఫల కాంక్షన్ గ్రతువుం బొనర్చినయెడన్ బంగారు పాత్రమ్ము లో
పల దుగ్ధాన్నము చాల నించుకొని తాఁ బ్రత్యక్షమ్మై నిల్చి ని
ర్మల తేజంబునఁ బావకుండనియెఁ బ్రేమన్ మంజు వాక్యంబులన్. ||37||

క. భూపాల ! నీదు భార్యల
కీ పాయస మారగింప నిమ్మీ ! తనయుల్
శ్రీపతి పుత్త్ర సమానలు
రూపసు లుదయింతు రమిత రూప స్ఫూర్తిన్. ||38||

వ. అని చెప్పి య ప్పాయస పాత్రంబు చేతి కిచ్చిన ||39||

ఆ. పాయసమ్ము రెండు భాగముల్ గావించి,
యగ్ర సతుల కీయ, నందులోన
సగము సగము దీసి మగుద సుమిత్రకు
నొసఁగి, రంత నామె మొసవెఁ బ్రీతి. ||40||

కౌసల్యా కైకేయి సుమిత్రల దౌహృద లక్షణములు

వ. అంతం గొన్ని దినంబులకుఁ గౌసల్యా కైకేయీ సుమిత్రలు గర్భవతులై యొప్పారుచుండ, ||41||

సీ. ధవళాక్షులను మాట తథ్యంబు గావింపఁ
దెలు పెక్కి కన్నులు తేట లయ్యె,
నీల కుంతల లని నెగడిన యా మాట
నిలుపంగ నెఱులపై నలుపు సూపె,
గురు కుచ లను మాట సరవి భాషింపంగఁ
దోరమై కుచముల నీరు వట్టె,
మంజు భాషిణులను మాటదప్పక యుండ
మొలఁతల పలుకులు మృదువు లయ్యెఁ

తే. గామిను లటంట నిక్కమై కాంతలందు
మీఱి మేలైన రుచులపైఁ గోరి కయ్యె,
సవతి పోరనఁ దమలోన సారె సారె
కోకిలింతలు, బెట్టు చిట్టుములుఁ బుట్టె. ||42||

వ. మఱియును

సీ. తను మధ్య లను మాటఁ దప్పింప గాఁబోలుఁ
బొఱ లేక నడుములు పొదలఁ జొచ్చెఁ
గుచములు బంగారు కుండలూ యను మాట
కల్లగా నగ్రముల్ నల్ల నయ్యెఁ,
జంద్రాస్యలను మాట సందియమ్ముగఁ బోలు
గర్భ భారమ్ములఁ గాంతి దప్పె.

తే. ననుచుఁ గనుగొన్న వారెల్ల నాడుచుండఁ,
గట్టు చీరెల వ్రేఁకంబు పుట్టుచుండఁ,
నా సతులఁ జూచి యందఱు నలరుచుండఁ,
గాంతలకు నంత గర్భముల్ కానుపించె. ||44||

శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘ్నుల యవతారము

వ. ఇట్లు దుర్భరంబులైన గర్భంబులు దాల్చిన కౌసల్యాది కాంతా త్రయమ్మును జైత్ర మాసమ్మున, శుక్ల పక్షమ్మున, నవమీ, భాను వాసరమ్మునఁ, బునర్వసు నక్షత్రమ్మునఁ, గర్కటక లగ్నంబున శ్రీరామభరతశత్రుఘ్నులంగాంచినం దదనంతరంబున దశరథుండు యథోచిత కర్తవ్యంబులు జరిపి యప్పది దినంబులు నరిష్టంబు లేక ప్రతి దిన ప్రవర్ధమాన మగుచున్న కుమార చతుష్ట యంబునకుఁ గాలోచితంబు లగు
చౌ లోపనయ నాది కృత్యంబులు గావించి, వెండియు విద్యా ప్రవీణు లగునట్టు లొనర్చి, గజాశ్వ రథా రోహణంబులు నేర్పి, ధనుర్వేద పారగులం గావించి, పెంచుచున్న సమయమ్మున. ||45||


దశరధ మహారాజు సంతానార్ధియై క్రతువొనర్చగా..అగ్ని దేవుడు ప్రత్యక్షమయ్యాడు.. బంగారు పాత్రలో పాయసం ఇచ్చి.. ఇలా చెప్పాడు. ఓ! మహారాజా.. ఇదిగో పాయసం.. దీనిని మీ భార్యలకివ్వుము నీకు శ్రీ పతి పుత్ర సమానులు, రూపసుందరులు అయిన కుమారులు కలుగుతారు అని చెప్పి అంతర్ధానమయ్యాడు.


దశరధ మహారాజు ఆ పాయసాన్ని తన భార్యలకివ్వగా వారు గర్భవతులైనారు. అప్పుడు వారి శరీర లావణ్యాల వర్ణన తర్వాత భార్యలు మువ్వురూ..చైత్ర మాసంలో..శుక్ల పక్షంలో..నవమీ తిధిన భాను వాసరంలో..పునర్వసూ నక్షత్రంలో..శ్రీ రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు జన్మించారు. దశరధుడు క్రమంగా వారికి విద్యా బుద్ధులూ..ధనుర్విద్యనూ.. గుర్రపు స్వారి, ఏనుగు ని అధిరోహించడం మొదలైన రాచరికపు విద్యలన్నీ సాంగోపాంగం గా నేర్పించాడు. ఆ రోజులలో ఒకనాడు...

స్వస్తి.

కామెంట్‌లు లేవు: