• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

9, జనవరి 2013, బుధవారం

మొల్ల రామాయణము - 15


దశరథుఁడు పుత్రకామేష్టి కావించుట

సీ. సంతాన లబ్ధికై చింతించి,
శిష్ట వర్తనుఁ డౌ వశిష్ఠుఁ జూచి,
తన కోర్కి వినుపింప, విని మునిసింహుండు
పలికె ఋశ్యశృంగు నెలిమిఁదేర,
ఘనుఁ డాతఁ డొగిఁ బుత్రకామేష్ఠి యనుపేర
యాగమ్ముఁ గావింప, నందువలన
వినుతి కెక్కఁగఁ జాలు తనయులు గలుగుట
సిద్ధమ్ము, నామాట బుద్ధిలోన

తే. నిలుపు మని చెప్ప నా రాజు నెమ్మితోడ
నకుటి లాత్మకు నా విభాండకుని తనయు
నెలమి రావించి, పుత్రకామేష్టి యనెడి
జన్న మొనరించు చున్నట్టి సమయమునను, ||26||

సురల మొఱ లాలించి శ్రీ మహావిష్ణువభయ మొసంగుట

ఉ. రావణుచేతి బాధల నిరంతరమున్ బడి వేఁగి, మూఁకలై
దేవత లెల్ల గీష్పతికిఁ దెల్లముగా నెఱిఁగింప, వారి రా
జీవ తనూజుఁ డున్నెడకు శీఘ్రము తోడ్కొనిపోయి చెప్ప, నా
దేవుఁడు విష్ణు సన్నిధికి దిగ్గనఁ జేకొనిపోయి యిచ్చటన్, ||27||

వ. అప్పురాణ పురుషోత్తముఁ గాంచి, నమస్కరించి, యింద్రాది దేవతలం జూపి,
బ్రహ్మ యిట్లని విన్నవించె; ||28||

ఉ. రావణుఁ డుగ్రుఁడై తన పరాక్రమ శక్తిని వీరి సంపదల్
వావిరిఁ గొల్లలాడి త్రిదివంబును బాడుగఁ జేయ, నేఁడు దే
వావళి దీన భావమున నక్కడ నుండఁగ నోడి, భీతిచే
చేవరఁ గానవచ్చె నిఁక దేవర చిత్తము వీరి భాగ్యమున్. ||29||

వ. అని విన్నవించిన విని వనరులోచనుందు దయాయత్త చిత్తుండై యనిమిషనాయకుని
గూర్చి యిట్లానతిచ్చె; ||30||

తే. వనజ గర్భుని గుర్చి రావణుఁడు మున్ను
తపముఁజేసిన వర మిచ్చుతఱినిఁ దనకు
నేరిచేఁ జావు లేకుండఁ గోరువాఁడు
నరుల వానరులను జెప్ప మఱచినాఁడు ||31||

వ. అ క్కారణంబునం జేసి, ||32||

తే. వనరు గలిగెను మనకు రావణుని జంప,
వినుఁడు మీరెల్ల నామాట వేడ్క మీఱ,
దశరథుం డనురాజు సంతాన కాంక్ష
నొనర జన్నంబు గావించుచున్నవాఁడు ||33||

క. ధరణిపతి యగు దశరథ
నరనాయకు నింటఁ బుట్టి నర రూపమునం
బెరిగెద; మీరును, మేమును
సుర కంటకు మీఁద లావు సూపుటకొఱకై ||34||

క. కొందఱు కపి వంశంబునఁ
గొందఱు భల్లుక కులమున గురు బలయుతులై
యందఱు నన్ని తెఱంగుల
బృందారకులార! పుట్టి పెరుగుఁడు భువిపై ||35||

వ. అని, కృపా ధురీణుండైన నారాయణుఁ డనతిచ్చిన విని, వనజాసనాది దేవతా నికరం
బవ్వనజోదరుని పాదారవిందమ్ములకు వందనమ్ము లాచరించి, నిజ నివాసమ్ములకుం జని
రయ్యవసరమ్మున. ||36||


దశరధ మహారాజు సంతానానికై చింతించి చింతించి, గురువైన వశిష్థునితొ తెలుపగా, ఋష్యశృంగుని రావించి పుత్రకామేష్టి యాగం జరిపినట్లైతే మీ కోరిక నెరవేరుతుంది నిర్విఘ్ననంగా అని చెప్తాడు. వెనువెంటనే ఋష్యశృంగుని రావించి పుత్రకామేష్టి జరుపుతూ ఉండగా.. రావణుని బాధలకు తాళలేక మునులూ,  ఇంద్రాది దేవతలూ అక్కడ.. విష్ణు లోకంలో.. విష్ణువును శరణు వేడగా.. మరేమీ భయంలేదు.. రావణుడు "ఎవరిచేతా చావు లేకుండా" వరం కోరుకునే సమయం లో  నరులనూ.. వానరులనూ చెప్పడం మరచిపోయాడు కనుక నేను దశరధ మహారాజు చేస్తున్న పుత్రకామేష్టిని ఆసరాగా తీసుకొని వాని ఇంట జన్మిస్తాను. మీరూ.. భల్లూక కులంలో.. వానరకులంలో ఎవరికి తోచిన రీతి వారు జన్మించండి. అక్కడ భూలోకంలో పుట్టి పెరగండి తర్వాతి కధ నేను నడిపిస్తాను అని వారికి శెలవిచ్చాడు.




కామెంట్‌లు లేవు: