• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

23, జులై 2010, శుక్రవారం

సీస పద్యం విశేషాలు

సీస పద్యం గురించి మీకు కొన్ని ఆసక్తి కరమైన విశేషాలు తెలియజేయలనుకుంటున్నాను. సీస పద్యం చాలా ప్రాచీనమైనది. మొదటగా ఈ పద్యాన్ని గుణగ విజయాదిత్యుని కందుకూరు శాశనం (క్రీ.శ.850 సం!!) లో చూసారు. అంతకు ముందే ఎన్నో సవత్సరాలనుంచీ ఉండి ఉండవచ్చు. అయితే మనకు తెలిసింది మాత్రం 1160 సంవత్సరాల క్రితం. ఈ పద్యం చాల వరకూ శిధిలమైందని చరిత్ర కారులు చెప్పారు. అయితే ఉన్నంతవరకూ కొమర్రాజు లక్ష్మణ రావు గారు ఇచ్చారు. చూద్దాము.
"శ్రీ నిరవద్యుండు చిత్తజాత సముండు
శివ పద వర రాజ్య సేవితుండ
ఖిలుడు ననృతరిపు బలుడు నాహవరావ
దండమోద్య సిఘాసనుండగణిత
దానమాన్యుండు దయా నిలయుండును
భండన నండన పండరంగు
...................................కొలది లేని
కొట్టము ల్వోడిచి గుణక నల్ల
తాని పక్ష పాతి................
....................విభవ గౌరవేంద్ర..
ఈ పద్యం లో ఒక విశేషం ఏమిటంటే.. కొలది లేని అనే మాట వచ్చేదాకా అన్నీ తత్సమ పదాలే కావడం విశేషమే! ఈ పద్యం ఎ పాదానికి ఆ పాదం విడిపోకుండా వుండే "గునుగు సీసం" కావడం మరొక విశేషమని పెద్దలు చెప్తున్నారు. నాహవరావ దండమోద్య సిఘాసనుండగణిత దానమాన్యుండు అనే పెద్ద పెద్ద సమాసాలు అప్పుడే మొదలైన విశేషం గమనించారు గదా.

అలాగే ప్రాచీన కాలం లో ఉన్న పద్యాలను (అంటే అవి ఆవిష్కరింప బడ్డ సంవత్సరాల ద్వారా) మనకు దొరికిన శిలా శాసనాల ద్వారా వాటిని చూద్దాము.
తరువోజ - పండరంగుని అద్దంకి శాసనం - క్రీ.శ 848
ఆట వెలది - గునగ విజయాదిత్యుని ధర్మవరం - క్రీ.శ 850
తేట గీతి - గుణగ విజయాదిత్యుని ధర్మ వరం శాసనం - క్రీ.శ ౮౪౮
మధ్యాకర - బెజవాడ యుద్ధ మల్లుని శాసనం - క్రీ.శ. ౮౮౫
కందం - జిన వల్లభుని కుర్కియాల శాసనం - క్రీ.శ. ౯౪౧
చంపకమాల - గుణగ విజయాదిత్యుని సాతలూరి శాసనం - క్రీ.శ ౮౪౮
ఉత్పలమాల - విరియాల కామసాని శాసనం - క్రీ.శ.1000 ప్రాంతం లో.
మత్తేభం - సర్వదేవుని ఆది పురాణం - క్రీ.శ. 953.
రగడ - రాజ రాజు కోరుమిల్లి శాసనం - క్రీ.శ 1022.
పై పట్టిక ద్వారా ముఖ్యమైన చందస్సులు ఆది నుంచీ ఉన్నయన్న విషయం తెలుస్తోంది. వచన రచన అనేది లేక పొయినా, చక్కని పద్య రచన కు ఆనాడే బీజం పడిందన్న విషయం బోధ పడుతోంది. వచన రచన కేవలం శాసనల్లో మాత్రమే చూడగలం.
నన్నయార్యునికి ముందే కవులు వున్నారు. దానికి సాక్ష్యం ఉంది. ఐతే అవి సమగ్రం గా లేవు. సంపూర్ణ కావ్యాలేవీ దొరకలేదు. సర్వదేవుదనే కవి ఆది పురాణం రాసాడని అంటారు. ఆది పురాణం దొరికితే సర్వదేవుడు ఆది కవి లేకపోతే ఆది కవి అభ్యర్ధి గా మిగిలి పోతాడని ఆరుద్ర అన్నారు. ఏది ఏమైనా మనకు ఆనాడు పద్యాలను గ్రంధస్తం చేయక పోవడం వలన కానీ మరి ఇతర కారణాల వాళ్ళ కానీ, చారిత్రక విశేషాలు లభింపక పోవడం తెలుగు జాతికి తీరని లోటు. కాదంటారా!!!! స్వస్తి.

1 కామెంట్‌:

రసజ్ఞ చెప్పారు...

చాలా చక్కని వివరణ ఇస్తున్నారండీ అన్నిటికీ. వారానికొకటి చొప్పున నేర్చుకుంటాను.